Khammam: ఖమ్మం జిల్లా వెలుగుమట్లలోని భూదాన్ భూముల్లో నిర్మించిన ఇళ్ల కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఇళ్ల కూల్చివేతలపై మధ్యంతర ఉత్తర్వులు (స్టే) ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. సీసీఎల్‌ఏ జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ.. వెలుగుమట్ల భూముల్లో జరుగుతున్న కూల్చివేతలను అడ్డుకుంటూ స్టే ఇవ్వాలని హైకోర్టులో 23 పిటిషన్లు దాఖలయ్యాయి.
నేడు విచారణ
నేడు గురువారం ఈ పిటిషన్స్ ను కోర్టు విచారించింది. ప్రస్తుతం అక్కడ అర్హులైన పేదలకు పట్టాలు ఇచ్చే ప్రక్రియ కొనసాగుతున్నందున ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో ప్రభుత్వ పక్షాన వాదనలు వినిపించిన గవర్నమెంట్ ప్లీడర్ మురళీధర్ రెడ్డి.. వెలుగుమట్ల ప్రాంతంలో ప్రభుత్వం ఇప్పటికే పారదర్శకంగా సర్వే నిర్వహించిందని తెలిపారు. అర్హులైన వారిని గుర్తించి మొత్తం 311 మందికి పట్టాలను మంజూరు చేసినట్లు ఆయన కోర్టుకు వివరించారు.
స్టే ఇవ్వడం సరికాదు
అర్హులకు న్యాయం జరుగుతున్న వేళ కూల్చివేతలపై స్టే ఇవ్వడం సరికాదని పేర్కొన్నారు. మరోవైపు వెలుగుమట్ల భూదాన్ భూముల్లో అక్రమ నిర్మాణాలు ఉన్నాయంటూ గతంలో అధికారులు కూల్చివేతలు చేపట్టిన సంగతి తెలిసిందే. దీనిపై బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే, ప్రభుత్వం అక్కడ అర్హులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తుండటంతో కోర్టు ప్రభుత్వ నిర్ణయానికే మొగ్గు చూపింది. పిటిషనర్ల అభ్యర్థనను తోసిపుచ్చుతూ తదుపరి విచారణను వాయిదా వేసింది.

