Mana Stree Nidhi app for SHGs : “కిస్తీ కట్టాను, కానీ నా ఖాతాలో జమ కాలేదు!” – “గ్రూప్ లీడర్ డబ్బులు వాడుకున్నారు!” – స్వయం సహాయక సంఘాల (SHG) మహిళల నోట తరచుగా వినిపించే ఆవేదన ఇది. ఈ అక్రమాలకు, అవకతవకలకు అడ్డుకట్ట వేసి, స్త్రీనిధి రుణాల పంపిణీ, వసూళ్లలో పూర్తి పారదర్శకత తీసుకువచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఓ విప్లవాత్మక అడుగు ముందుకేసింది. అదే ‘మన స్త్రీనిధి’ యాప్. ఇకపై రుణం కోసం దరఖాస్తు చేసుకోవడం నుంచి, కిస్తీలు చెల్లించడం వరకు.. అన్నీ మీ అరచేతిలోనే!
ఎందుకీ యాప్ : స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం ‘స్త్రీనిధి’ ద్వారా రుణాలు అందిస్తోంది. అయితే, కొందరు సభ్యులు సకాలంలో కిస్తీలు చెల్లించకపోవడం, మరికొందరు గ్రూప్ లీడర్లు సభ్యుల డబ్బును సొంతానికి వాడుకోవడంతో, గ్రూపులోని నిజాయితీపరులైన సభ్యులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకే, ప్రభుత్వం ఈ ‘మన స్త్రీనిధి’ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది.
‘మన స్త్రీనిధి’ యాప్.. మీ చేతిలోనే మీ రుణం : ఈ యాప్‌ను ఉపయోగించడం చాలా సులభం.
స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి సభ్యురాలు, గూగుల్ ప్లేస్టోర్ నుంచి ‘మన స్త్రీనిధి’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. మీ మొబైల్ నంబర్‌తో లాగిన్ అవ్వగానే, మీ గ్రూప్ వివరాలు, మీరు తీసుకున్న రుణాల పూర్తి సమాచారం కనిపిస్తుంది. మీరు తీసుకున్న రుణం ఎంత? ఎన్ని వాయిదాలు చెల్లించారు? ఇంకా ఎంత బకాయి ఉంది? వంటి వివరాలన్నీ స్పష్టంగా ఉంటాయి.
ప్రయోజనాలే ప్రయోజనాలు : ఈ యాప్ వల్ల మహిళలకు బహుళ ప్రయోజనాలున్నాయి.
పారదర్శకత: మీరు చెల్లించిన వాయిదా, మీ ఖాతాలో జమైందా, లేదా అనేది వెంటనే తెలుసుకోవచ్చు. గ్రూప్ లీడర్లు లేదా ఇతరులు మీ డబ్బును దుర్వినియోగం చేసే ఆస్కారమే ఉండదు.
ఇంటి నుంచే చెల్లింపు: ఇకపై కిస్తీ డబ్బులను బ్యాంక్ మిత్రకో, గ్రూప్ లీడర్‌కో ఇవ్వాల్సిన పనిలేదు. నేరుగా మీ ఫోన్ నుంచే చెల్లించే అవకాశం ఉంది. ఈ యాప్ ద్వారానే కొత్త రుణాల కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
“స్త్రీనిధి రుణాల పంపిణీలో అక్రమాలకు తావులేకుండా ఉండేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుంది. సభ్యులు తమ రుణ వివరాలను ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు.”
– దుర్గాప్రసాద్, ఆర్‌ఎం, పెద్దపల్లి
ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఈ యాప్ నమోదులో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఇక్కడ ఇప్పటికే 33,000 మందికి పైగా మహిళలు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, తమ ఆర్థిక లావాదేవీలను పారదర్శకంగా నిర్వహించుకుంటున్నారు.

