Telangana activists: తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ తొలి సమావేశం.. కమిటీ చైర్మన్ కె. కేశవరావు అధ్యక్షతన ఆదివారం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు జీఓ నంబర్ 679 ద్వారా ప్రభుత్వం ఈ ప్రత్యేక కమిటీని అధికారికంగా ఏర్పాటు చేసిన తర్వాత జరిగిన మొదటి సమావేశం ఇది కావడం విశేషం. సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ప్రధానంగా హైదరాబాద్‌లోని అమరవీరుల జ్యోతి ప్రాంగణంలో ఈ కమిటీ అధికారిక కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ఛైర్మన్ నిర్ణయించారు. అమరవీరుల గుర్తింపు, వారి వివరాల సేకరణపై రాజకీయ పక్షాల నుంచి ప్రతిపాదనలు, సూచనలు స్వీకరించడానికి త్వరలోనే ఒక ఆల్ పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. తద్వారా తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ(JAC), 1969 నాటి ఉద్యమకారులు, ఉద్యోగ సంఘాలు, కళాకారుల జేఏసీ, సబ్బండ వర్గాల జేఏసీ, కుల సంఘాలు, న్యాయవాదుల జేఏసీల నుంచి ఉద్యమకారుల వివరాలు, ప్రతిపాదనలను సేకరించనున్నారు.
ఈ మేరకు క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రజాభిప్రాయ సేకరణ జరిపేందుకు, ఉద్యమకారుల వివరాలను సేకరించేందుకు కమిటీ సభ్యులు రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల్లో పర్యటించాలని సమావేశంలో నిర్ణయించారు. ఎటువంటి రాజకీయ ప్రమేయం లేకుండా, పారదర్శకంగా అర్హులైన ఉద్యమకారులను గుర్తించడమే కమిటీ ప్రధాన లక్ష్యమని ఛైర్మన్ కె. కేశవరావు స్పష్టం చేశారు.

ప్రధానంగా.. ఉద్యమకారులను సరైన ప్రమాణాల ఆధారంగా గుర్తించేందుకు కమిటీ నాలుగు ప్రధాన విభాగాలను ప్రతిపాదించింది.
- అమరవీరులు (తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసినవారు).
- గాయపడిన ఉద్యమకారులు (ఉద్యమ సమయంలో శారీరక వైకల్యం లేదా గాయాలపాలైనవారు).
- కేసులు, జైలు శిక్ష అనుభవించినవారు (ఉద్యమాల్లో పాల్గొని పోలీసు కేసులు, అరెస్టులు ఎదుర్కొన్నవారు).
- క్షేత్రస్థాయి భాగస్వాములు (గ్రాస్ రూట్ స్థాయిలో ఉద్యమాన్ని నడిపిన సాధారణ ప్రజలు, కార్యకర్తలు).
Also Read: https://teluguprabha.net/sports-news/royal-challengers-bangalore-beat-punjab-kings-by-23-runs/
ఈ ప్రమాణాల ఆధారంగా ఉద్యమకారులను గుర్తించనున్నట్లు కమిటీ పేర్కొంది. ఈ కమిటీ రూపొందించే గైడ్‌లైన్స్, జాబితా ఆధారంగా ఉద్యమకారులకు ప్రభుత్వం అధికారిక గుర్తింపు, గౌరవ వేతనాలు లేదా ఇతర సంక్షేమ సౌకర్యాలను కల్పించనుంది. కాగా, తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కోసం ప్రత్యేకంగా ఒక అధికారిక కమిటీని ఏర్పాటు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీలు ఎం. కోదండరామ్, అద్దంకి దయాకర్, మాజీ ఎమ్మెల్సీ ఎస్. రాములు నాయక్, రాజకీయ నేత మోతె శోభన్ రెడ్డి పాల్గొన్నారు.

