HomeతెలంగాణIrrigation : సాగునీటికి సాంకేతిక సొగసులు.. 'డబ్ల్యూ-అమృతం'తో డిజిటల్ విప్లవం

Irrigation : సాగునీటికి సాంకేతిక సొగసులు.. ‘డబ్ల్యూ-అమృతం’తో డిజిటల్ విప్లవం

Digitalization of Irrigation Management in Telangana : సాగునీటి నిర్వహణలో దశాబ్దాలుగా నడుస్తున్న సాంప్రదాయ పద్ధతులకు స్వస్తి పలుకుతూ, కాలంతో పాటు అడుగులు వేసేందుకు నీటిపారుదల శాఖ సన్నద్ధమైంది. వర్షం పడితే ఎంత నీరు వచ్చింది? జలాశయాల నుంచి ఎంత వదిలారు? ఆయకట్టుకు సరిపడా నీరు అందుతోందా? అనే ప్రశ్నలకు ఒకప్పుడు అంచనాలే సమాధానమయ్యేవి. కానీ ఇకపై ప్రతీ నీటి చుక్క లెక్క పక్కాగా తేలనుంది! వరదల భయం ఉన్నా, కరవు పరిస్థితులు ఎదురైనా ముందుగానే హెచ్చరించే అత్యాధునిక డిజిటల్ వ్యవస్థ రూపుదిద్దుకుంటోంది. కేంద్ర జలశక్తి శాఖ నిర్వహించిన జాతీయ వర్క్‌షాప్‌లో ‘డబ్ల్యూ-అమృతం’ (W-Amrutham) పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన ప్రజెంటేషన్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

- Advertisement -

దిల్లీ వేదికగా ‘డబ్ల్యూ-అమృతం’ ప్రజెంటేషన్ : కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో న్యూదిల్లీలో జరిగిన జాతీయ స్థాయి వర్క్‌షాప్‌లో రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులు డబ్ల్యూ-అమృతం పథకం ప్రతిపాదనలను సమర్పించారు. ఇప్పటివరకు కేవలం నీటి వివరాలు, గణాంకాలు సేకరించడానికే పరిమితమైన వ్యవస్థలను దాటి, శాస్త్రీయ విశ్లేషణ ద్వారా సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకునేలా ‘డిసిషన్ సపోర్ట్ సిస్టమ్’గా దీనిని తీర్చిదిద్దనున్నారు. వరద నియంత్రణ, కరవు నిర్వహణ, సాగునీటి సమగ్ర పంపిణీకి ఈ సాంకేతికత కీలక కాపలాదారుగా నిలవనుంది.

సమన్వయ కేంద్రంగా ‘స్టేట్ వాటర్ ఇన్ఫర్మేటిక్‌ సెంటర్’ (SWIC) : 2021 నుంచి 2025 మధ్య కాలంలో సుమారు రూ.35 కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి చేసిన ‘ఇరిగేషన్ డెసిషన్ సపోర్ట్ సిస్టమ్‌’ (IDSS), ‘గోదావరి బేసిన్‌ డిజిటల్ ట్విన్ సిస్టమ్‌’లను ఒకే వేదికపైకి తేనున్నారు. వీటన్నింటినీ ఏకీకృతం చేస్తూ ప్రత్యేకంగా ‘స్టేట్ వాటర్ ఇన్ఫర్మేటిక్‌ సెంటర్’ (SWIC)ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిద్వారా రాష్టంలో నీటి లభ్యత, ప్రాజెక్టుల నీటి నిల్వలు, వినియోగం వంటి ప్రతి అంశమూ నిరంతరం పర్యవేక్షణలో ఉంటుంది.

రియల్ టైమ్ డేటా.. ‘ఎర్లీ వార్నింగ్’ వ్యవస్థ బలోపేతం : ఆటోమేటిక్ రెయిన్ గేజ్ స్టేషన్లు: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,077 ఆటోమేటిక్ రెయిన్ గేజ్ (ARG) స్టేషన్ల సమాచారాన్ని ఇరిగేషన్ డెసిషన్ సపోర్ట్ సిస్టమ్‌తో అనుసంధానిస్తారు.

నేషనల్ వాటర్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ (NWIC): నేషనల్ వాటర్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ ద్వారా క్షణక్షణం రియల్ టైమ్ డేటా అందుబాటులోకి వస్తుంది.

లైడార్ సర్వేలు (LiDAR Surveys): డ్యామ్ సేఫ్టీ చట్ట నిబంధనలకు అనుగుణంగా ప్రత్యేక వరద హెచ్చరిక ప్రోటోకాల్స్ రూపొందిస్తారు. హై రెజల్యూషన్ డిజిటల్ ఎలివేషన్ మోడల్స్, వరద ముంపు మ్యాపింగ్, ఫ్లడ్ ప్లెయిన్ జోనింగ్ వంటి అధునాతన సాంకేతిక పద్ధతులను వినియోగించనున్నారు.

కృష్ణా బేసిన్‌కూ డిజిటల్ ట్విన్.. పైలట్ ప్రాజెక్ట్‌గా శ్రీరాంసాగర్ : రాష్ట్రంలోని కోటి 25 లక్షల ఎకరాల ఆయకట్టులో దాదాపు 75 లక్షల ఎకరాలు ఎత్తిపోతల పథకాలపైనే ఆధారపడి పనిచేస్తున్నాయి.

గోదావరి నుంచి కృష్ణా బేసిన్‌కు: గోదావరి బేసిన్‌లో విజయవంతమైన ‘డిజిటల్ ట్విన్’ సాంకేతికతను కృష్ణా బేసిన్‌కూ విస్తరించనున్నారు.


44 వేల చెరువుల డిజిటలైజేషన్: రాష్ట్రంలోని 44,000 చిన్ననీటి వనరులు, చెరువులను డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పైకి తెచ్చి ఆయకట్టు ప్రణాళికలు రచిస్తారు. ప్రాజెక్టుల్లో పూడిక కారణంగా ఎంత నిల్వ సామర్థ్యం కోల్పోయారో ఖచ్చితంగా గుర్తించేందుకు బాథిమెట్రిక్ సర్వేలు నిర్వహించి ‘కెపాసిటీ కర్వ్‌ల’ను సిద్ధం చేస్తారు. కాల్వల ద్వారా నీటి పంపిణీ సమర్థంగా జరిగేలా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (SRSP)ను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు.

సోలార్ ఆధారిత స్మార్ట్ మానిటరింగ్.. శాటిలైట్ కంట్రోల్ : కాల్వల ప్రధాన గేట్లు, పంపిణీ వ్యవస్థల వద్ద నీటిమట్టం కొలిచే వాటర్ లెవల్ సెన్సార్లు, ప్రవాహాన్ని లెక్కించే ఫ్లో మీటర్లు, గేట్ పొజిషన్ సెన్సార్లు, సోలార్ ఆధారిత స్మార్ట్ మానిటరింగ్ యూనిట్లను అమర్చనున్నారు. ఉపగ్రహాల  ద్వారా పొలాల్లోని పంటల పరిస్థితిని, ఆర్ద్రతను ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ నీటిపారుదల శాఖ ఇంజినీర్లకు ఏయే కాల్వకు ఎంత నీరు విడుదల చేయాలనే ప్రత్యక్ష సూచనలు అందుతాయి. అంతేకాకుండా, భవిష్యత్తులో వచ్చే వాతావరణ మార్పులను అంచనా వేసి కరవు సమయాల్లో ప్రత్యామ్నాయ నీటి కేటాయింపుల ప్రణాళికలు అమలు చేస్తారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News