Monday, February 16, 2026
HomeతెలంగాణGuideline : నామినేషన్ వేస్తున్నారా? జర భద్రం.. ఈ రూల్స్ తెలియకపోతే మీ ఆశలు...

Guideline : నామినేషన్ వేస్తున్నారా? జర భద్రం.. ఈ రూల్స్ తెలియకపోతే మీ ఆశలు గల్లంతు!

Telangana Municipal Election Rules : రాష్ట్రంలో రాజకీయ రణరంగం మొదలైంది. గల్లీ గల్లీలో ఎలక్షన్ హీట్ పెరిగింది. రెండు రోజుల క్రితమే మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలవడంతో.. టికెట్ల కోసం ఆశావహులు అగ్రనేతల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. బుధవారం నుంచే నామినేషన్ల పర్వం షురూ అయ్యింది. అయితే, ఎన్నికల్లో గెలవడం తర్వాత సంగతి.. అసలు బరిలో నిలవడమే అసలైన సవాలు! ఎందుకంటే, నామినేషన్ పత్రాల్లో ఒక్క చిన్న పొరపాటు జరిగినా, అఫిడవిట్‌లో ఒక్క కాలమ్ వదిలేసినా.. క్షణాల్లో మీ అభ్యర్థిత్వం రద్దవుతుంది. రేపటితో (శుక్రవారం) నామినేషన్ల గడువు ముగుస్తుండటంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. అసలు నామినేషన్ వేయడానికి ఉండాల్సిన కనీస అర్హతలేంటి? ‘బీ-ఫాం’ లేకపోతే ఏం జరుగుతుంది? బ్యాంక్ అకౌంట్ ఎందుకు తెరవాలి? నామినేషన్ వేసే ముందు ప్రతి అభ్యర్థి తప్పక తెలుసుకోవాల్సిన ‘ఎన్నికల గీటురాయి’ నిబంధనలపై ప్రత్యేక కథనం..

- Advertisement -

బరిలో దిగాలంటే.. ఈ అర్హతలు మస్ట్ : ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పురపాలక ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారికి కింది అర్హతలు తప్పనిసరి.
పౌరసత్వం & వయసు: కచ్చితంగా భారత పౌరుడై ఉండాలి. వయసు 21 ఏళ్లు నిండి ఉండాలి.
ఓటు హక్కు: మున్సిపల్ కౌన్సిలర్‌గా పోటీ చేసేవారు ఆ మున్సిపాలిటీ పరిధిలో, కార్పొరేటర్‌గా పోటీ చేసేవారు ఆ నగరపాలక సంస్థ పరిధిలో ఓటరుగా నమోదై ఉండాలి.
అనర్హతలు: అభ్యర్థి మున్సిపాలిటీలో కాంట్రాక్టర్‌గా ఉండకూడదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో లాభదాయక పదవుల్లో ఉండరాదు. గతంలో ఎన్నికల సంఘం అనర్హులుగా ప్రకటించిన వారు, దివాలా తీసిన వారు (IP పెట్టినవారు) పోటీకి అనర్హులు.

‘బీ-ఫాం’.. అదే అసలైన బ్రహ్మాస్త్రం : పార్టీ టికెట్ కన్ఫర్మ్ అయిందని సంబరపడితే సరిపోదు. ఆయా రాజకీయ పార్టీల అధికారిక అభ్యర్థిగా గుర్తించబడాలంటే ‘బీ-ఫాం’ (B-Form) కీలకం. నామినేషన్ల ఉపసంహరణ గడువులోపు రిటర్నింగ్ అధికారి (RO)కి బీ-ఫాం సమర్పించాలి. లేనిపక్షంలో వారిని ఇండిపెండెంట్ అభ్యర్థులుగానే పరిగణిస్తారు.

ప్రతిపాదనలు: పార్టీ అభ్యర్థులకు స్థానిక వార్డు/డివిజన్‌కు చెందిన ఒక ఓటరు మద్దతు (Proposer) సరిపోతుంది. అదే స్వతంత్ర అభ్యర్థి (Independent) అయితే కచ్చితంగా స్థానికంగా ఉన్న 10 మంది ఓటర్లు ప్రతిపాదించాల్సి ఉంటుంది.

నామినేషన్ చెక్‌లిస్ట్: ఈ పత్రాలు సిద్ధం చేసుకోండి
నామినేషన్ దాఖలు చేసేటప్పుడు హడావుడి పడకుండా ఈ పత్రాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలి. పూర్తి చేసిన నామినేషన్ అప్లికేషన్.

సమగ్ర అఫిడవిట్: ఆస్తులు, అప్పులు, ఆదాయ వనరులు, క్రిమినల్ కేసుల వివరాలు.
ఆధార్ కార్డు, ఓటరు ఐడీ, పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు.

కుల ధ్రువీకరణ: ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వడ్ స్థానాల్లో పోటీ చేసేవారు లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికెట్ జత చేయాలి.

కొత్త బ్యాంక్ ఖాతా: నామినేషన్‌కు ఒకరోజు ముందే అభ్యర్థి పేరున ప్రత్యేకంగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి. ఎన్నికల ఖర్చు మొత్తం దీని ద్వారానే జరగాలి.

నో డ్యూస్: పురపాలిక/నగరపాలికకు ఎలాంటి బకాయిలు లేనట్లు ‘నో డ్యూస్’ సర్టిఫికెట్ తప్పనిసరి.

ఈ తప్పులు చేస్తే.. తిరస్కరణ తథ్యం : చాలామంది అభ్యర్థులు చేసే చిన్న చిన్న తప్పులే కొంపముంచుతాయి. రిటర్నింగ్ అధికారులు దేనినీ ఉపేక్షించరు.

బ్లాంక్ వదలద్దు: అఫిడవిట్‌లో ఏ కాలమ్‌ను ఖాళీగా ఉంచకూడదు. ఒకవేళ సమాచారం లేకపోతే ‘లేదు’ (Nil) లేదా ‘వర్తించదు’ అని స్పష్టంగా రాయాలి.

డిపాజిట్ రసీదు: చెల్లించిన డిపాజిట్ ఒరిజినల్ చలానా/రసీదు నామినేషన్‌కు జతచేయాలి.
ప్రతిపాదకులు: అభ్యర్థిని ప్రతిపాదించే ఓటర్లు కచ్చితంగా అదే వార్డుకు చెందినవారై ఉండాలి. వేరే వార్డు ఓటర్ల సంతకాలు చెల్లవు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మొత్తం 2,996 డివిజన్లు/వార్డులకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు టికెట్ల కేటాయింపులో తలమునకలై ఉండగా.. ఆశావహులు మాత్రం చివరి నిమిషం వరకు బీ-ఫాం కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.


సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News