Apprenticeship Embedded Degree Programmes Telangana : సాధారణ డిగ్రీ పట్టాల కాలం చెల్లిపోతోందా? డిగ్రీ పూర్తి చేసినా చేతిలో సరైన నైపుణ్యాలు లేక, ఉద్యోగాలు దొరకక అల్లాడిపోతున్న లక్షలాది మంది విద్యార్థుల జీవితాల్లో సరికొత్త వెలుగులు నిండబోతున్నాయా? అవుననే అంటోంది తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ. మారుతున్న కాలానికి అనుగుణంగా, కేవలం పుస్తకాల్లోని చదువులకే పరిమితం కాకుండా.. చదువుకుంటూనే సంపాదించుకునే సువర్ణావకాశాన్ని ప్రభుత్వం ఈ విద్యాసంవత్సరం నుంచే (2026-27) విద్యార్థుల ముంగిటకు తెచ్చింది.
నయా నైపుణ్యం.. నూతన అధ్యాయం : రాష్ట్రంలో ఏటా లక్షలాది మంది యువత డిగ్రీ పట్టాలతో ఆశగా బయటకు వస్తున్నా, కార్పొరేట్ సంస్థల అవసరాలకు తగ్గ నైపుణ్యాలు లేకపోవడంతో నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. ఈ మూస ధోరణికి స్వస్తి పలికి, డిగ్రీ వ్యవస్థను బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగానే అప్రెంటిస్‌షిప్ ఎంబడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్స్ (AEDP) కింద 11 సరికొత్త కోర్సులను కాలేజీ విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన అధికారికంగా ప్రకటించారు.
ఈ అకాడమిక్ ఇయర్ నుంచి విద్యార్థులకు మార్కెట్లో అత్యంత డిమాండ్ ఉన్న రంగాలలో శిక్షణ లభించనుంది. అంతేకాదు, జూన్ 12న ముఖ్యమంత్రి సమక్షంలో ప్రముఖ పారిశ్రామిక సంస్థలతో చారిత్రాత్మక అవగాహన ఒప్పందాలు (MoUs) కూడా జరగనున్నాయి.
11 కొత్త కోర్సుల పూర్తి జాబితా : విద్యార్థుల ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేలా మూడు ప్రధాన విభాగాలలో ఈ 11 నూతన కోర్సులను డిజైన్ చేశారు. ఆ వివరాలు కింద ఇవ్వబడ్డాయి:
01. బీఎస్‌సీ (B.Sc.) – 8 కోర్సులు
ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ (EMS)
కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ హార్డ్‌వేర్
ఈ-మొబిలిటీ అండ్ బ్యాటరీ టెక్నాలజీ
డెయిరీ అండ్ పౌల్ట్రీ మేనేజ్‌మెంట్
హార్టికల్చర్ అండ్ ల్యాండ్ స్కేపింగ్
ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ టెక్నాలజీ
ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్
ఎంబెడెడ్ సిస్టమ్స్ అండ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT)
2. బీకాం (B.Com) – 1 కోర్సు
బిజినెస్ ఎనలిటిక్స్
3. బీఏ (B.A.) – 2 కోర్సులు
యానిమేషన్ అండ్ వీఎఫ్‌ఎక్స్ (VFX)
ఫిల్మ్ అండ్ టీవీ ప్రొడక్షన్
చేతినిండా పని.. నెలకు రూ.7,000 స్టైపెండ్ : ఈ సరికొత్త కోర్సుల విద్యావిధానాన్ని ఒక క్రమపద్ధతిలో, విద్యార్థికి పూర్తిస్థాయి ప్రయోజనం చేకూరేలా రూపొందించారు. ఆ ప్రక్రియను ఈ క్రింది విధంగా అర్థం చేసుకోవచ్చు:
మొదటి రెండు సంవత్సరాలు: అకడమిక్ పునాది : కళాశాలలో శిక్షణ, మొదటి 4 సెమిస్టర్లలో విద్యార్థులు కాలేజీలలో కోర్సుకి సంబంధించిన సైద్ధాంతిక (Theoretical) పరిజ్ఞానాన్ని, మౌలిక నైపుణ్యాలను నిపుణులైన అధ్యాపకుల ద్వారా నేర్చుకుంటారు.
చివరి సంవత్సరం: పారిశ్రామిక అప్రెంటిస్‌షిప్ : నేరుగా కంపెనీలలో.. మూడో ఏడాది (చివరి రెండు సెమిస్టర్లు) విద్యార్థులు కాలేజీకి వెళ్లాల్సిన అవసరం లేదు. నేరుగా ప్రముఖ పరిశ్రమలు, ఐటీ కంపెనీలు లేదా సంబంధిత సంస్థలలో లైవ్ ప్రాజెక్టులపై ప్రాక్టికల్ శిక్షణ పొందుతారు.
ఆర్థిక భరోసా: రూ.7,000 స్టైపెండ్ : ప్రతినెలా బ్యాంక్ ఖాతాలోకి చివరి ఏడాది పరిశ్రమలలో శిక్షణ పొందుతున్న కాలంలో విద్యార్థులకు “Earn While You Learn” కింద నెలకు రూ.7,000 చొప్పున స్టైపెండ్ అందిస్తారు. ఇది వారి ఆర్థిక అవసరాలకు ఆసరాగా నిలుస్తుంది.
ఉద్యోగ సాధన: 80-90% పర్మనెంట్ ప్లేస్‌మెంట్ : అప్రెంటిస్‌షిప్ విజయవంతంగా పూర్తి చేసుకున్న అభ్యర్థులలో దాదాపు 80 నుంచి 90 శాతం మందిని వారు పనిచేసిన కంపెనీలే రెగ్యులర్ ఉద్యోగులుగా నియమించుకోవాలనే లక్ష్యంతో ఈ ఒప్పందాలు జరుగుతున్నాయి.
ఈ నయా ఏఈడీపీ (AEDP) కోర్సుల మొత్తం 132 క్రెడిట్లలో.. 70 క్రెడిట్లను కేవలం ప్రాక్టికల్స్, ఇండస్ట్రీ స్కిల్స్ కోసమే కేటాయించారు. ఐఐటీ హైదరాబాద్ (IITH), సీఐఐ (CII) వంటి ప్రతిష్టాత్మక సంస్థల విద్యా నిపుణుల భాగస్వామ్యంతో ఈ సిలబస్‌ను కాలానుగుణంగా అప్‌డేట్ చేశారు.
దోస్త్ (DOST) ద్వారా అడ్మిషన్ల భర్తీ : రాష్ట్రంలోని 94 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో మొత్తం 27 రకాల ఏఈడీపీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. గతేడాది 16 రకాల కోర్సుల్లో 6,000 సీట్లుండగా 1,770 మంది చేరారు. ఈ ఏడాది అదనంగా మరో 5,000 సీట్లను పెంచి, మొత్తం 11,000 సీట్లను అందుబాటులోకి తెచ్చారు. ఈ విద్యాసంవత్సరంలో కనీసం 8,000 సీట్లను భర్తీ చేయాలని విద్యాశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (DOST) కౌన్సెలింగ్ ప్రక్రియ ద్వారా విద్యార్థులు ఈ కోర్సులలో ప్రవేశాలు పొందవచ్చు.

