HomeTop StoriesTelangana CM: అన్ని పథకాలకు ఒకే డిజిటల్‌ కార్డు.. తెలంగాణ ప్రభుత్వ వినూత్న ఆలోచన..!

Telangana CM: అన్ని పథకాలకు ఒకే డిజిటల్‌ కార్డు.. తెలంగాణ ప్రభుత్వ వినూత్న ఆలోచన..!

Telangana Government Plans for Unified Welfare Card: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి అందుతున్న సంక్షేమ పథకాల వివరాలన్నీ ఒకే చోట లభించేలా విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ప్రత్యేకంగా ‘సమగ్ర సంక్షేమ కార్డు’ ను రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి గురువారం అధికారులను ఆదేశించారు. ఏ పౌరుడికి ఏ శాఖ ద్వారా, ఏ పథకం కింద, ఎంత మేర లబ్ధి చేకూరుతోందో ఈ కార్డు ద్వారా స్పష్టంగా తెలిసేలా డిజైన్‌ చేయాలని సూచించారు. సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్. కె.రామకృష్ణారావు ఇతర ఉన్నతాధికారులతో కలిసి సీఎం ఈ విషయంపై ఇవాళ ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు.

- Advertisement -

Also read: Monsoon updates: తెలుగు రాష్ట్రాలకు నైరుతి రుతుపవనాల ఎంట్రీ.. భారీ వర్షాలు కురిసే ఛాన్స్‌..!

ఏఐతో విశ్లేషించి లబ్ధిదారులను గుర్తించొచ్చు..

సంక్షేమ పథకాల డేటాను సేకరించేందుకు తక్షణమే అన్ని శాఖల నుంచి ఒక ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ఈ సందర్భంగా సీఎం ఆదేశించారు. సమగ్ర సంక్షేమ కార్డు ద్వారా రాష్ట్రంలోని ప్రతి పౌరుడి పూర్తి సంక్షేమ ప్రొఫైల్ ఒకే చోట అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ డేటాను అన్ని కోణాల్లో ఏఐ సహాయంతో విశ్లేషించడం ద్వారా సంక్షేమ పథకాల లబ్ధి దారులను గుర్తించడం, పథకాలను అమలు చేయడం సులభంగా మారుతుందన్నారు. ఈ విధానం అనుసరించడం వల్ల నిజమైన అర్హులకు పథకాలు మరింత కచ్చితంగా చేరుతాయని, అదే సమయంలో అనర్హులను గుర్తించడం మరింత సులవవుతుందని అభిప్రాయపడ్డారు. ఇక, ప్రతి శాఖ వేర్వేరుగా కార్డులు ఇచ్చే పద్ధతికి స్వస్తి చెప్పాలని, ఐటీ శాఖ ఆధ్వర్యంలో సమగ్ర సంక్షేమ కార్డు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. టెక్నాలజీపై పట్టున్న, చురుగ్గా పనిచేసే యువ అధికారులను ఈ ప్రక్రియకు వినియోగించాలని చెప్పారు.

Also read: Siddaramaiah: జాతీయ రాజకీయాల్లోకి వెళ్లను.. ఎమ్మెల్యేగానే కొనసాగుతా..! బాంబు పేల్చిన సిద్ధరామయ్య

ఆధార్ తరహాలో ప్రతి వ్యక్తికి ప్రత్యేక నంబర్‌..

ప్రభుత్వం ఇవ్వబోయే సమగ్ర సంక్షేమ కార్డులో ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి, ఫీజు రీయింబర్స్‌మెంట్, కార్మిక శాఖ, విద్యా శాఖ, బీమా పథకాలకు సంబంధించిన వివరాలు ఉండాలని సీఎం ఆదేశించారు. అవసరమైతే ఆధార్ నంబర్‌ తరహాలో రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక యూనిక్ ఐడెంటిటీ నంబర్‌ ఇచ్చేలా ప్లాన్‌ చేయాలన్నారు. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే వివరాలను కూడా ఈ కార్డ్‌కు అనుసంధానం చేయాలని సూచించారు. లబ్ధిదారుల వివరాలతో పాటు వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్య, ఇతర వివరాలను సేకరించాలని ఐటీ శాఖను ఆదేశించారు. ఏఐ ఆధారిత ప్రొఫైలింగ్ జరగాలని, ఎక్కడైనా మరణ ధృవీకరణ పత్రం జారీ అయితే, ఆ సమాచారం చేయూత పెన్షన్ డేటాబేస్‌కు చేరాలని, వెంటనే దాని ఆధారంగా చర్యలు మొదలయ్యేలా ఉండాలని ఆదేశించారు. ప్రజల హెల్త్‌ ప్రొఫైల్‌ను కూడా సమగ్ర సంక్షేమ కార్డుతో లింక్ చేయాలని కోరారు. కేరళ నుంచి గల్ఫ్‌కు వలస వెళ్లే కార్మికులకు ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాన్ని అధ్యయనం చేయాలని సూచించారు. నైపుణ్యాభివృద్ధి, శిక్షణ కార్యక్రమాలతో పాటు, పాస్‌పోర్ట్‌లు, వీసాల జారీకి సంబంధించిన సమాచారం ఒకేచోట అందుబాటులో ఉంచితే, అనధికార ఏజెంట్ల ప్రమేయం తగ్గుతుందన్నారు. పేదలకు సంక్షేమ ఫలాలు ఖచ్చితంగా చేరేలా, ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకం ప్రభావాన్ని అంచనా వేసేలా సమగ్ర సంక్షేమ కార్డు ఉండాలని అధికారులను సూచించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News