Telangana Mahila Shakti RTC buses scheme : ఒకప్పుడు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశమే ఒక వరంగా భావించిన మహిళలు.. నేడు ఏకంగా ఆ బస్సులకే యజమానురాళ్లుగా మారారు. రాష్ట్ర మహిళల ఆర్థికాభివృద్ధే ధ్యేయంగా సికింద్రాబాద్‌లోని పరేడ్ మైదానం ఒక చారిత్రక ఘట్టానికి వేదికగా నిలిచింది. కన్నుల పండువగా జరిగిన ‘మహిళాశక్తి’ సభలో స్వయం సహాయక బృందాలకు (SHG) ఏకంగా 553 ఆర్టీసీ బస్సులను ప్రభుత్వం పంపిణీ చేసింది. మంత్రులు జెండా ఊపి ఈ ప్రగతి రథచక్రాలను లాంఛనంగా ప్రారంభించారు.
ఆదాయానికి భరోసా – ఆర్టీసీతో అనుసంధానం : మహిళలను కేవలం నామమాత్రపు యజమానులుగా ఉంచకుండా, వారికి శాశ్వత ఆదాయ వనరులు కల్పించేలా ప్రభుత్వం పటిష్టమైన ప్రణాళిక రచించింది. రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ పథకం పనితీరును వివరిస్తూ.. మహిళా సమాఖ్య కొనుగోలు చేసిన ఈ బస్సులను ఆర్టీసీ అద్దెకు తీసుకుంటుందని స్పష్టం చేశారు. తద్వారా వచ్చే అద్దె రూపంలో మహిళా సంఘాలకు ప్రతి నెలా స్థిరమైన ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది. ఇది మహిళల సాధికారతలో కీలక ముందడుగుగా ఆయన అభివర్ణించారు.
మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం : ఈ సభలో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ విజన్‌ను స్పష్టం చేశారు. అక్కాచెల్లెళ్లకు 553 ఆర్టీసీ బస్సులను అందించడం ద్వారా వారి ఆర్థిక స్థితిగతులను మార్చబోతున్నామన్నారు. గత ప్రభుత్వం ఆర్థిక విధ్వంసానికి పాల్పడితే, తమ సర్కార్ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తోందని విమర్శించారు. మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దే బృహత్తర లక్ష్యంతో తమ ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తోందని ఆయన ఉద్ఘాటించారు.
ఆర్థిక స్వాలంబన దిశగా వేల కోట్ల రుణాలు : పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఈ సందర్భంగా పలు కీలక గణాంకాలను వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో మహిళలను ఆర్థికంగా అగ్రభాగాన నిలిపేందుకు నిరంతర కృషి జరుగుతోందన్నారు. ఇప్పటివరకు మహిళలకు ఏకంగా రూ.61 వేల కోట్ల వడ్డీ లేని రుణాలను అందించినట్లు తెలిపారు. ఐకేపీ (IKP) సెంటర్ల ద్వారానే మహిళా సమాఖ్యకు అక్షరాలా రూ.159 కోట్ల మేర ఆదాయం సమకూరిందని ఆమె వెల్లడించారు.
ప్రతిపక్షాలకు కంటగింపుగా మహిళాశక్తి : మహిళలు ఆర్థికంగా స్థిరపడి సంతోషంగా ఉంటే ప్రతిపక్ష బీఆర్‌ఎస్ ఓర్చుకోలేకపోతోందని మంత్రి సీతక్క ధ్వజమెత్తారు. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు హైటెక్‌సిటీ లాంటి అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఏకంగా రూ.350 కోట్ల విలువైన భూమిని మహిళా భవనాలకు, వారి ఉపాధి అవకాశాలకు కేటాయించామని, ఇది మహిళల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని ఆమె స్పష్టం చేశారు.

