TGSRTC Strike: రేవంత్ సర్కార్ నుండి చర్చల కోసం ఎలాంటి ఆహ్వానం లేకపోవడంతో టీజీఎస్ ఆర్టీసీ సమ్మెకు సిద్ధమవుతుంది. ఆర్టీసీ జేఏసీ విధించిన గడువు నేటితో ముగియనుండటంతో.. కార్మికులు సమ్మె సైరన్ మోగించేందుకు సిద్ధమయ్యారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో.. నేటి అర్ధరాత్రి నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ సేవలు నిలిచిపోయే అవకాశం ఉంది.
సమ్మెకు సిద్ధమైన కార్మికులు: సమ్మె నోటీసు ఇచ్చి రోజులు గడుస్తున్నా రేవంత్ సర్కార్ ఇప్పటివరకు జేఏసీ నేతలను చర్చలకు ఆహ్వానించలేదు. అటు యాజమాన్యం, ఇటు ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి చొరవ లేకపోవడంతో కార్మికుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇప్పటికే జేఏసీ నాయకులు రాష్ట్రంలోని అన్ని డిపోలను సందర్శించారు. ఉద్యోగులను సమ్మెకు సమాయత్తం చేశారు.
ప్రత్యామ్నాయాలపై దృష్టిసారించిన సర్కార్: సమ్మె జరిగితే ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా రేవంత్ సర్కార్ ప్రత్యామ్నాయాలపై దృష్టిసారించింది. సమ్మెకు తాము మద్దతు ఇవ్వడం లేదని అద్దె బస్సుల యజమానుల సంఘం ప్రకటించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3,500 అద్దె బస్సులు యథావిధిగా నడవనున్నాయి. అంతేకాకండా సమ్మె తీవ్రతను బట్టి స్కూల్, కాలేజీ బస్సులను కూడా ప్రజా రవాణా కోసం వినియోగించుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. అవసరమైతే తాత్కాలిక ప్రాతిపదికన ప్రైవేట్ డ్రైవర్లను నియమించుకుని బస్సులను రోడ్డెక్కించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది.
Also read-KCR: వ్యూహాత్మక ఎత్తుగడలకు కేర్ ఆఫ్ కేసీఆర్.. అందుకే రేవంత్ పేరు ఎత్తలేదా?
సందిగ్ధంలో ప్రయాణికులు: ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ మధ్య నెలకొన్న సందిగ్ధత సామాన్య ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తోంది. అర్ధరాత్రి లోపు చర్చలు జరిగి సమ్మె విరమణ జరుగుతుందా? లేక రాష్ట్రంలో రవాణా వ్యవస్థ స్తంభిస్తుందా? అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.

