HomeతెలంగాణNegligence : ఆపద్బాంధవుడికే ఆపద... విశ్వసనీయత కోల్పోతున్న 'డయల్ 100 ' వ్యవస్థ!

Negligence : ఆపద్బాంధవుడికే ఆపద… విశ్వసనీయత కోల్పోతున్న ‘డయల్ 100 ‘ వ్యవస్థ!

Telangana police Dial 100 delay response : ఆపదలో ఉన్నామంటూ అత్యవసర సహాయం కోసం ‘డయల్ 100’కు ఫోన్ చేస్తే… రక్షణగా నిలవాల్సిన పోలీసులే ‘లైట్’ తీసుకుంటే? ఆపద్బాంధవుడిగా భావించే అత్యవసర వ్యూహం, విధుల్లో ఉండే సిబ్బంది అపారమైన నిర్లక్ష్యం వల్ల బాధితుల నైరాశ్యానికి దారితీస్తే పరిస్థితి ఏమిటి? సాంకేతిక పరిజ్ఞానం శరవేగంగా విస్తరిస్తున్న తరుణంలో, అత్యాధునిక వాహనాలు, 24 గంటల కమాండ్ కంట్రోల్ రూమ్‌లు అందుబాటులో ఉన్నప్పటికీ డయల్ 100 నమ్మకానికి గండిపడుతోంది. రాత్రివేళల్లో వస్తున్న పిలుపులపై కొంతమంది క్షేత్రస్థాయి సిబ్బంది ఉదాసీనత వహిస్తుండటంతో ‘అత్యవసర రక్షణ’ కాస్తా ‘అంతులేని నిరీక్షణ’గా మారుతోంది. అసలు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది? ప్రజా రక్షణే ధ్యేయంగా పనిచేయాల్సిన వ్యవస్థలో లోపం ఎక్కడ దాగుంది? 

- Advertisement -

సాంకేతిక సాకులు… బాధితులకు ఆవేదనలు : నగర పోలీసు విభాగంలో ప్యాట్రోలింగ్, బ్లూకోల్ట్స్ పేరిట ప్రత్యేక సిబ్బంది, అత్యాధునిక సాంకేతిక వాహనాలు సిద్ధంగా ఉన్నప్పటికీ, అత్యవసర సమయాల్లో స్పందన కరవవుతోంది. ముఖ్యంగా అర్ధరాత్రి వేళల్లో వచ్చే ఫిర్యాదుల పట్ల కొంతమంది సిబ్బంది బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు.

ఆగస్టు 1వ తేదీ అర్ధరాత్రి ఐకియా (IKEA) సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. ప్రమాదానికి గురైన బాధితుడు సాయం కోసం డయల్ 100కు కాల్ చేయగా, రాత్రి విధుల్లో ఉన్న గచ్చిబౌలి హెడ్ కానిస్టేబుల్ అసలు ఘటనా స్థలానికి వెళ్లనేలేదు. సరికదా, సాంకేతిక కారణాలను సాకుగా చూపి ఆ రెండు ఫిర్యాదులను మూసివేశాడు (క్లోజ్ చేశాడు). ఈ ఉదంతాన్ని తీవ్రంగా పరిగణించిన సైబరాబాద్ సీపీ రమేశ్, సదరు హెడ్ కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు వేశారు.

వ్యవస్థ సులభతరం… కానీ క్షేత్రస్థాయిలో నీరుగారే లక్ష్యం : సాధారణంగా డయల్ 100కు సమాచారం అందాక నగర పరిధిలో సగటున 5 నుంచి 8 నిమిషాల్లో, శివారు ప్రాంతాల్లో అర గంట వ్యవధిలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోవాలని విధివిధానాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ స్పందనా సమయాన్ని మరింత తగ్గించేందుకు పోలీసు శాఖ ఇటీవల సరికొత్త మార్పులు తీసుకొచ్చింది.

కొత్త విధానం: ఫిర్యాదుదారుడు లైన్లో ఉండగానే, ఆ సమాచారం నేరుగా సంబంధిత స్థానిక పోలీస్ స్టేషన్‌కు చేరేలా సాంకేతికతను అనుసంధానించారు. దీనివల్ల వెంటనే ప్యాట్రోలింగ్, బ్లూకోల్ట్స్ సిబ్బంది అప్రమత్తమై నిమిషాల వ్యవధిలోనే బాధితుడి వద్దకు చేరుకుంటారు. అయితే, రాత్రివేళల్లో విధుల్లో ఉండే సిబ్బంది కొన్ని ఫిర్యాదులను తేలికగా తీసుకోవడం, రోడ్డు ప్రమాదాలను సైతం పట్టించుకోకపోవడంతో ఈ ఉన్నతాశయం నీరుగారిపోతోంది. ఇటీవల హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఒక పోలీస్ స్టేషన్‌లో కూడా డయల్ 100 పిలుపులకు సరిగా స్పందించడం లేదని ఉన్నతాధికారులు గుర్తించడం గమనార్హం.

ఫిర్యాదుదారుల సమాచారం పొక్కడం : ఆలస్యంగా స్పందించడం ఒక ఎత్తయితే, సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలు బయటకు పొక్కడం ఫిర్యాదుదారులకు మరింత ప్రాణసంకటంగా మారుతోంది. అర్ధరాత్రి వేళల్లో కాలనీల్లో డిజే బ్యాండ్ల గోల, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, గంజాయి విక్రయాలు, అల్లరి మూకల సంచారంపై స్థానికులు బాధ్యతతో డయల్ 100కు పిర్యాదు చేస్తుంటారు.


పోలీసులు వచ్చి అల్లరి మూకలను అదుపులోకి తీసుకుంటున్నా, “ఫలానా వ్యక్తి మీపై ఫిర్యాదు చేశాడు” అని వారి వివరాలను నిందితులకు వెల్లడిస్తున్నారు. దీంతో ‘అగ్నికి ఆజ్యం పోసినట్లు’ తయారైంది పరిస్థితి. విధి నిర్వహణలో ఉన్న సిబ్బంది చేస్తున్న ఈ తప్పిదం వల్ల, నిందితులు నేరుగా బాధితులకు ఫోన్లు చేసి, బెదిరింపులకు పాల్పడుతున్నారు.

ప్రత్యక్ష ఉదాహరణ: మేడ్చల్ మునీరాబాద్‌లో వరుస చోరీలకు పాల్పడుతున్న ఒక వ్యక్తిని జులై 29న స్థానికులు పట్టుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా, “10 నిమిషాల్లో వస్తున్నాం” అని చెప్పిన పోలీసులు గంటన్నర సమయం గడిచినా రాలేదు. వేరే చోట ప్యాట్రోలింగ్‌కు వెళ్లడం వల్లే ఆలస్యమైందని సిబ్బంది సమాధానమివ్వడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.

కమాండ్ కంట్రోల్ పర్యవేక్షణ & అధికారుల స్పందన : రాష్ట్రవ్యాప్తంగా డయల్ 100కు వచ్చే కాల్స్ 24 గంటల పాటు నేరుగా హైదరాబాద్‌లోని అత్యాధునిక కమాండ్ కంట్రోల్ రూమ్‌కు వెళ్తాయి. అక్కడ నుంచి క్షణాల వ్యవధిలోనే సంబంధిత జిల్లాల కంట్రోల్ రూమ్‌లకు, అక్కడి నుంచి ఠాణా పరిధిలోని బ్లూకోర్ట్స్, పెట్రోలింగ్ సిబ్బందికి సమాచారం చేరుతుంది. ఎంతోమంది ప్రమాద బాధితులను సకాలంలో ఆసుపత్రులకు తరలించి ప్రాణాలు కాపాడిన ఘనత కూడా ఈ వ్యవస్థకు ఉంది.

ఈ విషయమై కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం స్పందిస్తూ : “కమిషనరేట్ పరిధిలోకి వచ్చే ప్రతి అత్యవసర ఫిర్యాదుపై తక్షణమే స్పందిస్తున్నాం. డయల్ 100 కాల్స్ వచ్చిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు పూర్తి రక్షణ కల్పిస్తాం. ఒకవేళ డయల్ 100లో ఫిర్యాదు చేసినా క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి సరైన స్పందన రాకపోతే, బాధితులు వెంటనే స్థానిక పోలీసు అధికారులను నేరుగా సంప్రదించాలి” అని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News