Cesarean deliveries: నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. దేశవ్యాప్తంగా ప్రసవాల తీరును పరిశీలిస్తే.. సాధారణ కాన్పుల కంటే సిజేరియన్ల వైపే మొగ్గు ఎక్కువగా కనిపిస్తోంది. అందులోనూ తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది.
జాతీయ సగటు కంటే 3 రెట్లు అధికం!: తెలంగాణలో జరిగే ప్రసవాల్లో సగానికి పైగా ఆపరేషన్లే అవుతున్నాయి. రాష్ట్రంలో దాదాపు 62.2 శాతం ప్రసవాలు సిజేరియన్ల ద్వారే అవుతున్నాయి. దేశ సగటుతో పోలిస్తే తెలంగాణలో సిజేరియన్లు దాదాపు 3 రెట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం. దేశంలో ఈ శాతం 22.9 శాతంగా నమోదయ్యింది. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లోనూ సిజేరియన్ల శాతం ఆందోళనకరంగానే ఉంది. ఏపీలో 52.2 శాతం ప్రసవాలు ఆపరేషన్ల ద్వారానే జరుగుతున్నాయి.
ప్రభుత్వాస్పత్రుల్లోనూ అదే జోరు: సాధారణ కాన్పులకు కేరాఫ్ అడ్రస్‌గా నిలవాల్సిన ప్రభుత్వ ఆసుపత్రుల్లో సైతం తెలంగాణలో 48.6 శాతం సిజేరియన్ ప్రసవాలే జరుగుతున్నాయి. గర్భిణీలలో శారీరక శ్రమ తగ్గడం, ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్లే సిజేరియన్ల శాతం ఎక్కువగా పెరుగుతుంది. అంతేకాకుండా ప్రైవేట్ ఆసుపత్రుల ధోరణి కూడా సిజేరియన్ల పెరుగుదలకు కారణమని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.
Also read-NIMS: నిమ్స్‌లో మాక్ ఫైర్ డ్రిల్.. అత్యవసర సమయాల్లో ప్రాణరక్షణే ధ్వేయం!
మధుమేహంలో జాతీయ సగటును దాటేసిన తెలంగాణ!: మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా తెలంగాణలో మధుమేహం (డయాబెటిస్) బారిన పడుతున్న వారి సంఖ్య ప్రమాదకరంగా పెరుగుతోంది. ఈ విభాగంలోనూ తెలంగాణ జాతీయ సగటును దాటేసింది. షుగర్ వ్యాధి పురుషుల్లో 28.2 శాతంగా నమోదుకాగా.. మహిళల్లో 24.2 శాతంగా నమోదయ్యింది. ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం వల్ల యువత, నడివయస్కులు మధుమేహం బారిన పడుతున్నారని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. ప్రజారోగ్యంపై తక్షణమే ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరాన్ని ఈ సర్వే గణాంకాలు గుర్తుచేస్తున్నాయి.

