TGTRANSCO: తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె బాట పట్టిన విద్యుత్ ఆర్టిజన్లపై ట్రాన్స్‌కో కఠిన చర్యలకు సిద్ధమైంది. సమ్మె చేస్తున్న ఆర్టిజన్లు వెంటనే తమ నిరసన విరమించాలని కోరింది. గురువారం ఉదయం 11 గంటలలోగా విధుల్లో చేరాలని బుధవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. గడువులోగా విధులకు హాజరుకాని పక్షంలో వారిని ఉద్యోగాల నుంచి తొలగించినట్లుగానే భావిస్తామని సంస్థ యాజమాన్యం స్పష్టం చేసింది.
టెస్మా ప్రయోగం: తెలంగాణ నిత్యావసర సేవల నిర్వహణ చట్టం (టెస్మా) కింద విద్యుత్ సరఫరా అత్యవసర సర్వీసుల పరిధిలోకి వస్తుందని ట్రాన్స్‌కో గుర్తు చేసింది. విద్యుత్ సంస్థల్లో సమ్మెలపై నిషేధం ఉన్నందున.. ప్రస్తుత నిరసన పూర్తిగా అక్రమమని స్పష్టం చేసింది. విధులకు గైర్హాజరైన తాత్కాలిక ఉద్యోగులు (ఆర్టిజన్లు) తక్షణమే విధుల్లో చేరాలని ఆదేశించింది.
నిబంధనల ఉల్లంఘనపై ఆగ్రహం: ఆర్టిజన్ల ఐక్య కార్యాచరణ సమితి తమ డిమాండ్లపై ఇప్పటికే పారిశ్రామిక ట్రైబ్యునల్‌లో కేసు దాఖలు చేసిన విషయాన్ని ట్రాన్స్‌కో ఈ సందర్భంగా ప్రస్తావించింది. కేసు విచారణలో ఉండగా సమ్మెకు వెళ్లడం పారిశ్రామిక నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది. నిబంధనలను అతిక్రమించి సమ్మె కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ సరఫరాకు ఆటంకం కలగకుండా ఉండేందుకు యాజమాన్యం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. మరి ట్రాన్స్‌కో హెచ్చరికలపై ఆర్టిజన్ల సంఘాలు ఎలా స్పందిస్తాయన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.

