Auction of Sarpanch posts : పల్లెసీమల్లో ఎన్నికల నగారా మోగిందంటే చాలు.. వీధివీధినా యుద్ధ వాతావరణమే! ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలను మించి పల్లెపోరు రసవత్తరంగా సాగుతుంది. అలాంటిది, ఓటుతో గెలవాల్సిన పదవులు.. నోటుతో చేతులు మారుతున్నాయి. రాజ్యాంగం కల్పించిన హక్కును కాదని, కొందరు డబ్బు సంచులతో ప్రజాస్వామ్యాన్ని వేలం వేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఏకంగా కోటి రూపాయలకు సర్పంచి పదవిని సొంతం చేసుకునేందుకు సిద్ధపడ్డారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
గ్రామాల్లో సర్పంచి పదవికి ఉన్న గౌరవం, దాని ద్వారా వచ్చే పలుకుబడి అభ్యర్థులను ఎంతటికైనా తెగించేలా చేస్తోంది. కొందరు ఆస్తులు అమ్ముకుని, భార్యల పుస్తెల తాడులు సైతం తాకట్టు పెట్టి మరీ బరిలో నిలుస్తుంటే, మరికొందరు ఆ శ్రమ లేకుండానే ‘వేలం’ అనే అడ్డదారిని ఎంచుకుంటున్నారు. గ్రామ అభివృద్ధికి ఇంత మొత్తం విరాళం ఇస్తామని చెప్పి, పోటీ లేకుండా ఏకగ్రీవంగా పీఠాన్ని అధిరోహిస్తున్నారు. ఇదిప్పుడు ఉమ్మడి మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాల్లో కొత్త పుంతలు తొక్కుతోంది.
ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో కోట్ల మోత.. ఓటుతో దక్కాల్సిన పదవులను కొందరు వేలం ద్వారా కైవసం చేసుకుంటూ ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాలరాస్తున్నారు.
కోటి రూపాయల మాట: మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం టంకర గ్రామంలో సర్పంచి పదవి కోసం ఏకంగా రూ.కోటి వరకు ఖర్చు చేస్తానని ఓ అభ్యర్థి ప్రకటించినట్లు స్థానికంగా జోరుగా ప్రచారం సాగుతోంది.
లక్షల్లో ఏకగ్రీవాలు: జోగులాంబ గద్వాల జిల్లాలో ఈ ధోరణి మరింత ఎక్కువగా కనిపిస్తోంది. గట్టు మండలం మిట్టదొడ్డి సర్పంచి పదవిని ఓ సీడ్ ఆర్గనైజర్ రూ.90 లక్షలకు దక్కించుకోగా, అదే మండలం గోర్లాఖాన్దొడ్డిలో రూ.57 లక్షలకు, లింగాపురంలో రూ.34 లక్షలకు పదవులను వేలంలో ఏకగ్రీవం చేసుకున్నారు.
అడ్వాన్సుల పర్వం: గద్వాల మండలం కొండపల్లిలో రూ.60 లక్షలకు, నల్లదేవునిపల్లిలో రూ.45 లక్షలకు పదవిని కైవసం చేసుకున్నట్లు సమాచారం. నల్లదేవునిపల్లిలో ఏకంగా రూ.15 లక్షలు అడ్వాన్సుగా ముట్టజెప్పినట్లు తెలిసింది. మల్దకల్ మండలం సద్దలోనిపల్లిలో రూ.42 లక్షలకు, వీరాపురంలో రూ.50 లక్షలకు సర్పంచి పీఠాన్ని వేలంలో పాడుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఖమ్మంలో ఆలయం పేరుతో బహిరంగ వేలం!
ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం జోగ్గూడెం గ్రామస్థులు ఒక అడుగు ముందుకేసి, సర్పంచి పదవిని బహిరంగంగా వేలం వేశారు.
నేపథ్యం: ఎస్టీ మహిళకు రిజర్వ్ అయిన ఈ పంచాయతీలో 793 మంది ఓటర్లు ఉన్నారు. రెండో విడతలో ఇక్కడ ఎన్నికలు జరగాల్సి ఉంది.
వేలం ప్రక్రియ: గ్రామంలో శుక్రవారం నిర్వహించిన బహిరంగ వేలంలో ఏడుగురు అభ్యర్థులు పోటీ పడ్డారు. రూ.5,16,000తో ప్రారంభమైన పాట, చివరికి రూ.20 లక్షలకు చేరింది.
గెలుపొందిన అభ్యర్థి: సర్పంచి పదవి ఆశిస్తున్న సైదమ్మ భర్త, స్థానిక రైతు అయిన లక్ష్మణ్ అత్యధికంగా రూ.20 లక్షలు పలికి పదవిని దక్కించుకున్నారు.
గ్రామపెద్దల షరతులు: గెలిచిన అభ్యర్థి శనివారం రూ.5 లక్షలు, నామినేషన్ల చివరి రోజైన 30వ తేదీన మిగిలిన రూ.15 లక్షలు చెల్లించాలని గ్రామపెద్దలు ఒప్పంద పత్రం రాయించుకున్నారు. ఒకవేళ డబ్బు చెల్లించకపోతే, రెండో అత్యధిక పాటదారుడికి (రూ.16 లక్షలు) అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు. ఉప సర్పంచి, వార్డు సభ్యుల పదవులను ఇతరులకు ఇచ్చేలా అంగీకారానికి వచ్చారు.
అధికారుల స్పందన: ఈ వేలం ద్వారా వచ్చిన డబ్బును గ్రామంలో నిర్మించ తలపెట్టిన అభయాంజనేయ స్వామి ఆలయానికి వినియోగిస్తామని గ్రామస్థులు చెబుతున్నారు. అయితే, ఈ వేలంపై తమకు ఎలాంటి సమాచారం లేదని, నిబంధనల ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తామని కామేపల్లి ఎంపీడీవో రవీందర్ తెలిపారు.

