Telangana rain alert latest update : ఎండ తీవ్రతతో నిప్పుల కొలిమిలా మారిన తెలంగాణ ఊపిరి పీల్చుకోబోతోందా? భానుడి భగభగలకు బ్రేక్ వేస్తూ వరుణుడు కరుణించబోతున్నాడా? అవుననే అంటున్నాయి తాజా వాతావరణ సంకేతాలు. రాష్ట్రవ్యాప్తంగా ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఇవాళ, రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన ఈదురుగాలులు వీయడంతో పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
ఉపరితల ఆవర్తనంతో వాతావరణంలో మార్పులు : తెలంగాణపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడనుంది. గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనం వాతావరణ మార్పులతో కాస్త ఉపశమనం పొందనున్నారు. రాబోయే మూడు రోజుల పాటు ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. ఈ వర్షాల సమయంలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు : వర్షాల తీవ్రతను బట్టి వాతావరణ శాఖ పలు జిల్లాలకు వేర్వేరు హెచ్చరికలు జారీ చేసింది:
ఇవాళ (ఆరెంజ్ అలర్ట్): ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, నల్గొండ జిల్లాల్లో భారీ ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు పడే సూచన ఉండటంతో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.
ఇవాళ (ఎల్లో అలర్ట్): హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, యాదాద్రి, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు.
రేపు (ఆరెంజ్ అలర్ట్): ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో వర్ష సూచనతో ఆరెంజ్ అలర్ట్ కొనసాగనుంది.
రేపు (ఎల్లో అలర్ట్): ఉమ్మడి నల్గొండ, వరంగల్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, మహబూబ్‌నగర్, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
నైరుతి రుతుపవనాల ఆగమనం ఎప్పుడు : ఈ సంవత్సరం రుతుపవనాల ప్రయాణం అత్యంత వేగంగా సాగుతోంది. ఎల్లుండి (జూన్ 4, 2026) కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించడానికి అత్యంత అనుకూల పరిస్థితులు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. కేరళను తాకిన తర్వాత సుమారు వారం రోజుల్లో (జూన్ 10-12 నాటికి) రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉంది.
డిగ్రీల మేర పడిపోనున్న ఉష్ణోగ్రతలు : తెలంగాణ వ్యాప్తంగా ఎండల తీవ్రత క్రమంగా తగ్గబోతోంది. రాగల నాలుగు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల మేర తగ్గే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో ప్రజలు ఉక్కపోత నుంచి తీవ్ర ఉపశమనం పొందుతారని అంచనా వేస్తున్నారు. అయితే, బలమైన ఈదురుగాలులు వీచే సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాల కింద నిలబడవద్దని, అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ ప్రజలను కోరింది.

