HomeతెలంగాణELECTION MALPRACTICE : పల్లెపోరులో 'నోట్ల' మోత.. ఓటర్లకు 'లక్ష'ణంగా గాలం వేస్తున్న అభ్యర్థులు!

ELECTION MALPRACTICE : పల్లెపోరులో ‘నోట్ల’ మోత.. ఓటర్లకు ‘లక్ష’ణంగా గాలం వేస్తున్న అభ్యర్థులు!

Cash for votes in Telangana elections : పల్లె సమరంలో ప్రచారం హోరెత్తుతోంది.. హామీల వర్షం కురుస్తోంది.. అంతకుమించి, నోట్ల కట్టలు చేతులు మారుతున్నాయి! తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచిన సర్పంచ్ అభ్యర్థులు, గెలుపే ధ్యేయంగా సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. అభివృద్ధి వాగ్దానాలతో పాటు, కుల సంఘాలకు, యువజన సంఘాలకు ‘లక్ష’ణంగా నజరానాలు సమర్పిస్తూ, ఓటర్లకు గాలం వేస్తున్నారు. ఈ ధన ప్రవాహం, ప్రజాస్వామ్య స్ఫూర్తిని అపహాస్యం చేస్తోందని, ఎన్నికల స్వరూపాన్నే మార్చేస్తోందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

- Advertisement -

తొలి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకోవడంతో, అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. గెలుపు కోసం ఏమాత్రం వెనుకాడటం లేదు.

ఉమ్మడి కరీంనగర్‌లో… “మీ వాళ్ల ఓట్లన్నీ నాకే పడాలి. గెలవగానే కమ్యూనిటీ హాల్ కట్టిస్తా. ఇప్పటికి రూ.2 లక్షలు ఇస్తున్నా,” అంటూ ఓ సర్పంచ్ అభ్యర్థి, ఓ సామాజిక వర్గం ప్రతినిధులతో బేరసారాలాడటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

ఉమ్మడి మెదక్ లో.. “మా ఊరికి ఫంక్షన్ హాల్ కట్టించే వారికే మా ఓటు. మీరు ఆలోచించుకుని చెప్పండి,” అంటూ సంఘం ప్రతినిధులే అభ్యర్థుల ముందు డిమాండ్లు ఉంచుతున్నారు.

ఖర్చుకు వెరవని అభ్యర్థులు : గ్రామంలోని ఓట్ల సంఖ్య, సామాజిక సమీకరణాలను బట్టి, అభ్యర్థులు ఖర్చుకు వెరవడం లేదు.
సంఘాలకు నజరానాలు: కుల, యువజన, మహిళా సంఘాలకు గంపగుత్తగా ఓట్లు వేయాలనే ఒప్పందంతో, రూ.25 వేల నుంచి రూ.5 లక్షల వరకు నజరానాలు అందిస్తున్నారు.
నోట్ల కట్టలతో ప్రలోభాలు: ప్రత్యర్థి కంటే ముందే ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు, ముందుగానే కొంత మొత్తం పంచి, గెలిచాక మిగతాది ఇస్తామని హామీ ఇస్తున్నారు.

హామీల హోరు.. వైఫల్యాల జోరు : డబ్బు పంపిణీతో పాటు, అభ్యర్థులు హామీల వర్షం కురిపిస్తున్నారు. సీసీ రోడ్లు, బోరు బావులు, గ్రంథాలయాలు, క్రీడా వసతులు వంటివి గెలిచిన వెంటనే నెరవేరుస్తామని వాగ్దానాలు చేస్తున్నారు. అదే సమయంలో, ప్రత్యర్థి వర్గానికి చెందిన గత సర్పంచ్‌ల వైఫల్యాలను ఎత్తిచూపుతూ, వారి అసమర్థ పాలనను ఎండగడుతున్నారు.

ఒకే ఇంట్లో భార్యాభర్తలు, అన్నదమ్ములు వేర్వేరు పార్టీల తరఫున పోటీ పడుతుండటం, ఒకే పార్టీ నుంచి ఇద్దరు, ముగ్గురు రెబల్స్‌గా బరిలో నిలవడం వంటి వింత పోకడలతో, పల్లె సంగ్రామం కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ ‘నోట్ల’ మోతలో, అసలైన ప్రజా సమస్యలు కొట్టుకుపోతున్నాయని, గెలిచొచ్చాక ఏ అభ్యర్థీ హామీలను నిలబెట్టుకోరని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News