Telangana record paddy procurement : తెలంగాణ మాగాణి పసిడి కాంతులతో మెరిసిపోతోంది. రైతన్న పండించిన ప్రతి గింజకూ గిట్టుబాటు ధర దక్కితే ఆ ఇంట పండుగ వాతావరణం నెలకొంటుంది. సరిగ్గా ఇదే దిశగా అడుగులు వేసిన రాష్ట్ర ప్రభుత్వం, యాసంగి ధాన్యం సేకరణలో సరికొత్త చరిత్ర లిఖించింది. దళారుల బెడద లేకుండా, రవాణా కష్టాలు లేకుండా నేరుగా రైతుల ముంగిటకే వెళ్లి మరీ ధాన్యం కొనుగోలు చేసి దేశానికే ఆదర్శంగా నిలిచింది. రికార్డు స్థాయిలో ధాన్యం సేకరించడమే కాకుండా వేలాది కోట్ల రూపాయలను ఏకకాలంలో నేరుగా అన్నదాతల ఖాతాల్లో జమ చేసి రైతు పక్షపాతిగా తన చిత్తశుద్ధిని చాటుకుంది.
రికార్డుల మోత – రైతన్న ఖాతాలో సిరుల పంట : రాష్ట్రవ్యాప్తంగా 65.91 లక్షల ఎకరాల్లో రికార్డు స్థాయిలో 141 లక్షల మెట్రిక్ టన్నుల వరి దిగుబడి రాగా.. రైతుల నుంచి కనీస మద్దతు ధరకు (MSP) ధాన్యం కొనుగోలు చేసి వారి ఖాతాల్లో అక్షరాలా రూ.35,077 కోట్లు జమ చేసినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రైతులు ఎక్కడా ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశ్యంతో రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 8,575 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, అందుబాటులో ఉన్న 20.86 కోట్ల గోనె సంచుల్లో 18 కోట్ల సంచులను వినియోగించి యుద్ధప్రాతిపదికన కొనుగోళ్లు పూర్తి చేశామని వివరించారు.
కేంద్రం కొర్రీలు.. రాష్ట్రం భరోసా : దేశంలో పండే మొత్తం వరిలో ఏకంగా 61 శాతం వాటా ఒక్క తెలంగాణదే కావడం విశేషం. అయితే, తెలంగాణ నుంచి వరి కొనుగోలు కోటాను కేంద్ర ప్రభుత్వం ఏటా తగ్గిస్తోందని మంత్రి ఆరోపించారు. ఈ యాసంగిలో కేవలం 52 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేయాలని కేంద్రం షరతు పెట్టినప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం రైతుల శ్రేయస్సు దృష్ట్యా వెనక్కి తగ్గలేదు. అన్నదాతల వద్ద ఉన్న ప్రతి వరి గింజనూ కొనుగోలు చేస్తూ, ఎంఎస్‌పీ ప్రకారం లక్ష్యాన్ని మించి కొనుగోళ్లు జరిపింది.
మహిళాశక్తికి మహర్దశ – గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం : కేవలం ధాన్యం కొనడమే కాదు.. ఆ ప్రక్రియలో మహిళా సంఘాలను (SHGs), ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను (PACs) భాగస్వాములను చేసి గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ప్రభుత్వం దన్నుగా నిలిచింది. మహిళా సంఘాల ద్వారా 53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయించి, వారికి కమీషన్ రూపంలో రూ.171 కోట్లు చెల్లించినట్లు మంత్రి వెల్లడించారు. అలాగే, పీఏసీల ద్వారా 90 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసి ఆయా సంఘాలను బలోపేతం చేశామన్నారు.
ప్రతిపక్షాలపై విమర్శనాస్త్రాలు : ధాన్యం సేకరణలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఈ యాసంగిలోనే అత్యధిక రికార్డు నమోదైందని ఉత్తమ్ తెలిపారు. పక్క రాష్ట్రం కేవలం 25 లక్షల మెట్రిక్ టన్నుల వరి మాత్రమే కొనుగోలు చేసిందని గుర్తు చేశారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో రైతులకు రూ.1.35 లక్షల కోట్లు ఇస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రెండేళ్లలోనే రైతులకు రూ.లక్ష కోట్లు అందించిందని స్పష్టం చేశారు. కేంద్రం ఇచ్చిన టార్గెట్ కంటే బీఆర్ఎస్ ప్రభుత్వం తక్కువే కొనుగోలు చేసిందని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ ఇంత భారీ స్థాయిలో వరి సేకరణ జరగలేదని ఆయన ఉద్ఘాటించారు.

