Telangana railway project alignment : ప్రాంతాల అభివృద్ధికి ఊతమిస్తాయనుకున్న కొత్త రైలు మార్గాలకు భూసేకరణ రూపంలో పెద్ద అడ్డంకి ఎదురైంది. సారవంతమైన భూములు, అధిక ధరలు, ఇప్పటికే పలుమార్లు భూములిచ్చి నష్టపోయిన రైతుల ఆవేదన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి రైల్వే శాఖ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఫలితంగా, రెండు కీలక రైలు మార్గాల అసలు ప్రణాళిక (ఎలైన్‌మెంట్) పక్కకు తప్పుకోనుంది. రైతులకు నష్టం కలగకుండా, వెనుకబడిన ప్రాంతాలకు న్యాయం చేసేలా ప్రభుత్వం సూచించిన ప్రత్యామ్నాయ మార్గాలేంటి..? అసలు రైల్వే శాఖ ప్రతిపాదించిన పాత మార్గంలో ఉన్న సమస్యలేమిటి..? ఈ మార్పుల వెనుక ఉన్న అసలు కథేంటి..?
ఎందుకీ మార్పు… ఏమిటా ఇక్కట్లు : డోర్నకల్-గద్వాల, డోర్నకల్-మిర్యాలగూడ రైలు మార్గాల కోసం రైల్వే శాఖ మొదట ప్రతిపాదించిన ఎలైన్‌మెంట్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కూసుమంచి, పాలేరు, నేలకొండపల్లి వంటి సారవంతమైన ప్రాంతాల గుండా వెళ్తోంది.
భూమికి బంగారు ధర: ఈ ప్రాంతాల్లో ఇప్పటికే ఎస్సారెస్పీ కాలువ, హైటెన్షన్ విద్యుత్ లైన్లు, జాతీయ రహదారుల కోసం పలుమార్లు భూసేకరణ జరిగింది. దీంతో భూముల ధరలు ఆకాశాన్నంటాయి. సేకరణ ప్రభుత్వానికి ఆర్థిక భారంగా మారింది.
రైతుల ఆవేదన: ఇక్కడి భూ యజమానుల్లో అత్యధికులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన చిన్న, సన్నకారు రైతులేనని, పదేపదే భూసేకరణతో వారు జీవనోపాధి కోల్పోతారని రాష్ట్ర ప్రభుత్వం రైల్వే శాఖకు నివేదించింది.
ప్రభుత్వం చూపిన ప్రత్యామ్నాయ బాట: ఈ సమస్యలను అధిగమించేందుకు, వెనుకబడిన ప్రాంతాలకు ప్రయోజనం చేకూర్చేలా రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రతిపాదనలను రైల్వే శాఖ ముందుంచింది. మరిపెడ, అబ్బాయిపాలెం మీదుగా ఈ మార్గాలను మళ్లించాలని సూచించింది.
రైలు మార్గం పాత ఎలైన్‌మెంట్ (రైల్వే శాఖ ప్రతిపాదన) కొత్త ఎలైన్‌మెంట్ (రాష్ట్ర ప్రభుత్వ సూచన)
డోర్నకల్-గద్వాల మోతె-కొత్తగూడెం-పాలేరు-చేగొమ్మ-డోర్నకల్ మోతె-గుండెపూడి-మరిపెడ-అబ్బాయిపాలెం-మన్నెగూడెం-డోర్నకల్
డోర్నకల్-మిర్యాలగూడ డోర్నకల్-కూసుమంచి-నేలకొండపల్లి-కోదాడ-మిర్యాలగూడ డోర్నకల్-మన్నెగూడెం-అబ్బాయిపాలెం-మరిపెడ-గుండెపూడి-మోతె-కోదాడ-మిర్యాలగూడ
ప్రాధాన్యతలు మారడంతోనే : రైల్వే శాఖ ప్రతిపాదించిన పాత మార్గంలో స్తంభాద్రి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (SUDA), గ్రానైట్ పరిశ్రమలు, చారిత్రక నేలకొండపల్లి బౌద్ధ స్థూపం, పాలేరు రిజర్వాయర్ వంటి పర్యాటక, పారిశ్రామిక ప్రాంతాలున్నాయి. అయినప్పటికీ, భూసేకరణ ఇబ్బందులు, మహబూబాబాద్ ఎంపీ సైతం తమ నియోజకవర్గంలోని వెనుకబడిన మరిపెడ మీదుగా ప్రాజెక్టును చేపట్టాలని లేఖ రాయడం వంటి పరిణామాలతో రైల్వే శాఖ పునరాలోచనలో పడినట్లు సమాచారం. రైలు మార్గం ప్రారంభ స్థానాన్ని కూడా డోర్నకల్ నుంచి సమీపంలోని పాపట్‌పల్లికి మార్చే అంశంపైనా చర్చలు జరుగుతున్నాయి.
రాష్ట్రంలో తొలిసారిగా నాలుగు లైన్ల మార్గం: మరోవైపు, రాష్ట్ర రైల్వే అభివృద్ధిలో ఒక కీలక ముందడుగు పడింది. సికింద్రాబాద్ (సనత్‌నగర్) – వాడి మధ్య రాష్ట్రంలోనే తొలిసారిగా నాలుగు లైన్ల అంతర్రాష్ట్ర రైలు మార్గానికి కేంద్రం పచ్చజెండా ఊపింది. రూ.5,102 కోట్ల వ్యయంతో ఐదేళ్లలో పూర్తి చేయాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు ముందుకు సాగుతోంది. ఇది పూర్తయితే తెలంగాణ నుంచి ముంబయి వైపు ప్రయాణం మరింత వేగవంతం కానుంది.

