- గల్లీ క్రికెట్ నుంచి ప్రపంచ మేటి పేసర్‌గా..
- పుస్తక రూపంలో జస్‌ప్రీత్ క్రికెట్ జీవిత ప్రయాణం
- వచ్చే నెల విడుదల చేయనున్న పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా ‘ప్లే’
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15(తెలుగుప్రభ): భారత స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా అసాధారణ క్రికెట్ ప్రయాణం పుస్తక రూపంలోకి రానుంది. ‘ది బూమ్ ఎఫెక్ట్’ పేరుతో రూపొందిన ఈ పుస్తకం అక్టోబర్‌లో పాఠకుల ముందుకు రానుంది. క్రీడా జర్నలిస్టులు ఆయుష్ పుత్రన్, నికోలస్ బ్రూక్స్ రచించిన ఈ పుస్తకాన్ని పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా ‘ప్లే’ ఇంప్రింట్‌పై ప్రచురిస్తోంది. అహ్మదాబాద్‌లో సంప్రదాయేతర క్రికెటర్‌గా మొదలైన బుమ్రా ప్రస్థానం.. ప్రపంచ క్రికెట్‌లో అత్యంత ప్రమాదకర ఫాస్ట్‌బౌలర్లలో ఒకరిగా ఎదిగే వరకు సాగిన ప్రయాణాన్ని ఇందులో వివరించారు. ఎలాంటి ప్రముఖ క్రికెట్ అకాడమీ, అండర్-19 వ్యవస్థ ద్వారా కాకుండా.. టీవీలో ఫాస్ట్‌బౌలర్లను చూస్తూ, గల్లీ క్రికెట్‌లో ఆడుతూ బుమ్రా తన బౌలింగ్ మెరుగుపరుచుకున్న తీరును రచయితలు ప్రస్తావించారు.
లోపాలే.. బలాలుగా!
చిన్న రన్‌అప్, విభిన్నమైన బౌలింగ్ యాక్షన్ కారణంగా తొలినాళ్లలో ఎదురైన సందేహాలు చివరకు అతడి విజయానికి బలంగా మారాయని పుస్తకం పేర్కొంది. గుజరాత్ క్రికెట్‌లో రాణించిన బుమ్రా.. రెండేళ్లలోనే ముంబయి ఇండియన్స్ జట్టులో ఐపీఎల్ అవకాశం దక్కించుకున్న విధానాన్ని వివరించింది. అనంతరం భారత పేస్ దళానికి నాయకుడిగా ఎదిగిన క్రమాన్ని విశ్లేషించింది.
యార్కర్ వెనుక అసలు రహస్యం
బుమ్రా బౌలింగ్‌లోని స్వింగ్, సీమ్, బౌన్స్, యార్కర్ ప్రత్యేకతలను పుస్తకం లోతుగా పరిశీలించింది. స్పీడ్ గన్ చూపించే వేగం కంటే బుమ్రా ఎందుకు వేగంగా అనిపిస్తాడు? అతడి బౌలింగ్‌ను బ్యాటర్లు ఎందుకు అంచనా వేయలేరు? ఒత్తిడిలోనూ అంతటి నియంత్రణ ఎలా సాధిస్తాడు? వంటి అంశాలకు సమాధానాలు వెతికింది. గాయాలు, బౌలింగ్ యాక్షన్‌పై వచ్చిన సందేహాలు, టెస్టు క్రికెట్‌లో రాణించగలడా అన్న ప్రశ్నలు, భారత పేస్ దళాన్ని నడిపించే శారీరక ఒత్తిడి వంటి సవాళ్లను కూడా ఇందులో ప్రస్తావించారు. మ్యాచ్‌ల వారీ జీవిత చరిత్రకు భిన్నంగా.. బుమ్రా విజయానికి దోహదపడిన ప్రతిభ, ప్రత్యేకత, పట్టుదల, మానసిక దృఢత్వాన్ని పుస్తకం ఆవిష్కరిస్తుందని రచయితలు తెలిపారు.

