- ముఠా తగాదాలే నేడు ప్రజాస్వామ్యంగా మారాయి
- ఎవరికీ స్పష్టమైన అభివృద్ధి నమూనా లేదు
- శాసనసభలను ‘కాంట్రాక్టర్ వర్గం’ కబళించింది
- విశ్వవిద్యాలయాలను పాలకులు నిర్వీర్యం చేశారు
- ప్రశ్నించే యువతరం, ప్రజాస్వామిక శక్తులే నేటి ఏకైక ఆశాకిరణం
- తెలుగుప్రభ ప్రతినిధితో ప్రొఫెసర్ హరగోపాల్ సంభాషణ
విధానపరమైన సిద్ధాంతాలు, భావజాల స్పష్టత పూర్తిగా కనుమరుగై.. కేవలం రాజ్యాధికారం కోసం సాగే ముఠా తగాదాలే నేడు ప్రజాస్వామ్యంగా చెలామణీ అవుతున్నాయని ప్రముఖ విద్యావేత్త, ప్రొఫెసర్ హరగోపాల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నయా ఉదారవాద ఆర్థిక విధానాలు తెచ్చిన సంపద కేంద్రీకరణ, రాజకీయాల్లోకి దొడ్డిదారిన చొరబడిన ‘కాంట్రాక్టర్ వర్గం’ కలిసి ప్రజా సమస్యలను శాసనసభల నుంచి తరిమేశాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సంపద పెంచడం, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడమే పరమావధిగా మారిన ప్రస్తుత తరుణంలో.. ఏ పార్టీ వద్ద కూడా సమగ్రమైన ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనా లేకపోవడం వల్లే సిద్ధాంత చర్చల స్థానంలో వ్యక్తిగత దూషణలు, అసెంబ్లీ బహిష్కరణల పర్వం నడుస్తోందని తేల్చిచెప్పారు. విద్యా రంగాన్ని, విశ్వవిద్యాలయాలను కార్పొరేటీకరణతో నిర్వీర్యం చేస్తున్న ఈ సంక్షోభ సమయం నుంచి సమాజం బయటపడాలంటే.. ప్రశ్నించే ‘జెన్-జీ’ యువతరం, ప్రజాస్వామిక శక్తులు ప్రత్యామ్నాయ రాజకీయ వేదికగా ఎదగడమే ఏకైక మార్గమని తెలుగుప్రభ ప్రత్యేక ప్రతినిధి స్కైబాబతో జరిపిన ప్రత్యేక సంభాషణలో హరగోపాల్ స్పష్టం చేశారు.
పెట్టుబడులు తేవడమే సక్సెస్ అనుకుంటున్నారు
ప్రస్తుత రాజకీయ పరిణామాలు కేవలం తెలంగాణకే పరిమితమైనవి కావు. దేశవ్యాప్తంగా అధికార, ప్రతిపక్షాల మధ్య సంబంధాలు క్షీణిస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం కూడా అంతర్భాగమే. పాలకపక్ష విధానాల్లోని పరిమితులను, లోపాలను ఎత్తిచూపుతూ, ఫలానా విధానాల వల్ల ప్రజలకు ఈ విధమైన నష్టం వాటిల్లుతుందని హెచ్చరించాల్సిన బాధ్యత ప్రతిపక్షానిది. పాలకపక్షం కూడా ఆ విమర్శలను వినడానికి, తమ విధానాలను పునఃసమీక్షించుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అయితే, దేశవ్యాప్తంగా నయా ఉదారవాద ఆర్థిక విధానం.. నా దృష్టిలో దుష్ట ఆర్థిక విధానం ప్రవేశించిన తర్వాత వామపక్షాలతో సహా దాదాపు అన్ని పార్టీల్లోనూ ప్రాథమిక మార్పు వచ్చింది. సంపదను పెంచడం, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడమే అభివృద్ధికి కొలమానమని, ఎంత ఎక్కువ పెట్టుబడులు తెస్తే అంత విజయవంతమైన పాలన అందించినట్లని అన్ని పార్టీలు భ్రమపడుతున్నాయి.
భిన్నమైన అభివృద్ధి నమూనా ఎవరి వద్దా లేదు
ఒకప్పుడు సిద్ధాంతపరంగా భిన్న దృక్పథాలు ఉండేవి. పెట్టుబడిదారీ వ్యవస్థలోని లోపాలను, దీర్ఘకాలిక పర్యవసానాలను ఆనాడే విశ్వవిద్యాలయాల్లో మేధావులుగా మేము విశ్లేషించాం. ఇప్పుడు జరుగుతున్నదంతా ఆనాడు ఊహించిందే. అయితే కాలక్రమంలో ప్రత్యామ్నాయం లేదనే భావనను బలంగా రుద్దారు. అంతర్జాతీయ పెట్టుబడులు, మార్కెట్ శక్తులను ఆశ్రయించడం మినహా మరో మార్గం లేదనే నిర్ణయానికి వచ్చినప్పుడు పార్టీల మధ్య సిద్ధాంతపరమైన తేడాలు కనుమరుగవుతాయి. ఇవాళ తెలంగాణలోని బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం అయినా లేదా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అయినా అభివృద్ధి నమూనా విషయంలో వీరికి ఉన్న మౌలిక తేడా ఏమిటి? ఎవరి వద్దయినా భిన్నమైన కార్యాచరణ ఉందా అని ఉంటే కష్టమే.
వెల్ఫేర్ మోడల్ వల్లే ఇందిరమ్మకు ఆదరణ
బీజేపీ తరహా అభివృద్ధి నమూనానే బీఆర్ఎస్ కూడా పదేళ్లపాటు అమలు చేసింది. దాని పర్యవసానంగానే ఎన్నికల్లో పరాజయం పాలైంది. ఆ తర్వాత ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించారు. మహబూబ్‌నగర్‌లో మేము ఒక సమావేశం నిర్వహించినప్పుడు ఒక పేద మహిళ వచ్చి ఇందిరమ్మ రాజ్యం కావాలి అని అన్నది. ఇందిరమ్మ రాజ్యం అంటే ఏమిటి? బలమైన సంక్షేమం. దళితులు, గిరిజనుల అభ్యున్నతి, భూసంస్కరణలు, బ్యాంకుల జాతీయీకరణ, వ్యాపార నియంత్రణల వంటి విధానాలను నాడు ఇందిరాగాంధీ ముందుకు తెచ్చారు. నెహ్రూ మోడల్‌తో పోలిస్తే కొన్ని మార్పులు ఉన్నప్పటికీ, ఆమె వెల్ఫేర్ మోడల్‌కు ప్రాధాన్యమిచ్చారు కాబట్టే ప్రజల్లో ఆమెపై ఇప్పటికీ ఆదరణ ఉంది.
భావజాల వైరుధ్యంతో పాటే ఆరోగ్యకరమైన చర్చ జరిగేది
ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో కేవలం ఇందిరమ్మ పేరును మాత్రమే వాడుకుంటోంది తప్ప, ఆనాటి సిద్ధాంతాలను అమలు చేయడం లేదు. నాడు నెహ్రూ ప్రవేశపెట్టిన మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో ప్రైవేట్ రంగానికి చోటున్నప్పటికీ ప్రభుత్వ రంగమే కీలక పాత్ర పోషించింది. ఆ విధానాలను విమర్శించే రామ్మనోహర్ లోహియా, స్వతంత్ర పార్టీ, జన్ సంఘ్ వంటి భిన్న భావజాలాలు ఉండేవి. సంపూర్ణ సోషలిజం లేదా ప్రజా సంక్షేమ రాజ్యమే అంతిమ లక్ష్యమనే ప్రజా సోషలిస్టు పార్టీలు, బలమైన కమ్యూనిస్టు పార్టీలు ఉండటం వల్ల ఆరోగ్యకరమైన చర్చ జరిగేది. ముఖ్యంగా ఉమ్మడి హైదరాబాద్ రాష్ట్రంలో బలమైన పట్టు సాధించిన కమ్యూనిస్టులు భూసంస్కరణలు, ప్రభుత్వ రంగం, కార్మిక హక్కుల కోసం పోరాడారు. ఆనాడు పార్టీల మధ్య స్పష్టమైన భావజాల వైరుధ్యాలు ఉండేవి. కానీ నేడు ఏ పార్టీల మధ్యనైనా అలాంటి తాత్విక భేదాలు ఉన్నాయా? ఆశించడమే కష్టం.
ఎండగట్టడమే తప్ప ప్రత్యామ్నాయమేంటో చెప్పరు
గతంలో మేము రాహుల్ గాంధీని కలిసినప్పుడు, ‘మీరు అనుసరించిన ఆర్థిక నమూనా వల్లనే ఎన్నికల్లో ఓడిపోయారు’ అని చెప్పాను. దానికి ఆయన ‘బీజేపీ కూడా అదే మోడల్‌ను అనుసరిస్తూ రెండోసారి గెలిచింది కదా’ అన్నారు. ‘మరి ఆ మోడల్‌ను పునఃసమీక్షించుకోవాల్సిన బాధ్యత మీపై లేదా? గతంలో ప్రైవేటీకరించిన ప్రభుత్వ రంగ సంస్థలను మీరు అధికారంలోకి వస్తే తిరిగి జాతీయీకరిస్తారా?’ అని అడిగినప్పుడు ఆయన స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్లి బీజేపీ చేసే తప్పులను ఎండగడుతోంది కానీ, తాము అధికారంలోకి వస్తే అమలుచేసే ప్రత్యామ్నాయ ఆర్థిక నమూనా ఏమిటో స్పష్టంగా చెప్పలేకపోతోంది.
అధికార మార్పిడే తప్ప సమాజ నిర్మాణమనే భావన కరువు
తెలంగాణ విషయానికి వస్తే, పార్టీల మధ్య విధానపరమైన తేడాలు లేనప్పుడు ఆర్థిక విధానం ఒక్కటే అవుతుంది. ‘వాళ్లకు కాకుండా మాకు ఓటు వేయండి’ అని అడగడం కేవలం అధికార మార్పిడి కోసమే తప్ప ప్రజా ప్రయోజనాల కోసం కాదు. ప్రస్తుతం రాజకీయాలు కేవలం అధికార కేంద్రీకృతమయ్యాయి. అధికారం ఎవరికి దక్కాలి? బీఆర్ఎస్ పదేళ్లు ఉంటే, కాంగ్రెస్ మరో పదేళ్లు ఉండాలని కోరుకుంటోంది. రాజకీయాల అసలు లక్ష్యం ఏమిటి, ఎలాంటి సమాజాన్ని నిర్మించాలి అనే ప్రాథమిక ప్రశ్నలు ప్రస్తుత రాజకీయాల నుంచి కనుమరుగయ్యాయి.
రెండు పార్టీల మధ్య భావజాలపరమైన విభేదాలు ఉన్నప్పుడు విధానాలపై విస్తృత, నిర్మాణాత్మక చర్చ జరుగుతుంది. ప్రజలు సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు. కానీ కేవలం ‘మాకు అధికారమా? మీకు అధికారమా?’ అనే ఆధిపత్య పోరుగా మారినప్పుడు సంభాషణల్లో గాంభీర్యం లోపిస్తుంది. ఫలితంగా రాజకీయ భాష, ప్రమాణాలు పూర్తిగా దిగజారిపోయాయి. ప్రత్యామ్నాయ విధానాలు లేనందువల్ల ఒకరిపై ఒకరు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ సభ్యులను సభ నుంచి బహిష్కరించింది. ఇప్పుడు వీరు వారిని బయటకు పంపించారు. అటు పార్లమెంట్‌లోనూ ప్రతిపక్షాలను సస్పెండ్ చేసి చట్టాలు ఆమోదించుకున్నారు. అధికారం తమ చేతిలో ఉందనే అహంకారమే దీనికి ప్రధాన కారణం.
దేశ సంపద పెరిగినా జీవితాల్లో మార్పు రాలేదు
నా దృష్టిలో రాజకీయాల పరమార్థం ఒక ఆదర్శ సమాజ నిర్మాణం దిశగా సాగాలి. ప్రజాధికారం సమాజ సంక్షేమానికి సాధనం కావాలి. కేంద్రంలోనైనా, రాష్ట్రంలోనైనా సంపద సృష్టించాలనే మాటే వినిపిస్తోంది. స్వాతంత్ర్యం వచ్చిన నాటితో పోలిస్తే దేశంలో సంపద విపరీతంగా పెరిగినప్పటికీ సామాన్యుల జీవితాల్లో ఆశించిన మార్పు రాలేదు. ఇప్పటికీ పరిశ్రమల కోసం విదేశాలకు వెళ్లి పన్ను రాయితీలు, ఉచిత భూములు ఇస్తామని ప్రాధేయపడుతున్నారు తప్ప, స్థానిక యువతకు నిర్దిష్టంగా ఎన్ని ఉద్యోగాలు ఇస్తారని ప్రశ్నించడం లేదు. ‘స్థానికులకు ఉద్యోగాల్లో వాటా ఇవ్వాలి’ అని గట్టిగా అడిగితే ఆ పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోతాయని పాలకులు భయపడుతున్నారు. దీనివల్ల పరిశ్రమలు వస్తున్నా ఉద్యోగావకాశాలు పెరగడం లేదు.
దూషణలకే పరిమితమైన అసెంబ్లీ
తెలంగాణలో సరైన ఉపాధి లేక దాదాపు 30 లక్షల మంది యువత అల్లాడుతున్నారు. కేవలం వెయ్యి ఉద్యోగాలకు ఐదు లక్షల మంది పోటీ పడుతున్నారంటే మిగిలిన నిరుద్యోగుల భవిష్యత్తు ఏమిటి? ఈ సంక్షోభాన్ని చూసి పాలకులకు కంటిమీద కునుకు ఉండకూడదు. కానీ వారికి సమగ్ర ఉపాధి విధానం (ఎంప్లాయ్మెంట్ పాలసీ) లేదు. మేము కొన్ని ఉద్యోగాలు ఇచ్చామని చేతులు దులుపుకుంటున్నారు తప్ప అందరికీ ఉపాధి కల్పించే శాశ్వత ప్రణాళిక లేదు. వ్యవసాయ రంగంపై ఆధారపడిన 40-50 శాతం జనాభా కోసం అగ్రికల్చర్ పాలిటెక్నిక్‌లు పెంచి, ఆధునిక శాస్త్ర విజ్ఞానాన్ని వారికి చేరువ చేసి ఉంటే బాగుండేది. ఆ పనీ జరగలేదు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన అసెంబ్లీ వేదికలను కేవలం పరస్పర దూషణలకు వాడుకుంటున్నారు.
నాడు గుర్తులు శ్రమజీవన ప్రతీకలు
స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో రాజకీయ నాయకుల్లో అత్యధికులు వ్యవసాయ నేపథ్యం నుంచి వచ్చినవారు. ఆనాడు పార్టీల ఎన్నికల చిహ్నాలు సైతం జోడెడ్లు, ఆవు, గుడిసె, కొడవలి, సుత్తి వంటి శ్రమజీవుల ప్రతీకలుగా ఉండేవి. ఎన్టీఆర్ కాలంలో ‘సైకిల్’ గుర్తుతో అధికారం రైతాంగం నుంచి దిగువ మధ్యతరగతికి మారింది. నేడు ‘కారు’ వంటి చిహ్నాలతో అధికారం ఉన్నత మధ్యతరగతి చేతుల్లోకి వెళ్లిపోయింది. పల్లెల్లోని సామాన్యుడితో ఈ సంస్కృతికి సంబంధమే లేదు. ఆనాటి గ్రామీణ నాయకుల్లో నిజాయితీ ఉండేది. ఒకప్పుడు టాటా, బిర్లా వంటి పారిశ్రామికవేత్తలకు సమాజం పట్ల ఒక నిర్దిష్టమైన బాధ్యత ఉండేది. టాటాను మనం సిద్ధాంతపరంగా విమర్శించినప్పటికీ, వారు లాభాల్లో 40-50 శాతం వెచ్చించి టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, కార్మికుల కోసం జంషెడ్పూర్ లాంటి సమగ్ర నగరాలను నిర్మించారు.
ప్రజలకు తిరిగివ్వాలనే దృక్పథమే కరువైంది
నాటి పారిశ్రామికవేత్తలకు ఉత్పత్తి, కార్మిక సంక్షేమం, భవిష్యత్ నిర్మాణంతో ముడిపడిన ఒక స్పష్టమైన దృక్పథం ఉండేది. కానీ నేడు సమాజం నుంచి సంపదను పిండుకోవడమే తప్ప ప్రజలకు తిరిగివ్వాలనే ఆలోచన ఉన్న పారిశ్రామికవేత్తలు అరుదైపోయారు. ఉత్పత్తితో సంబంధం లేకుండా భూదందాలు, పైరవీలు, కమీషన్లతో నెట్టుకొచ్చే ‘కాంట్రాక్టర్ వర్గం’ రాజకీయాలను ఆక్రమించింది. విలువలు లేని, డబ్బే సర్వస్వంగా భావించే ఈ కాంట్రాక్టర్ తరగతి నుంచే నేడు నాయకులు వస్తున్నారు. వారి చర్యల్లో కానీ, భాషలో కానీ దేశ భవిష్యత్తు గురించిన తాత్విక చింతన, దూరదృష్టి ఎంతమాత్రమూ కనిపించవు.
తక్షణ లాభాలే తప్ప అర్థవంతమైన చర్చ లేదు
ప్రస్తుతం సమాజం తీవ్ర అసమానతలు, నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం, నాసిరకమైన విద్య, అందని వైద్యం వంటి పెను సమస్యలను ఎదుర్కొంటోంది. కానీ వీటిపై అర్థవంతమైన చర్చ ఎక్కడా జరగడం లేదు. ఉన్నత విద్యారంగాన్ని సైతం లాభాపేక్ష కలిగిన ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టారు. నాడు టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ వంటి సంస్థలను దేశ అవసరాల కోసం దార్శనికతతో ఏర్పాటు చేశారు. అలాగే రాజీవ్ గాంధీ, నెహ్రూల ప్రోత్సాహంతో సీసీఎంబి వంటి పరిశోధనా సంస్థలు ఎదిగాయి. కానీ నేటి ఫార్మా లేదా ఇతర ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు దీర్ఘకాలిక మౌలిక పరిశోధనలతో (ఫండమెంటల్ రీసెర్చ్) సంబంధం లేదు. వారికి తక్షణ లాభాలనిచ్చే అప్లైడ్ రీసెర్చ్ మాత్రమే కావాలి. పీఎం భార్గవ ఆత్మకథ చదివితే దేశంలో శాస్త్రీయ దృక్పథం ఎలా పతనమైందో అర్థమవుతుంది.
అన్ని రంగాల్లో విలువల పతనమవుతున్నాయ్
తెలంగాణలోని ప్రస్తుత పరిణామాల పునాదులను పరిశీలిస్తే, పాలకుల్లో ప్రజా సంక్షేమం గురించిన ఆలోచన గానీ, చరిత్రలో తాము గుర్తుండిపోవాలనే ఆకాంక్ష గానీ లేవు. ఎంత సంపాదించాం, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత పెంచుకున్నాం అనేదే వారి ప్రాధాన్యం. విశ్వవిద్యాలయాలు నిర్వీర్యమయ్యాయి. ప్రొఫెసర్లు జీతాలు, డీఏలకే పరిమితమవుతున్నారు. దేశ భవిష్యత్తు గురించి ఆలోచించే వారిని, పాలకులను ప్రశ్నించే మేధావులను ‘జాతి వ్యతిరేకులు’గా ముద్రిస్తున్నారు. విద్యావేత్తలు, వైస్ ఛాన్సలర్లు, కవులు, కళాకారులను గౌరవించే సంస్కృతి నశించింది. సాహిత్యం, కళలు, సంస్కృతి, విద్య, రాజకీయం.. ఇలా అన్ని రంగాల్లోనూ విలువల పతనం స్పష్టంగా కనిపిస్తోంది.
ప్రశ్నించే జెన్ జీతో చిగురిస్తున్న ఆశలు
ప్రస్తుత విద్యా వ్యవస్థను సంస్కరించి అందరికీ నాణ్యమైన, సమాన విద్యను అందించినప్పుడే ఉత్తమ శాస్త్రవేత్తలు, సమర్థులైన అధికారులు, బాధ్యతాయుతమైన రాజకీయ నాయకులు తయారవుతారు. కానీ ప్రశ్నించే యువత వస్తే తమ అధికారం ప్రమాదంలో పడుతుందనే భయంతో ప్రభుత్వాలు విశ్వవిద్యాలయాలను క్రమంగా నాశనం చేశాయి. పాలకులకు జ్ఞానం, ప్రశ్నించే తత్వం సంపదగా కనిపించడం లేదు. ఇటీవల స్పీకర్‌పై ప్రయోగించిన అనుచిత భాష, కుల ప్రస్తావనలు ఈ రాజకీయ పతనానికి నిదర్శనం. రాజ్యాంగంలోని 17వ అధికరణ ప్రకారం.. అస్పృశ్యతను రూపుమాపాల్సిన బాధ్యత ఉన్న సమాజంలో, స్వాతంత్ర్యం వచ్చిన దశాబ్దాల తర్వాత కూడా స్పీకర్‌ను లేదా జాతీయ పార్టీ అధ్యక్షుడిని ఇలాంటి అంశాలతో అవమానించే సంస్కృతి ఉండటం బాధాకరం. అయితే.. విద్యార్థులు, యువత తిరుగుబాటు చేయడం ద్వారా సమాజంలో ఆశ చిగురిస్తోంది. ‘జెన్-జీ’ ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణలో పాఠశాలల బంద్ ద్వారా విద్యా పరిరక్షణ కోసం బలమైన ప్రతిఘటన వ్యక్తమైంది. తెలంగాణలో ప్రజాస్వామిక శక్తులు ఇంకా సజీవంగానే ఉన్నాయి. ప్రజలు ప్రశ్నిస్తున్నారు, పత్రికలు కూడా కొంతమేర స్వేచ్ఛగా రాయగలుగుతున్నాయి. కానీ ఢిల్లీలో తీవ్రమైన నిర్బంధ వాతావరణం ఉంది. అయినప్పటికీ జంతర్ మంతర్ పోరాటాలు ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకోవచ్చనే విశ్వాసాన్ని నింపాయి.
ప్రమాద కోణమే తప్ప ప్రత్యామ్నాయాలపై ఆలోచనే కరువు
ఈ విధానాలకు కాలం చెల్లిందనే వాస్తవం నుంచే భవిష్యత్తుపై కొత్త ఆశలు పుడతాయి. అమెరికా కేంద్రంగా నడిచే ఈ ఆర్థిక నమూనా అక్కడ కూడా సంక్షోభంలో పడింది. ఆర్థికంగా నిస్సహాయ స్థితికి చేరిన అమెరికా, ప్రపంచ దేశాలపై యుద్ధాలు రుద్దుతూ తన సంక్షోభాన్ని ప్రపంచంపై నెట్టే ప్రయత్నం చేస్తోంది. కాబట్టి మనం అనుసరిస్తున్న అభివృద్ధి నమూనాలోనే లోపాలున్నాయి. ప్రస్తుతం ప్రజలు ఆలోచనా పరిధిని కుదించుకుని ‘ఎవరు వస్తే ఎక్కువ మాట్లాడనిస్తారు? ఎవరు వస్తే తక్కువ ప్రమాదం?’ అనే కోణంలో మాత్రమే చూస్తున్నారు. ఇంతకుమించి వ్యవస్థాగతమైన ప్రత్యామ్నాయాల గురించి లోతుగా ఆలోచించలేకపోవడమే నేటి అసలైన విషాదం.
మేధావుల మౌనం.. ప్రత్యామ్నాయం లేని రాజకీయాలు
గత ఎన్నికల్లో కోదండరాంతో సహా పలువురు మేధావులు కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చారు. ప్రస్తుతం ప్రభుత్వ విధానాల్లో లోపాలున్నా వారు మాట్లాడటం లేదని ప్రజల్లో అసహనం ఉన్న మాట నిజమే. అయితే కాంగ్రెస్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తే ప్రజల ముందున్న ప్రత్యామ్నాయం ఏమిటి? పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ లేదా మతతత్వ రాజకీయాలు చేసే బీజేపీ తప్ప మరో మార్గం లేదు. కాంగ్రెస్ విఫలమైతే మళ్లీ బీఆర్ఎస్సే వస్తుంది. అది కూడా బీజేపీతో పొత్తు పెట్టుకుని వస్తే రాష్ట్రంలో బీజేపీదే ఆధిపత్యం అవుతుంది. ప్రస్తుత రాజకీయ పరిణామాలను చూస్తే బీఆర్ఎస్ ఒంటరిగా గెలిచే పరిస్థితి లేదు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నంత కాలం వారి సహకారం లేకుండా బీఆర్ఎస్ స్వతంత్రంగా నిలబడటం అసాధ్యం. మనుగడ కోసం వారు ఢిల్లీ పాలకులతో రాజీపడక తప్పదు.
పసుపు నీళ్లు చల్లడం దళిత వ్యతిరేకత కాదు
కేసీఆర్‌కు యాగాలు, పూజలు, జ్యోతిష్యంపై అపారమైన నమ్మకం ఉంది. ఆయన హయాంలో ఎన్నో యాగాలు చేసి టన్నుల కొద్దీ నెయ్యి, విలువైన పట్టుచీరలను అగ్నిపాలు చేశారు. ఆ సంపదను పేదలకు, బడుల్లో పిల్లల పౌష్టికాహారానికి ఇవ్వాల్సింది. ఫామ్‌హౌస్‌లో పసుపు నీళ్లు చల్లడం వారి ఆచారాల్లో భాగమే తప్ప దళితులకు వ్యతిరేకంగా చేసిన చర్య కాదు. కాంగ్రెస్ నాయకులు వచ్చి వెళ్లినందుకు పరిసరాలను శుద్ధి చేసే ఉద్దేశంతోనే అలా చేశారు. అయితే, ఆధునిక సమాజంలోకి ఇది తప్పుడు సంకేతాలను పంపుతుంది.
మేధావుల మాట వినే ఓపిక పాలకులకు లేదు
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో సీఎం రేవంత్‌రెడ్డి మేధావులను పిలిచి మాట్లాడారు. ఈ చర్చలను ఒక వ్యవస్థలా క్రమం తప్పకుండా నిర్వహించాలని యోగేంద్ర యాదవ్ సూచించినా, విమర్శలు భరించలేక ఆ ప్రక్రియను ఆపేశారు. నాడు ఇందిరాగాంధీ ప్రభుత్వ విద్యా విధానాన్ని విమర్శించిన రొమిలా థాపర్‌ను స్వయంగా పిలిపించి, అరగంటపాటు మాట్లాడి అభ్యంతరాలను పరిశీలించమన్నారు. నేడు ప్రశ్నిస్తే జైల్లో పెట్టే ధోరణి తప్ప, పిలిచి మాట్లాడే ప్రజాస్వామిక సంస్కృతి ఎక్కడా కనిపించడం లేదు.
అప్పుల భారం.. ఆగిన అభివృద్ధి
గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు ఏడెనిమిది లక్షల కోట్ల అప్పులు తెచ్చి సంక్షేమ పథకాల పేరిట పంచిపెట్టింది తప్ప సంపద సృష్టించలేదు. నేడు ఆ అప్పులకు వడ్డీలు కట్టడానికే కాంగ్రెస్ ఖజానా ఖాళీ అవుతోంది. కొత్తగా నిధులు లేక రోడ్లు, ఇతర పనులు ఆగిపోయాయి. భూ సమస్యల విషయంలోనూ బీఆర్ఎస్ చేసిన తప్పులనే కాంగ్రెస్ చేస్తోంది. పుస్తకాలు పెట్టుకోవడానికి ఒక చిన్న గది నిర్మాణ అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంటే నాకే ఆరు నెలలైనా అనుమతి రాలేదు. కలెక్టర్ నా శిష్యురాలైనా పని జరగలేదంటే సామాన్యుల పరిస్థితి ఏమిటి? నాడు ఎస్.ఆర్. శంకరన్ లాంటి అధికారులు ప్రభుత్వ తప్పిదాలను ముఖం మీదే చెప్పేవారు, ముఖ్యమంత్రులు కూడా వారి నిజాయితీని గౌరవించేవారు. నేడు పాలకులకు నిజాలు చెప్పే ధైర్యం అధికారుల్లో లేదు.
జాతీయ పార్టీ భ్రమల్లో మునిగిన బీఆర్ఎస్
అధికారంలో ఉన్నప్పుడు విరాళాల రూపంలో వేల కోట్ల రూపాయలు పోగయ్యేసరికి బీఆర్ఎస్కు జాతీయ పార్టీ భ్రమలు మొదలయ్యాయి. తెలంగాణ ఉద్యమ అస్తిత్వాన్ని వదులుకుని ‘భారత రాష్ట్ర సమితి’గా పేరు మార్చి మహారాష్ట్ర, కర్ణాటకల్లో సభలు పెట్టి ప్రజాధనాన్ని వృథా చేశారు. ఢిల్లీలో 20 మంది ఎంపీలతో చక్రం తిప్పుతామని కలలు కన్నారు. కానీ ఒక్క ఎంపీ స్థానమూ గెలవకపోవడంతో ఆ భ్రమలు పేకమేడల్లా కూలిపోయాయి.
కోదండరాం మౌనానికి కారణమిదే
కాంగ్రెస్‌తో పొత్తు వల్ల ప్రభుత్వ తప్పుల భారం తనపై పడుతోందన్న భావన కోదండరాంలో ఉండొచ్చు. ప్రభుత్వాన్ని నిలదీస్తే దూరం పెరుగుతుంది. అలాగని బయటకు వస్తే ఆయన్ను గెలిపించే రాజకీయ చైతన్యం సమాజంలో కనిపించడం లేదు. ఉద్యమ సమయంలో అపార ప్రజాదరణ పొందిన కోదండరాం ఎమ్మెల్సీగా పోటీ చేస్తేనే పట్టభద్రులు గెలిపించలేదు. డబ్బు, ప్రలోభాల రాజకీయాల ముందు ఉద్యమ నేపథ్యం, నిజాయితీ ఓడిపోతుండటమే నేటి అసలైన విషాదం.

