HomeతెలంగాణGrain procurement : కొనుగోళ్లలో కోతలు లేవు.. రైతన్నకు రంది లేదు: ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొట్టిన...

Grain procurement : కొనుగోళ్లలో కోతలు లేవు.. రైతన్నకు రంది లేదు: ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొట్టిన మంత్రి కోమటిరెడ్డి

Telangana grain procurement 2026 : పచ్చని పొలాల్లో పసిడి రాశులు కనువిందు చేస్తున్న వేళ.. అన్నదాతల కళ్లల్లో ఆనందం చూడాల్సిన తరుణంలో ఆందోళనలెందుకు? ఒకపక్క అకాల వర్షాల భయం, మరోపక్క కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతోందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలతో అమాయక రైతన్నల మదిలో ఎక్కడో చిన్న గుబులు రేగుతోంది. సరిగ్గా ఈ పరిస్థితుల్లోనే రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, మంత్రుల బృందం నేరుగా క్షేత్రస్థాయిలోకి దిగింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో సుడిగాలి పర్యటన చేపట్టింది. 

- Advertisement -

క్షేత్రస్థాయిలో మంత్రుల పర్యవేక్షణ – భువనగిరిలో ఉన్నతస్థాయి సమీక్ష : వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగానే రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తదితరులు యాదాద్రి జిల్లాలోని పలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను (పీపీసీ) స్వయంగా పరిశీలించి, క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను, రైతుల సాధకబాధకాలను అడిగి తెలుసుకున్నారు. తదనంతరం భువనగిరి కలెక్టరేట్‌లో జిల్లా ఉన్నతాధికారులతో సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు. తూకాల్లో ఎక్కడా జాప్యం జరగకూడదని, ధాన్యం తరలింపునకు లారీల కొరత లేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ఆఖరి గింజ వరకూ అండగా ఉంటాం – మంత్రి కోమటిరెడ్డి కొండంత భరోసా : ఈ సుదీర్ఘ సమీక్ష అనంతరం రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అన్నదాతలకు కొండంత భరోసా ఇచ్చారు. “రైతు ప్రభుత్వమిది.. మా ప్రథమ ప్రాధాన్యం మీ సంక్షేమమే. అకాల వర్షాలు వచ్చినా, మరే ప్రకృతి విపత్తు ఎదురైనా మీకు పూర్తి అండగా ఉంటాం. దయచేసి ఎవరూ ఆందోళన చెందవద్దు, చివరి వరి గింజను కూడా కనీస మద్దతు ధరకు (ఎంఎస్‌పీ) కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉంది” అని ఆయన తేల్చిచెప్పారు. దళారుల ప్రమేయం లేకుండా ప్రతి గింజనూ పారదర్శకంగా కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు.

ప్రతిపక్షాల ఉచ్చులో పడొద్దు – లెక్కలతో సహా వివరణ : రాజకీయ ఉనికి కోసమే విపక్షాలు లేనిపోని రాద్ధాంతం చేస్తూ ‘గోరంతలు కొండంతలు’ చేస్తున్నాయని మంత్రి కోమటిరెడ్డి మండిపడ్డారు. “ధాన్యం కొనుగోళ్లలో పారదర్శకతకు పెద్దపీట వేశాం. ప్రతిపక్షాల పసలేని ఆరోపణలు, కుట్రపూరిత ఉచ్చులో రైతులు చిక్కుకోవద్దు” అని విజ్ఞప్తి చేశారు. మాటలు చెప్పడం కాదు, చేతల్లో చూపిస్తున్నామని చెబుతూ కీలక గణాంకాలను వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 57 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించామని వివరించారు. అంతేకాకుండా, కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి ఏకంగా రూ. 10,097 వేల కోట్లను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని స్పష్టం చేశారు. ఇవే ప్రభుత్వ చిత్తశుద్ధికి నిలువెత్తు నిదర్శనమని మంత్రి ఉద్ఘాటించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News