HomeతెలంగాణRevanth: నెలనెలా ఢిల్లీకి కప్పం -ఆర్ఆర్‌ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీగా రేవంత్‌ సర్కార్‌

Revanth: నెలనెలా ఢిల్లీకి కప్పం -ఆర్ఆర్‌ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీగా రేవంత్‌ సర్కార్‌

హైదరాబాద్‌, (తెలుగుప్రభ): రాష్ట్రంలో ప్రజాపాలన మంటగలిసిందని, రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ‘ఆర్ఆర్‌ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ’గా మారిందని బీజేపీ నేతలు తీవ్రంగా విమర్శించారు. భూభారతి 22ఏ నిషేధిత జాబితాలో రైతులు, ప్రజల భూములను అక్రమంగా చేర్చడంపై హైదరాబాద్‌ ఇందిరాపార్క్‌ ధర్నాచౌక్‌లో బీజేపీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా 22ఏ భూముల వ్యవహారంపై సిట్టింగ్‌ జడ్జితో జ్యుడీషియల్‌ విచారణ జరపాలని, నిషేధిత జాబితాలో చేర్చిన భూములను బేషరతుగా తొలగించాలని నేతలు డిమాండ్‌ చేశారు. బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన మహాధర్నాలో రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రాంచందర్‌రావు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్‌, ఎంపీలు ఈటల రాజేందర్‌, డీకే అరుణ, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, గోడం నగేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

22ఏ జాబితా అక్రమాలపై సమగ్ర విచారణ కోసం హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో వెంటనే జ్యుడీషియల్‌ ఎంక్వైరీ వేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు డిమాండ్‌ చేశారు. భూభారతి, 22ఏ నిషేధిత జాబితా పేరుతో రైతులు, మధ్యతరగతి ప్రజలను ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ధరణి పేరుతో అవకతవకలకు పాల్పడితే.. వాటిని సరిదిద్దుతామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం మరింత దారుణంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.

నిషేధిత జాబితా నుంచి భూములను తొలగించే విషయంలో గతంలో 15 శాతం కమీషన్లు ఉండేవని, ఇప్పుడు 30 శాతం కమీషన్లు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. సర్వే నంబర్‌లో కొంత భాగంపై వివాదం ఉంటే మొత్తం భూమిని 22ఏ జాబితాలో చేర్చి ప్రజలను వేధిస్తున్నారని అన్నారు. మల్కాజిగిరి వంటి శివారు ప్రాంతాల్లోని చిన్న ప్లాట్లతో పాటు జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌లోని నిర్మాణాలను సైతం 22ఏలో చేర్చడం దారుణమన్నారు.

కుప్పకూలిన రెవెన్యూ వ్యవస్థ
రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందని రాంచందర్‌రావు విమర్శించారు. సుమారు 50 లక్షల మంది తమ భూములను అమ్ముకోలేక, పిల్లల చదువులు, పెళ్లిళ్ల కోసం బ్యాంకు రుణాలు పొందలేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. సొంత భూమిపై హక్కు రాజ్యాంగబద్ధమైన హక్కు అని, ప్రభుత్వం దానిని కూడా కాలరాస్తోందని ఆరోపించారు. 22ఏ జాబితాలోని రైతులు, ప్రజల భూములను తక్షణమే విముక్తి చేయాలని, లేదంటే సడక్‌ నుంచి సదన్‌ వరకు బీజేపీ రాజీలేని పోరాటం చేస్తుందని హెచ్చరించారు.

ఆర్ఆర్‌ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ: కిషన్‌రెడ్డి
ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజా పీడనకు పాల్పడుతోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణను ‘రేవంత్‌రెడ్డి – రాహుల్‌గాంధీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ’గా మార్చేశారని ఆరోపించారు. 22ఏ జాబితా, భూముల అమ్మకాలు, ప్రైవేట్‌ సెటిల్మెంట్ల ద్వారా వచ్చిన డబ్బును కాంగ్రెస్‌ అధిష్ఠానానికి తరలిస్తున్నారని ఆరోపించారు. గతంలో కేసీఆర్‌ ప్రభుత్వం ప్రభుత్వ భూములను విక్రయిస్తే.. ఇప్పుడు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కూడా అదే విధానాన్ని అనుసరిస్తోందని అన్నారు. యూనివర్సిటీ భూములు, హౌసింగ్‌ బోర్డు స్థలాలు, పార్కులు, కమ్యూనిటీ అవసరాలకు కేటాయించిన స్థలాలు, దేవాదాయ శాఖ భూములపై కూడా ప్రభుత్వం కన్నేసిందని ఆరోపించారు.

పేరు మారింది.. దోపిడీ మారలేదు: ఏలేటి
పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ధరణి అక్రమాలను బయటకు తీస్తానని చెప్పిన రేవంత్‌రెడ్డి.. అధికారంలోకి వచ్చిన తర్వాత భూభారతి పేరుతో వ్యవస్థ పేరు మాత్రమే మార్చారని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు. 22ఏ జాబితాలో ప్రైవేట్‌ భూములను ఏ ప్రాతిపదికన చేర్చుతున్నారో, రాత్రికి రాత్రే ఎలా తొలగిస్తున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఆస్తి హక్కును కాపాడాల్సిన ప్రభుత్వం 22ఏను ఉపయోగించి భూ దోపిడీకి పాల్పడుతోందని ఆరోపించారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

రాష్ట్రంలో జరుగుతున్న భూదందాలతో పాటు గత ప్రభుత్వ హయాంలోని ధరణి, కాళేశ్వరం, మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ, ఫార్ములా ఈ – రేసింగ్‌, ఫోన్‌ ట్యాపింగ్‌ తదితర వ్యవహారాలపై సమగ్ర విచారణ కోసం సీబీఐకి లేఖ రాయాలని మహేశ్వర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే అవినీతికి పాల్పడిన మంత్రులు, అధికారులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం 22ఏ సమస్యతో నష్టపోయిన బాధిత రైతు చేతుల మీదుగా నిమ్మరసం తాగి మహేశ్వర్‌రెడ్డి దీక్ష విరమించారు.

బాధితులకు అండగా బీజేపీ: లక్ష్మణ్
రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే భూములపై కన్నేసిందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ కె. లక్ష్మణ్‌ ఆరోపించారు. సంక్షేమ ప్రభుత్వంలా కాకుండా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపార సంస్థలా వ్యవహరిస్తోందని విమర్శించారు. పేదల భూములను లాక్కుంటే ఊరుకునేది లేదని ఎంపీ ఈటల రాజేందర్‌ హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు అండగా నిలిచేందుకు బీజేపీ ముందుకు సాగుతుందని అన్నారు. 22ఏ సమస్యతో నష్టపోయిన బాధితులు పెద్ద సంఖ్యలో మహాధర్నాలో పాల్గొని తమ సమస్యలను నేతల దృష్టికి తీసుకువచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News