Cabinet meeting: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. సచివాలయం వేదికగా జరగనున్న ఈ భేటీలో పలు కీలక ప్రాజెక్టులు, ప్రజా సంక్షేమ పథకాలు మరియు ఉద్యోగుల డిమాండ్లపై కేబినెట్ చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
ప్రధాన అజెండా తుమ్మిడిహెట్టి బ్యారేజీ: మంత్రివర్గం సమావేశంలో ప్రధానంగా తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణపై చర్చ జరగనుంది. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద 150 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మించి అక్కడి నుంచి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నీటిని తరలించాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రాథమికంగా నిర్ణయించింది. నీటి తరలింపునకు సంబంధించి ఇంజనీరింగ్ అధికారులు ప్రతిపాదించిన నాలుగు మార్గాలను కేబినెట్ పరిశీలించనుంది. అనంతరం వాటిలో ఒకదానికి ఆమోద ముద్ర వేయనుంది.
ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి: చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగులు, పింఛనర్ల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఉద్యోగుల పెండింగ్ బిల్లులను 100 రోజుల్లో క్లియర్ చేయాలనే ప్రభుత్వ లక్ష్యంపై కార్యాచరణను ఖరారు చేయనున్నారు. అంతేకాకుండా ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీన ప్రక్రియపై మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉంది.
సంక్షేమ పథకాలపై నిర్ణయాలు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పలు పథకాలపై ఈ భేటీలో స్పష్టత రానుంది. కొత్తగా పింఛన్ల మంజూరుపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ బీమా పథకం అమలు తీరు తెన్నులపై చర్చించనున్నారు.

