HomeతెలంగాణKrishna Basin: కృష్ణా జలాలపై సమగ్ర లెక్క

Krishna Basin: కృష్ణా జలాలపై సమగ్ర లెక్క

  • మిగులు నీటిని ఒడిసిపట్టేలా సర్కారు కసరత్తు
  • ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు.. వినియోగంపై సమగ్ర నివేదిక
  • ఎక్కువ వాటా సాధించేలా వ్యూహం.. డిండి నీటికి ఏదుల రిజర్వాయర్‌
  • మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణపైనా ఆరా

హైదరాబాద్‌, అక్టోబర్‌ 6 (తెలుగుప్రభ): రాష్ట్ర సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు కృష్ణా జలాలను గరిష్ఠంగా వినియోగించుకునే దిశగా ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. కృష్ణా బేసిన్‌ పరిధిలో తెలంగాణకు అందుబాటులో ఉన్న నీరు ఎంత? వివిధ ప్రాజెక్టులకు ఎన్ని నీళ్లు కేటాయించారు? ఇప్పటివరకు ఎంత వినియోగించారు? ఇంకా ఎంత నీటిని వినియోగించుకునే అవకాశం ఉంది? భవిష్యత్తులో అదనంగా ఎక్కడ నీటిని ఉపయోగించుకోవచ్చు? అనే అంశాలపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించింది. కృష్ణా జలాల్లో రాష్ట్రానికి లభించే వాటాను సమర్థంగా వినియోగించుకోవడంతో పాటు, ఎక్కువ వాటా సాధించేందుకు అవసరమైన చర్యలపైనా దృష్టి పెట్టాలని సూచించింది. బేసిన్‌ పరిధిలోని ప్రాజెక్టులన్నింటినీ సమగ్రంగా పరిశీలించి.. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు, ఆయకట్టు, వినియోగం, మిగులు జలాలు, నిర్మాణ సామర్థ్యం, ఎత్తిపోతల సామర్థ్యం తదితర వివరాలను సేకరించనున్నారు. కేటాయింపులు ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోతున్న నీటిని గుర్తించనున్నారు.

- Advertisement -

మిగులు జలాల వినియోగమే కీలకం
బేసిన్‌లో మిగిలే నీటిని భవిష్యత్తులో సాగు, తాగునీటి అవసరాలకు ఎలా వినియోగించుకోవచ్చన్నదానిపై అధ్యయనం చేయనున్నారు. ఇప్పటికే ఉన్న ప్రాజెక్టుల సామర్థ్యాన్ని పెంచడం, కొత్త ఎత్తిపోతల పథకాలకు అవకాశాలను గుర్తించడం వంటి అంశాలపై క్షేత్రస్థాయి నివేదికలు తీసుకోనున్నారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన ఏదుల రిజర్వాయర్‌ నుంచి డిండి ఎత్తిపోతల పథకానికి నీటిని తరలించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఏదుల నుంచి డిండి వరకు నీటి తరలింపునకు అవసరమైన కాలువలు, పంపింగ్‌ వ్యవస్థ, నీటి లభ్యత, సాంకేతిక అంశాలపై అధ్యయనం చేయనున్నారు. డిండి ఆయకట్టుకు నీరందించేందుకు ఈ మార్గాన్ని ప్రధాన ప్రత్యామ్నాయంగా పరిశీలిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని అదనపు టీఎంసీ పనులపైనా ప్రభుత్వం దృష్టి సారించింది. ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరు మీదుగా మల్లన్నసాగర్‌ వరకు చేపట్టిన పనుల్లో పూర్తయినవి, కొనసాగుతున్నవి, పెండింగ్‌లో ఉన్నవి, సాంకేతిక కారణాలతో నిలిచిపోయిన వాటి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. అదనపు టీఎంసీ ద్వారా లభించే నీటిని ఏ ప్రాంతాలకు వినియోగించవచ్చు? దాని వల్ల సాగునీటి విస్తీర్ణం ఎంత పెరుగుతుందనే అంశాలను పరిశీలించనున్నారు.

మూడు బ్యారేజీల పునరుద్ధరణపై దృష్టి
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ అంశం కూడా ప్రభుత్వ ప్రాధాన్య జాబితాలో ఉంది. గతంలో తలెత్తిన సమస్యలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారంతో పనులు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. మూడు బ్యారేజీల పునరుద్ధరణకు ఎగువ, దిగువ ప్రాంతాల్లో డయాఫ్రం వాల్‌ నిర్మాణం అవసరమయ్యే అవకాశం ఉందని అధికారులు ప్రభుత్వానికి వివరించినట్లు సమాచారం. దీనిపై తుది నిర్ణయం సాంకేతిక అధ్యయనాలు, నిపుణుల సూచనలు, డిజైన్ల పరిశీలన అనంతరం తీసుకోనున్నారు. భూగర్భ పరిస్థితులు, పునాదుల స్థితి, నీటి ఒత్తిడి, బ్యారేజీల నిర్మాణ బలాన్ని పరిగణనలోకి తీసుకుని పునరుద్ధరణ డిజైన్లు రూపొందించనున్నారు. వాటిని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) సాంకేతిక కమిటీ ముందు ఉంచి, సూచనల మేరకు మార్పులు చేసిన అనంతరం ఆమోదం పొందాలని ప్రభుత్వం భావిస్తోంది. కమిటీ ఆమోదం తర్వాతే పునరుద్ధరణ పనులు ప్రారంభించనున్నట్లు సమాచారం. కృష్ణా బేసిన్‌లో నీటి కేటాయింపులు, వినియోగం, మిగులు జలాలపై సమగ్ర లెక్కలు సిద్ధం చేసి.. భవిష్యత్తు సాగు, తాగునీటి అవసరాలకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించనున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News