HomeతెలంగాణTGSPDCL : విద్యుత్ రంగంలో సరికొత్త విప్లవం.. స్మార్ట్ మీటర్లు, నెట్‌వర్క్ మ్యాపింగ్‌తో పారదర్శక సేవలు

TGSPDCL : విద్యుత్ రంగంలో సరికొత్త విప్లవం.. స్మార్ట్ మీటర్లు, నెట్‌వర్క్ మ్యాపింగ్‌తో పారదర్శక సేవలు

హైదరాబాద్‌ (తెలుగుప్రభ): టీజీఎన్‌పీడీసీఎల్‌, టీజీఎస్పీడీసీఎల్‌ సంస్థలు త్వరలోనే స్మార్ట్‌ మీటర్ల అమలుకు ముందుకు సాగనున్నాయని, ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని టీజీఎస్పీడీసీఎల్‌ సీఎండీ జితేష్‌ వి. పాటిల్‌ వెల్లడించారు. స్మార్ట్‌ మీటర్లతో విద్యుత్‌ బిల్లులు పెరుగుతాయనే అభిప్రాయాలు వాస్తవదూరమని, ఈ సాంకేతికత వినియోగదారులకు మరింత పారదర్శకతను అందిస్తుందని స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని హైటెక్స్‌ – నోవాటెల్‌లో జరిగిన ఇండియా ఎనర్జీ సమ్మిట్‌ అండ్‌ ఎక్స్‌పో 2026లో ‘మాడ్రనైజింగ్‌ ట్రాన్స్‌మిషన్‌ అండ్‌ డిస్ట్రిబ్యూషన్‌: స్మార్ట్‌ గ్రిడ్స్‌ ఫర్‌ ఎ రిలయబుల్‌ పవర్‌ ఫ్యూచర్‌’ అంశంపై జరిగిన ప్యానెల్‌ చర్చలో ఆయన పాల్గొన్నారు. టీజీఎస్పీడీసీఎల్‌లో అమలు చేస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, కృత్రిమ మేధస్సు (ఏఐ), నెట్‌వర్క్‌ మ్యాపింగ్‌, స్మార్ట్‌ మీటరింగ్‌ తదితర కార్యక్రమాలను వివరించారు. స్మార్ట్‌ మీటర్లు కేవలం ఆదాయ పరిరక్షణకే కాకుండా విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలను ముందుగానే గుర్తించి పరిష్కరించేందుకు దోహదపడతాయని జితేష్‌ వి. పాటిల్‌ తెలిపారు

- Advertisement -

వినియోగదారులు ఫిర్యాదు చేయకముందే సమస్యలను గుర్తించి పరిష్కరించే అవకాశం ఉంటుందన్నారు. విద్యుత్‌ వినియోగం, బిల్లింగ్‌ వివరాలను వినియోగదారులు ఎప్పటికప్పుడు స్వయంగా పర్యవేక్షించుకోవచ్చని చెప్పారు. వినియోగదారుల డేటా భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, డిజిటల్‌ పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌ చట్టం నేపథ్యంలో పటిష్ఠమైన సాంకేతిక మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన ఐటీ బృందం ద్వారా డేటా గోప్యతను కాపాడుతున్నామని భరోసా ఇచ్చారు. టీజీఎస్పీడీసీఎల్‌లో విద్యుత్‌ వ్యవస్థ పనితీరుపై రోజువారీగా సమగ్ర విశ్లేషణలు నిర్వహిస్తున్నామని సీఎండీ తెలిపారు. ఏఐ ద్వారా తక్కువ సమయంలో భారీ స్థాయిలో డేటాను విశ్లేషించి, నష్టాలను తగ్గించడంతో పాటు వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తున్నామని చెప్పారు. గతంలో అంతరాయాలు, లోపాలను గుర్తించి చర్యలు తీసుకునేవారని, ప్రస్తుతం ఒక వారంలో జరిగిన అన్ని ట్రిప్పింగ్స్‌ను విశ్లేషించి వాటి మూలకారణాలను గుర్తిస్తున్నామని తెలిపారు. సమస్యాత్మక ఫీడర్లను గుర్తించి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని వివరించారు.


ఎండ్‌ – టు – ఎండ్‌ నెట్‌వర్క్‌ మ్యాపింగ్‌ పూర్తి : జూలైలో సంస్థ విద్యుత్‌ నెట్‌వర్క్‌కు సంబంధించిన ఎండ్‌ – టు – ఎండ్‌ మ్యాపింగ్‌ను పూర్తి చేసిందని జితేష్‌ వి. పాటిల్‌ వెల్లడించారు. వినియోగదారు యూఎస్‌సీ నంబర్‌ ఆధారంగా ఏ పోల్‌, డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్‌, సబ్‌స్టేషన్‌, ఫీడర్‌, విద్యుత్‌ మూలం నుంచి సరఫరా జరుగుతుందో ఖచ్చితంగా గుర్తించే సామర్థ్యాన్ని సంస్థ సాధించిందన్నారు. దీంతో ట్రాన్స్‌ఫార్మర్లపై లోడ్‌ను శాస్త్రీయంగా విశ్లేషించి, అవసరమైన చోట సామర్థ్య పెంపు పనులను వేగంగా చేపట్టే అవకాశం ఏర్పడిందని చెప్పారు. హైదరాబాద్‌ నగరంలోని ప్రధాన పట్టణ ప్రాంతాల్లో భూగర్భ విద్యుత్‌ కేబులింగ్‌ విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని సీఎండీ తెలిపారు. దీనివల్ల తాత్కాలిక విద్యుత్‌ అంతరాయాలు తగ్గడంతో పాటు నగర మౌలిక వసతుల అభివృద్ధికి కూడా తోడ్పడుతుందని పేర్కొన్నారు. సమ్మిట్‌లో తెలంగాణ ప్రభుత్వ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌, ట్రాన్స్‌కో సీఎండీ డి. కృష్ణ భాస్కర్‌, టీజీఎస్పీడీసీఎల్‌ డైరెక్టర్లు, సంస్థ పరిధిలోని 21 సర్కిళ్ల డివిజనల్‌, అసిస్టెంట్‌ డివిజనల్‌ ఇంజనీర్లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News