Telangana Women Self Help Groups : తెలంగాణ రాష్ట్రంలో మహిళా శక్తి సరికొత్త చరిత్రకు వేదికైంది. పొదుపు సంఘాల అక్కాచెల్లెమ్మలను ఆర్థికంగా, సామాజికంగా జగజ్జేతలుగా మార్చేలా ప్రజా ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. రాష్ట్ర సచివాలయం నుంచి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి వర్చువల్ విధానంలో ఒకేసారి ఏకంగా 8,000 ఇందిరా గాంధీ స్త్రీ శక్తి భవనాలకు (గ్రామ మహిళా భవనాలు) ఘనంగా శంకుస్థాపన చేశారు. దేశ చరిత్రలోనే ఒకే విడతలో ఇన్ని వేల మహిళా భవనాలకు పునాది రాయి వేయడం ఇదే తొలిసారి కావడం విశేషం.
మహిళల నిజాయితీని కొనియాడుతూనే, మరోవైపు ప్రభుత్వ సొమ్మును దగా చేస్తున్న కొందరు ‘ధాన్యపు దొంగల’పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బ్యాంకుల చుట్టూ తిరుగుతూ వందల కోట్లు ఎగ్గొట్టి పారిపోయే బడా బాబులు ఒకవైపు ఉంటే.. రూపాయి అప్పు తీసుకుంటే దేవుడి పైసల్లా తిరిగి చెల్లించే నిర్మల్ జిల్లా మహిళా స్వయం సహాయక సంఘాలు (SHG) మరోవైపు ఆదర్శంగా నిలిచాయని సీఎం ప్రశంసల జల్లు కురిపించారు.
ఇందిరా మహిళా శక్తి: కోటి మంది ‘కోటీశ్వరుల’ లక్ష్యం : రాష్ట్రంలోని మహిళా సంఘాలను కేవలం పొదుపు గ్రూపులుగానే ఉంచకుండా, రాబోయే 2034 నాటికి రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మార్చడమే తమ ప్రభుత్వ అంతిమ సంకల్పమని సీఎం స్పష్టం చేశారు. ఈ సరికొత్త భవనాలు కేవలం సమావేశాలకే పరిమితం కావు; ఇవి మహిళా పారిశ్రామికవేత్తల నైపుణ్యాభివృద్ధి శిక్షణకు, స్థానిక ఉత్పత్తుల మార్కెటింగ్ కేంద్రాలుగా విరాజిల్లనున్నాయి.
Also Read: https://teluguprabha.net/national-news/supreme-court-slams-nta-neet-ug-2026-paper-leak-case-cbi-probe/
రుణాల పరిమితి పెంపు: మహిళా సంఘాల బ్యాంక్ లింకేజీ రుణ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతున్నట్లు సీఎం ప్రకటించారు.
సున్నా వడ్డీ ఊతం: ఇప్పటివరకు రూ.60 వేల కోట్ల రుణాలను అందించగా, సున్నా వడ్డీ పథకం కింద ప్రభుత్వం ఇప్పటికే రూ.1,390 కోట్లు బ్యాంకుల ఖాతాల్లో జమ చేసింది.
ఆర్టీసీలో రికార్డు: మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం కోసం ప్రభుత్వం ఇప్పటివరకు ఆర్టీసీకి రూ.10,000 కోట్లు చెల్లించింది.
అమెజాన్‌కు ధీటుగా.. మహిళల చేతికి లాజిస్టిక్ కేంద్రాలు : ప్రపంచ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) తో ఇప్పటికే చర్చలు జరుపుతున్నామని, దానికి ఏమాత్రం తీసిపోని విధంగా రాష్ట్రంలో మహిళల ఆధ్వర్యంలో కార్పొరేట్ లాజిస్టిక్ సెంటర్లు మరియు ‘మహాలక్ష్మి సూపర్ బజార్లను’ నిర్మిస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. పట్టణ ప్రాంతాల్లో ‘డీమార్ట్’ కంటే మిన్నగా ప్రభుత్వ స్థలాలను తక్కువ ధరకే లీజుకు ఇచ్చి ఈ సూపర్ మార్కెట్లను ఏర్పాటు చేయిస్తామన్నారు. మహిళలు కేవలం గృహిణులుగా కాకుండా, పెట్రోల్ బంకులు, 1000 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల నిర్వహణ ద్వారా వ్యాపార సామ్రాజ్ఞులుగా ఎదుగుతారని భరోసా ఇచ్చారు.
మిల్లర్ల మాయాజాలం.. ధాన్యపు దొంగతనంపై కొరడా : సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి రైస్ మిల్లర్ల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “వేల కోట్ల రూపాయల విలువైన ఒడ్లు (ధాన్యం) ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఇస్తే.. కొందరు మిల్లర్లు మళ్లీ బియ్యం ఇవ్వకుండా ప్రభుత్వాన్ని నిలువునా మోసం చేస్తున్నారు” అని నిప్పులు చెరిగారు. ఈ దోపిడీకి శాశ్వతంగా అడ్డుకట్ట వేయడానికి సీఎం ఒక సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు.
మిల్లర్ల దోపిడీకి చెక్ పెట్టే సరికొత్త విధానం
01.రైతులు తమ ధాన్యాన్ని ఇకపై నేరుగా ఐకేపీ / మహిళా సంఘాలకే విక్రయించాలి.
02. సేకరించిన ఒడ్లను మిల్లర్లకు పంపకుండా, మహిళల వద్దే నిల్వ ఉంచుతారు.
03. మిల్లర్లు ప్రభుత్వానికి బియ్యం ఇచ్చే ఒప్పందాన్ని బట్టే అక్కడి నుండి ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా భారీగా గోదాములు (Warehouses) నిర్మించాలని, ఇందుకు అవసరమైతే మహిళా సంఘాలకు 100 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించేందుకు కూడా సిద్ధమని అధికారులను ఆదేశించారు.

