HomeతెలంగాణTGSRTC : టికెట్ కష్టాలకు చెల్లుచీటీ.. ఆర్టీసీ బస్సుల్లో అడ్వాన్స్ టికెటింగ్ అద్భుతం!

TGSRTC : టికెట్ కష్టాలకు చెల్లుచీటీ.. ఆర్టీసీ బస్సుల్లో అడ్వాన్స్ టికెటింగ్ అద్భుతం!

TGSRTC advance ticketing system Mee Ticket app : మహా నగరం గమ్యస్థానాలకు చేరుకునే వేగంలో నిత్యం కాలంతో పోటీపడుతోంది. రోజువారీ ఉద్యోగులు, విద్యార్థులు, సామాన్య ప్రయాణికులతో కిటకిటలాడే భాగ్యనగర ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడమంటే ఒక పెద్ద సాహసమే! కిక్కిరిసిన రద్దీలో నిలబడి, కండక్టర్ వద్ద చిల్లర సమస్యలతో సతమతమవుతూ టికెట్ తీసుకోవడం ప్రతి ప్రయాణికుడికి నిత్య పరీక్షగా మారింది. అయితే, ఈ ప్రయాణ కష్టాలకు చెల్లుచీటీ పాడుతూ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ఒక విప్లవాత్మకమైన అడుగు వేస్తోంది. హైదరాబాద్ మెట్రో రైలు తరహాలోనే నగరం లోపల తిరిగే సిటీ బస్సుల్లోనూ ప్రయాణానికి ముందే టికెట్ బుక్ చేసుకునే ‘అడ్వాన్స్ / బోర్డింగ్ టికెటింగ్’ సరికొత్త విధానాన్ని త్వరలోనే ప్రవేశపెట్టబోతోంది.

- Advertisement -

అడ్వాన్స్ టికెటింగ్ విధానం ఎలా పనిచేస్తుంది?  : టీజీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు అత్యంత సులువైన డిజిటల్ అనుభవాన్ని అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ‘మీ టికెట్’ మొబైల్ యాప్‌లో ప్రత్యేకమైన ఫీచర్‌ను జోడిస్తోంది. ప్రయాణికులు బస్సు ఎక్కడానికి ముందే తమ మొబైల్‌లోని ‘మీ టికెట్’ యాప్‌ ఓపెన్ చేసి, ఎక్కాల్సిన బోర్డింగ్ స్టాప్ చేరుకోవాల్సిన గమ్యస్థానాన్ని  ఎంచుకోవాలి.

డిజిటల్ పేమెంట్స్: టికెట్ రుసుమును నగదుతో పనిలేకుండా UPI, డెబిట్/క్రెడిట్ కార్డ్‌లు లేదా డిజిటల్ వాలెట్ల ద్వారా క్షణాల్లో చెల్లించవచ్చు. ప్రయాణికులు ఆర్టీసీకి చెందిన ‘గమ్యం’ యాప్ సహకారంతో తమ బస్సు ప్రస్తుతం ఎక్కడుందో లైవ్ లో ట్రాక్ చేయవచ్చు. బస్సు వచ్చే సమయానికి కచ్చితంగా స్టాప్‌కు చేరుకుని, ముందే తీసుకున్న డిజిటల్ టికెట్‌తో నేరుగా బోర్డింగ్ కావచ్చు. బస్సులో రద్దీ సమయాల్లో సాంకేతిక లోపాల వల్ల డిజిటల్ పేమెంట్ మిషన్లు పనిచేయకపోవడం, టికెట్ జారీలో ఆలస్యమై బస్ షెడ్యూల్ దెబ్బతినడం వంటి సమస్యలకు ఈ ముందస్తు బుకింగ్ తో చెక్ పడుతుంది. కండక్టర్లకు, ప్రయాణికులకు ఇద్దరికీ ప్రయాణం నల్లేరుపై నడకలా మారుతుంది.

గ్రేటర్ పరిధిలో డిజిటల్ విప్లవం :  గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆర్టీసీ రోజువారీ సేవలు విస్తృత స్థాయిలో సాగుతున్నాయి:
మొత్తం బస్సులు: 3,200కు పైగా రోజువారీ సర్వీసులు.

దైనందిన ప్రయాణికులు: దాదాపు 26 లక్షల మంది రోజువారీ ప్రయాణం చేస్తున్నారు.

మహాలక్ష్మి పథకం: ప్రయాణికుల్లో ఏకంగా 70 శాతం మంది మహిళలు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారు.

ఆదాయం & డిజిటల్ వాటా: సంస్థకు రోజుకు రూ. 6.5 కోట్ల మేర ఆదాయం సమకూరుతుండగా, ప్రస్తుతం అందులో 23 శాతం డిజిటల్ చెల్లింపుల ద్వారానే వస్తోంది. తాజాగా అందుబాటులోకి రానున్న అడ్వాన్స్ టికెటింగ్ విధానంతో డిజిటల్ చెల్లింపుల శాతం మరింత గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

విద్యార్థులకు డిజిటల్ బస్ పాస్‌లు – క్యూలైన్లకు స్వస్తి : ఇప్పటికే సాధారణ ప్రయాణికుల కోసం ‘మీ టికెట్’ యాప్ ద్వారా అందిస్తున్న డిజిటల్ బస్ పాస్ సేవలకు నగరవాసుల నుంచి అపూర్వ స్పందన లభించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 25న ఈ డిజిటల్ పాస్ విధానాన్ని ప్రారంభించగా, ఇప్పటివరకు 14,000 మందికి పైగా ప్రయాణికులు ఈ యాప్ ద్వారా పాస్‌లు పొంది ప్రయాణిస్తున్నారు. దీని ద్వారా ఆర్టీసీకి రూ. 2 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. ప్రస్తుతం ఈ యాప్‌లో సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, మెట్రో డీలక్స్, పుష్పక్ ఏసీ బస్‌పాస్‌లు మరియు టీ-24 (T-24) టికెట్లు డిజిటల్ రూపంలో లభిస్తున్నాయి.

ఈ విజయాన్ని స్పూర్తిగా తీసుకుని, విద్యార్థులకు కూడా డిజిటల్ బస్ పాస్‌లను జారీ చేసేందుకు ఆర్టీసీ తీవ్ర కసరత్తు చేస్తోంది. దీనివల్ల విద్యాసంవత్సరం ప్రారంభంలో లేదా ప్రతి నెలా బస్ పాస్ కౌంటర్ల వద్ద గంటల తరబడి క్యూలైన్లలో నిలబడే తిప్పలు విద్యార్థులకు తప్పుతాయి. అటు సిబ్బందిపై కూడా పనిభారం గణనీయంగా తగ్గుతుంది.

చిలకలగూడలో కొత్త బస్ టెర్మినల్, ఈ-ఛార్జింగ్ స్టేషన్ : నగరంలో పెరుగుతున్న జనాభా, వాహనాల రద్దీకి అనుగుణంగా ప్రజా రవాణా వ్యవస్థను ఆధునీకరించేందుకు టీజీఎస్ ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేసింది. నిత్యం అత్యంత రద్దీగా ఉండే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించేందుకు చిలకలగూడలో కొత్త బస్ టెర్మినల్ నిర్మాణం చేపట్టనున్నారు. సౌత్ సెంట్రల్ రైల్వే, TGSRTC ల మధ్య కుదిరిన ఉమ్మడి భూ బదిలీ ఒప్పందం  ఆధారంగా ఈ ప్రాజెక్టును పట్టాలెక్కిస్తున్నారు. కొత్త టెర్మినల్‌లోనే భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఎలక్ట్రిక్ (ఈ-బస్సుల) ఛార్జింగ్ స్టేషన్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News