Sunday, February 8, 2026
HomeతెలంగాణTelangana News: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వచ్చే ఏడాది నుంచి ఫీజుల నియంత్రణ చట్టం

Telangana News: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వచ్చే ఏడాది నుంచి ఫీజుల నియంత్రణ చట్టం

Telangana government key decision: రాష్ట్రంలోని ప్రైవేట్‌ పాఠశాలల ఆగడాలను అరికట్టేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తల్లిదండ్రుల నుంచి ముక్కుపిండి ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు స్కూలు యాజమాన్యాలను నిరోధించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమల్లోకి తీసుకురానుంది. ఈ మేరకు ఫీజు నియంత్రణ చట్టం విధివిధానాలను సైతం రూపొందించింది. మున్సిపల్‌ ఎన్నికల తర్వాత జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ చట్టంపై చర్చించి వచ్చే విద్యా సంవత్సరం నుంచి దీన్ని అమల్లోకి తీసుకురానున్నారు. అయితే, దీనిపై ప్రైవేటు విద్యాసంస్థలు అభ్యంతరాలు లేవనెత్తుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలోని ప్రైవేట్‌ పాఠశాలలు ప్రతి రెండేళ్లకు ఒకసారి ట్యూషన్‌ ఫీజును 8 శాతం పెంచుకునేలా అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతకంటే ఎక్కువ పెంచుకోవాలనుకుంటే.. ప్రభుత్వం నియమించే రాష్ట్రస్థాయి కమిషన్‌ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కాగా, విద్యారంగ సమస్యలపై మంత్రులు శ్రీధర్‌బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్‌లతో మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటైంది. ఆ కమిటీ ఇప్పటికే రెండుసార్లు సమావేశమై ఫీజులపై చర్చించి, విద్యా కమిషన్‌ను నియమించింది. పీజుల నియంత్రణపై అధ్యయనం చేసిన విద్యా కమిషన్‌.. తెలంగాణ ప్రైవేట్‌ అన్‌ఎయిడెడ్‌ స్కూల్‌ రెగ్యులేటరీ అండ్‌ మానిటరింగ్‌ కమిషన్‌ ముసాయిదా బిల్లు-2025 పేరిట గతేడాది జనవరి 24న ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. దీనిపై మంత్రివర్గ ఉప సంఘం చర్చించి, ముఖ్యాంశాలను సీఎంకి సమర్పించింది. రెండేళ్లకు ఒకసారి 8 శాతం ఫీజు పెంపునకు అనుమతించాలని నిర్ణయించింది.

- Advertisement -

కమిటీ సిఫార్సులపై యజమాన్యాల అభ్యంతరం…

కాగా, గతంలోనూ పీజుల పెంపు విషయంలో వచ్చిన అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకుని 2017లో నాటి ప్రభుత్వం ఆచార్య తిరుపతిరావు కమిటీని నియమించింది. కాగా, ప్రతి ఏడాది 10 శాతం ఫీజులు పెంచుకోవచ్చని ఈ కమిటీ సూచించింది. కానీ, తెలంగాణ విద్యా కమిషన్‌ ఏటా వినియోగదారుల ధరల సూచిక (సీపీఐ) ఆధారంగా ఫీజులు పెంచుకునే అవకాశం కల్పించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అయితే, తాజాగా విద్యాశాఖ ఉన్నతాధికారులు మాత్రం రెండేళ్లకు ఒకసారి 8 శాతం పెంచుకునేలా రూల్స్‌ రూపొందించారు. కమిషన్‌ ఆమోదం తీసుకుంటే అంతకంటే ఎక్కువ పెంచుకునే వెసలుబాటు కల్పించారు. అయితే, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు మాత్రం ప్రతి ఏడాది ఫీజుల పెంపునకు అనుమతించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ద్రవ్యోల్బణం ఏటా 5-6 శాతం పెరుగుతుండగా రెండేళ్లకు 8 శాతం పెంపు ఎలా సరిపోతుందని వారు ప్రశ్నిస్తున్నారు. తాము ఏటా అద్దెలు చెల్లించాలని, ఉపాధ్యాయుల వేతనాలు పెంచాల్సి ఉంటుందన యాజమాన్యాలు చెబుతున్నాయి. ఇంజినీరింగ్‌ తదితర ఉన్నత విద్య కళాశాలలు మూడేళ్లకోసారి ఫీజులు పెంచుతున్నప్పటికీ.. అక్కడ యాజమాన్య కోటా ఉంటుందని పాఠశాలల యజమాన్యాలు ప్రశ్నిస్తున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News