Friday, February 13, 2026
HomeతెలంగాణWARNING : చిల్లర గొడవలా? హద్దు మీరితే 'రౌడీషీట్' ఖాయం!

WARNING : చిల్లర గొడవలా? హద్దు మీరితే ‘రౌడీషీట్’ ఖాయం!

Rowdy sheet rules in Telangana : చిన్న విషయానికే గొడవ.. మాటామాటా పెరిగి దాడి.. సినిమాలను చూసి హీరోల్లా ఫీలై, వీధుల్లో వీరంగం వేస్తున్నారా? అయితే, తస్మాత్ జాగ్రత్త! మీ భవిష్యత్తుపై ‘రౌడీషీట్’ అనే మాయని మచ్చ పడటం ఖాయం. రాష్ట్రంలో, ముఖ్యంగా యువతలో పెరుగుతున్న హింసా ప్రవృత్తిపై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఘర్షణలకు, దాడులకు పాల్పడే వారిపై రౌడీషీట్లు తెరుస్తూ, వారి కదలికలపై నిరంతర నిఘా పెడుతున్నారు. 

- Advertisement -

పెరుగుతున్న హింస : వెబ్ సిరీస్‌లు, సినిమాల ప్రభావంతో, నేటి యువతలో సహనం కొరవడుతోంది. ర్యాగింగ్ పేరుతో తోటి విద్యార్థులను హింసించడం. అడ్డగోలుగా వాహనాలు నడుపుతుంటే ప్రశ్నించిన వారిపై దాడులు చేయడం. ఇంటి ముందు కారు పార్క్ చేసినందుకు పిడిగుద్దులతో సమాధానం చెప్పడం.

ఇలాంటి చిన్న చిన్న గొడవలే, ఒక్కోసారి ప్రాణాంతకంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో, నేర ప్రవృత్తిని మొగ్గలోనే తుంచేయాలని, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా తెలంగాణ పోలీసులు కఠిన చర్యలకు ఉపక్రమించారు. 2025 సంవత్సరంలోనే, రాష్ట్రవ్యాప్తంగా 4,359 మందిపై సస్పెక్ట్ షీట్లు, 5,348 మందిపై హిస్టరీ షీట్లు (రౌడీషీట్లు) తెరిచారంటే, పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.

రౌడీషీట్’ తెరిస్తే.. భవిష్యత్తు అంధకారమే : ‘రౌడీషీట్’ అంటే అదేదో సినిమా డైలాగ్ కాదు, అది మీ భవిష్యత్తును శాసించే ఓ అధికారిక పత్రం.
సస్పెక్ట్ షీట్ (మొదటి దశ): నేరాలకు పాల్పడతాడని అనుమానం ఉన్న వ్యక్తిపై పోలీసులు ‘సస్పెక్ట్ షీట్’ తెరుస్తారు. అప్పటి నుంచి, ఆ ప్రాంతంలో ఏ నేరం జరిగినా, మొదట వీరినే విచారిస్తారు.
హిస్టరీ/రౌడీ షీట్ (రెండో దశ): అయినా ప్రవర్తనలో మార్పు రాకపోతే, ‘హిస్టరీ షీట్’ లేదా ‘రౌడీ షీట్’ తెరుస్తారు.
స్టేషన్‌లో హాజరు: రౌడీషీట్ తెరిచిన వ్యక్తి, క్రమం తప్పకుండా స్థానిక పోలీస్ స్టేషన్‌లో హాజరై, సంతకం చేయాల్సి ఉంటుంది.
ముందస్తు అరెస్టులు: ఎన్నికలు, పండగల వంటి సమయాల్లో, శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా, రౌడీషీటర్లను ముందస్తుగా అరెస్ట్ చేస్తారు.
పాస్‌పోర్ట్, ఉద్యోగాలకు గండి: పాస్‌పోర్ట్ వెరిఫికేషన్, ప్రభుత్వ ఉద్యోగాల ఎంపిక సమయంలో ‘రౌడీషీట్’ తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. రాజకీయ స్పర్థలు, భూవివాదాల కారణంగా ముఠాలుగా ఏర్పడి దాడులు చేసుకునే వారిపై ‘గ్యాంగ్ ఫైల్స్’ కూడా తెరుస్తున్నారు. క్షణికావేశంలో చేసే చిన్న పొరపాటు, జీవితాంతం మిమ్మల్ని ‘రౌడీ’గా ముద్ర వేస్తుందని, మీ భవిష్యత్తును అంధకారంలోకి నెడుతుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News