Friday, February 13, 2026
HomeTop StoriesCabinet : మేడారం సాక్షిగా.. మున్సిపల్ ఎన్నికలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

Cabinet : మేడారం సాక్షిగా.. మున్సిపల్ ఎన్నికలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

Telangana Cabinet approves municipal polls : సమ్మక్క-సారలమ్మ సన్నిధిలో, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా హైదరాబాద్ బయట, మేడారంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో, మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. గోదావరి పుష్కరాల అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టులు, మెట్రో విస్తరణ వంటి అనేక కీలక అంశాలపై కేబినెట్ పచ్చజెండా ఊపింది. అసలు ఈ చారిత్రాత్మక భేటీలో తీసుకున్న ఆ నిర్ణయాలేంటి..?  ఎన్నికల నగారా ఎప్పుడు మోగనుంది..?

- Advertisement -

మేడారం మహాజాతర నేపథ్యంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం మేడారంలోని హరిత హోటల్‌లో రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. సుమారు రెండు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ భేటీలో, పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

మున్సిపల్ ఎన్నికలకు ఆమోదం : గడువు పూర్తయిన 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ ఏకగ్రీవంగా ఆమోదించిందని, సమావేశం అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియాకు తెలిపారు. బీసీ రిజర్వేషన్లపై డెడికేషన్ కమిషన్ నివేదిక ఇచ్చిందని, దాని ప్రకారమే రిజర్వేషన్లు కూడా ఖరారయ్యాయని ఆయన స్పష్టం చేశారు. కేబినెట్ ఆమోదంతో, ఎన్నికల సంఘం త్వరలోనే షెడ్యూల్‌ను విడుదల చేసే అవకాశం ఉంది.

కేబినెట్ తీసుకున్న మరిన్ని కీలక నిర్ణయాలు..

గోదావరి పుష్కరాలు: 2027లో రానున్న గోదావరి పుష్కరాల కోసం, బాసర నుంచి భద్రాచలం వరకు ‘టెంపుల్ సర్క్యూట్’ ఏర్పాటు చేసి, శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించారు.
సాగునీరు: ములుగు జిల్లాకు సాగునీరు అందించేందుకు ‘పొట్లపూర్ ఎత్తిపోతల పథకం’ నిర్మాణానికి ఆమోదం తెలిపారు.
హైదరాబాద్ మెట్రో: మెట్రో ఫేజ్-2 (ఏ, బి) దశల విస్తరణకు అవసరమైన భూసేకరణ కోసం రూ.2,787 కోట్లు కేటాయించేందుకు కేబినెట్ పచ్చజెండా ఊపింది.
భూ కేటాయింపులు: 14 ప్రభుత్వ శాఖలకు అవసరమైన భూముల కేటాయింపునకు ఆమోదం తెలిపారు.

చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా మేడారంలో కేబినెట్ భేటీ నిర్వహించాం. వీలైనంత త్వరగా మున్సిపల్ ఎన్నికలు జరపాలని కేబినెట్ ఏకగ్రీవంగా ఆమోదించింది.”
– పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి

మేడారంలోనే ఎందుకు : “జనం కోసం కాకతీయులపై కత్తిదూసిన ధీరవనితలు సమ్మక్క-సారక్క. వారి స్ఫూర్తితోనే, తొలిసారి హైదరాబాద్ బయట, గిరిజన క్షేత్రంలో కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశాం,” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశానికి ముందు, సీఎం, మంత్రులు జాతర భద్రతా ఏర్పాట్లను కూడా పరిశీలించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News