Telangana Cabinet Meeting: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగాల్సిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ (కేబినెట్) సమావేశం మే 23వ తేదీకి వాయిదా పడింది. తొలుత ఈ సమావేశాన్ని మే 21న నిర్వహించాలని భావించినప్పటికీ, అదే రోజున ‘బాసర సరస్వతి అంత్య పుష్కరాలు’ ప్రారంభం కానుండటం, మంత్రులు ఆ కార్యక్రమాల్లో బిజీగా ఉండనుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మే 23న ముఖ్యమంత్రి యాదగిరిగుట్టలో పర్యటించనుండటంతో మొదట అక్కడే కేబినెట్ భేటీ జరుగుతుందని ప్రచారం సాగినప్పటికీ, ఈ కీలక సమావేశం హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయంలోనే జరగనుంది. జూన్ 2న జరిగే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది.
Also read: Metro: హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు కేంద్రం గ్రీన్ సిగ్నల్!
కేబినెట్ భేటీ ఎజెండాలోని అంశాలివే..
ఇందిరమ్మ ఇళ్ల పథకం: జూన్ 2 నుంచి ప్రారంభం కానున్న రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి అర్హుల ఎంపిక, మార్గదర్శకాలపై చర్చించనున్నారు.
భూముల విలువల సవరణ: రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ ధరల (మార్కెట్ వాల్యూ) పెంపు ప్రతిపాదనలపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఇతర అంశాలు: హ్యామ్ (HAM) రోడ్ల పనులు, కొత్త ఆసరా పింఛన్లు, ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల బీమా పథకం వంటి సంక్షేమ కార్యక్రమాలపై మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించనుంది. మరోవైపు, ఉద్యోగులు, పింఛనుదారుల ఆరోగ్య కార్డులు, ఉద్యోగ నియామకాలు, ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణ, జర్నలిస్టుల ఇళ్లస్థలాల అంశాలను చర్చించే అవకాశాలున్నాయి. కాగా, అదే రోజు (మే 23న) సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట టెంపుల్ సిటీలో రూ. 43 కోట్లతో నిర్మించనున్న లక్ష్మీ నరసింహ స్వామి వేద పాఠశాల భవన నిర్మాణానికి కంచి పీఠాధిపతితో కలిసి భూమిపూజ చేయనున్నారు.

