HomeTop StoriesPaddy Procurement : కర్ణాటకకు క్యూ కడుతున్న తెలంగాణ 'సన్నాలు'.. పొరుగు రాష్ట్రాల్లో మన వడ్లకు...

Paddy Procurement : కర్ణాటకకు క్యూ కడుతున్న తెలంగాణ ‘సన్నాలు’.. పొరుగు రాష్ట్రాల్లో మన వడ్లకు ఎందుకింత డిమాండ్?

Telangana paddy demand in Karnataka : తెలంగాణ మాగాణుల్లో పండిన ‘సన్న’ ధాన్యానికి పొరుగు రాష్ట్రాల్లో ఎన్నడూ లేని విధంగా రెక్కలొచ్చాయి. యాసంగి సీజన్‌లో రైతన్న ఆరుగాలం శ్రమించి పండించిన సన్నాలకు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వ్యాపారుల నుంచి భారీ డిమాండ్ పలుకుతోంది. ముఖ్యంగా మన సరిహద్దు జిల్లాల నుంచి లారీల కొద్దీ వడ్లు కన్నడనాట అడుగుపెడుతున్నాయి. ఇన్నాళ్లూ మన బియ్యాన్ని కొనుగోలు చేసిన ఆ రాష్ట్రాలు.. ఇప్పుడు నేరుగా వడ్లను ఎగబడి మరీ ఎందుకు కొంటున్నాయి. 

- Advertisement -

క్రాప్ హాలిడే.. కన్నడిగుల రాక : కర్ణాటకలోని రాయచూరు, బళ్లారి, కొప్పళ తదితర జిల్లాల్లో వరి సాగుకు ప్రధాన ఆధారం తుంగభద్ర జలాశయం. అయితే, ప్రస్తుతం ఈ డ్యామ్‌లోని 33 గేట్లకు భారీ ఎత్తున మరమ్మతులు జరుగుతున్నాయి. సాగునీటి లభ్యత లేకపోవడంతో ఆయా జిల్లాల్లో వ్యవసాయ యంత్రాంగం ‘క్రాప్ హాలిడే’ (పంట విరామం) ప్రకటించాల్సి వచ్చింది. బెంగళూరు లాంటి మహానగరాలకు సన్న బియ్యం సింహభాగం సరఫరా అయ్యేది ఈ జిల్లాల నుంచే. ఇప్పుడు అక్కడ ఉత్పత్తి నిలిచిపోవడంతో కన్నడ వ్యాపారుల చూపు తెలంగాణపై పడింది.

Also Read: https://teluguprabha.net/top-stories/central-information-commission-clarifies-bcci-does-not-fall-under-the-ambit-of-the-right-to-information-act/

సరిహద్దు జిల్లాల్లో సందడి : ఈ తరుణంలో తెలంగాణలోని నారాయణపేట, గద్వాల, మహబూబ్ నగర్, వికారాబాద్ జిల్లాలతో పాటు నిజామాబాద్ జిల్లాలోని బోధన్ నియోజకవర్గంలో పండిన సన్నాలకు ఊహించని గిరాకీ ఏర్పడింది. వరి కోతలు ముందుగా ప్రారంభమయ్యే బోధన్ ప్రాంతం నుంచి ఇప్పటికే దాదాపు రెండు లక్షల టన్నుల ధాన్యాన్ని కర్ణాటక, మహారాష్ట్ర వ్యాపారులు పెద్ద ఎత్తున కొనుగోలు చేసినట్లు మార్కెట్ వర్గాల భోగట్టా.

ఏపీ, చెన్నై వ్యాపారుల పోటీ : కేవలం కన్నడ వ్యాపారులే కాకుండా, ఆంధ్రప్రదేశ్, చెన్నైలకు చెందిన మిల్లర్లు సైతం తెలంగాణ వడ్లపై కన్నేశారు. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల నుంచి దళారుల ద్వారా భారీగా సన్న ధాన్యాన్ని కొనుగోలు చేసి తరలిస్తున్నారు. వరి ధాన్యం మిల్లింగ్‌కు ప్రసిద్ధి చెందిన మిర్యాలగూడలోని బడా రైస్ మిల్లర్లు సైతం నేరుగా రైతుల వద్దకే వెళ్లి సన్నాలను సేకరిస్తుండటం గమనార్హం.

ప్రభుత్వ లక్ష్యానికి గండి? మంత్రి భరోసా : ఈ యాసంగిలో సుమారు 90 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. కానీ, ఇతర రాష్ట్రాల వ్యాపారుల కొనుగోళ్ల ఉద్ధృతి చూస్తుంటే ఈ సేకరణ 75 నుంచి 80 లక్షల టన్నులకే పరిమితమయ్యే అవకాశం ఉందని పౌరసరఫరాల సంస్థ ఉన్నతాధికారులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు, ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం స్పష్టమైన భరోసా ఇస్తోంది. ఇటీవల ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరులో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని, పండించిన ప్రతి చివరి గింజనూ కనీస మద్దతు ధరతో (MSP) ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు.

Also Read: https://teluguprabha.net/telangana/telangana-bjp-chief-n-ramchandra-rao-said-brs-spreading-false-propaganda-against-bandi-sanjay/

కల్లాల్లో కన్నీటి కష్టాలు : ప్రభుత్వ హామీలు భరోసా ఇస్తున్నా.. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు అన్నదాతలను కలవరపెడుతున్నాయి. కొనుగోలు కేంద్రాల వద్ద ప్రక్రియ నత్తనడకన సాగుతుండటంతో రైతులు రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఓ వైపు కొనుగోళ్లు జరగక, మరోవైపు అకాల వర్షాలు ముంచుకొస్తుండటంతో.. కంటికి రెప్పలా కాపాడుకున్న ధాన్యం ఎక్కడ తడిసిపోతుందోనని అన్నదాతలు బిక్కుబిక్కుమంటున్నారు. దళారులకు అమ్ముకోలేక, కొనుగోలు కేంద్రాల్లో వేచి చూడలేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ప్రక్రియను వేగవంతం చేస్తేనే రైతులకు నిజమైన మేలు జరుగుతుందని వ్యవసాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News