రేవంత్, కేటీఆర్ సవాళ్లు-ప్రతిసవాళ్లు
మన్నె క్రిశాంక్ అరెస్ట్‌తో వేడెక్కిన రాజకీయం
న్యాయ విచారణ కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన బీజేపీ
మన్నె క్రిశాంక్ అరెస్టు
మెడికవర్ వద్ద వివాదాస్పద బ్యానర్ల కేసులో అదుపులోకి తీసుకున్న పోలీసులు
రిమాండ్‌ను తిరస్కరించిన మెజిస్ట్రేట్, బెయిల్ మంజూరు
రాజ్యాంగ అపహాస్యం ఇకనైనా ఆపు
రాహుల్ గాంధీకి కేటీఆర్ హితవు
హైదరాబాద్, అక్టోబర్ 6 (తెలుగుప్రభ) : తెలంగాణ రాజకీయాల్లో కుటుంబాల ఆస్తులు, వ్యాపార ప్రయోజనాలపై సాగుతున్న ఆరోపణల యుద్ధం ఇప్పుడు న్యాయస్థానాల గడపకు చేరింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుటుంబాల ఆస్తులపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటుండగా.. బీఆర్‌ఎస్ నేత మన్నె క్రిశాంక్ అరెస్టు వ్యవహారం రాజకీయ వేడిని మరింత పెంచింది. తాజాగా ఇరు కుటుంబాల ఆస్తులు, భూములు, వ్యాపార వ్యవహారాలపై స్వతంత్ర న్యాయ విచారణ జరపాలని బీజేపీ ఎంపీ ఎం.రఘునందన్‌రావు హైకోర్టును ఆశ్రయించడంతో వివాదం కొత్త మలుపు తిరిగింది. ఈ నేపథ్యంలో ఆస్తుల యుద్దం కాస్త.. కొత్త రాజకీయ ట్రయాంగిల్ ఫైట్‌కు దారి తీసింది. సెప్టెంబర్ 30న సిరిసిల్లలో జరిగిన సభలో కేటీఆర్ కుటుంబ ఆస్తులపై సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపణలు చేశారు. హైదరాబాద్‌లోని హోటళ్లు, సర్వీస్ అపార్ట్‌మెంట్లు, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ బంగ్లాలు, జన్వాడ, శంకర్‌పల్లి, మొయినాబాద్, ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లు, అమెరికా, సింగపూర్ పెట్టుబడులను ప్రస్తావించారు. గతంలో ఇతరుల పేర్లలో ఉన్న కొన్ని ఆస్తులు కేటీఆర్ కుటుంబానికి బదిలీ అయ్యాయని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబానికి తొమ్మిది జిల్లాల్లో 439.30 ఎకరాల భూములు ఉన్నాయన్న అంశంపైనా గతంలో అసెంబ్లీలో ప్రస్తావన జరిగింది. ఎర్రవెల్లి ఫామ్‌హౌస్ చుట్టూ ప్రభుత్వ భూములపై ఆరోపణల నేపథ్యంలో రెవెన్యూ విచారణ కూడా కొనసాగుతోంది. ఈ ఆరోపణలను కేటీఆర్ ఖండించారు. తనతోపాటు రేవంత్‌రెడ్డి కుటుంబ ఆస్తులపైనా హైకోర్టు లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సవాల్ చేశారు. తన వ్యాపార ప్రస్థానం, 2009 ఎన్నికల అఫిడవిట్‌లో ప్రకటించిన ఆస్తులను ప్రస్తావిస్తూ.. సీఎం కుటుంబ సభ్యుల వ్యాపారాలు, టెండర్లు, భూముల కేటాయింపులపై ప్రశ్నలు సంధించారు.
క్రిశాంక్ అరెస్టుతో మరింత వేడి
ఇదే సమయంలో బీఆర్‌ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబ ఆస్తులు, వ్యాపారాలపై తీవ్ర ఆరోపణలు చేశారు. గడిచిన రెండేళ్లలో రూ.50వేల కోట్లకు పైగా ఆస్తులు, వ్యాపార ప్రయోజనాలు సంపాదించారని, మెడికోవర్, మాక్స్‌బియెన్ ఫార్మా వంటి కంపెనీలతో లింకులు ఉన్నాయని ఆరోపిస్తూ ఈడీ విచారణకు డిమాండ్ చేశారు. అయితే, ఈ ఆరోపణల నేపథ్యంలో హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. సీఎం కుమార్తె నైమిషా రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదైంది. క్రిశాంక్ అరెస్టును కేటీఆర్ ఖండిస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
కోర్టు గడపకు వివాదం
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల మధ్య సాగుతున్న ఆరోపణల నేపథ్యంలో బీజేపీ ఎంపీ ఎం.రఘునందన్‌రావు ఇరు కుటుంబాల ఆస్తులు, భూములు, వ్యాపార వ్యవహారాలపై న్యాయ విచారణ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఇప్పటివరకు ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య సాగిన ‘ఆస్తుల యుద్ధం’లోకి బీజేపీ కూడా న్యాయపరమైన డిమాండ్‌తో ప్రవేశించింది. ఆరోపణలు, ప్రత్యారోపణల నుంచి ఎఫ్‌ఐఆర్‌లు, అరెస్టులు, రెవెన్యూ విచారణలు, ఈడీ దర్యాప్తు డిమాండ్లు, కోర్టు పిటిషన్ల వరకు వ్యవహారం విస్తరించింది. దీంతో తెలంగాణ రాజకీయాల్లో ఆస్తుల వివాదం ఇప్పుడు కాంగ్రెస్ – బీఆర్‌ఎస్ – బీజేపీ మధ్య కొత్త రాజకీయ ట్రయాంగిల్‌గా మారింది.
మన్నె క్రిశాంక్ అరెస్టు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేస్తూ సికింద్రాబాద్‌లోని మెడికవర్ ఆస్పత్రి వద్ద వివాదాస్పద బ్యానర్లు ఏర్పాటు చేసిన కేసులో బీఆర్‌ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్‌ను గోపాలపురం పోలీసులు మంగళవారం ఉదయం అరెస్టు చేశారు. అనంతరం ఆయనను సికింద్రాబాద్ పదో మెట్రోపాలిటన్ కోర్టు మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా.. రిమాండ్ విధించాలన్న పోలీసుల వాదనను కోర్టు తోసిపుచ్చి బెయిల్ మంజూరు చేసింది. మెడికవర్ ఆస్పత్రికి సంబంధించి రూ.13,200 కోట్ల మేర ఆర్థిక లావాదేవీలు జరిగాయని ఆరోపిస్తూ క్రిశాంక్ తన అనుచరులతో కలిసి ఆస్పత్రి వెలుపల బ్యానర్లు ఏర్పాటు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చిత్రపటాన్ని ఉపయోగించి వ్యంగ్యంగా బ్యానర్లు రూపొందించారని తెలిపారు. దీనిపై కాంగ్రెస్ నేత మెట్టు సాయి కుమార్ సోమవారం సీసీఎస్, సైబర్ క్రైమ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో క్రిశాంక్, ఎంఆర్ మీడియా తెలంగాణ ప్రతినిధులపై బీఎన్‌ఎస్‌లోని 353(2), 352 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. అరెస్టుకు ముందు క్రిశాంక్ స్పందిస్తూ.. వివాదాస్పద లావాదేవీల ద్వారా నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకున్నారంటూ ఆరోపించారు. ముఖ్యమంత్రి కుటుంబానికి చెందిన వ్యాపార ఆస్తులు, ఆర్థిక లావాదేవీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇదే వ్యవహారంలో గతంలో బీఆర్‌ఎస్ నేతలు సాయికిరణ్, వినీత్‌లను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు.
ఆరోపణలు నిరాధారం: కాంగ్రెస్
మరోవైపు బీఆర్‌ఎస్ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని ప్రభుత్వం, కాంగ్రెస్ నేతలు కొట్టిపారేశారు. ముఖ్యమంత్రి కుటుంబానికి మెడికవర్ ఆస్పత్రితో ఎలాంటి వ్యాపార సంబంధాలు లేవని ప్రభుత్వం స్పష్టం చేసింది. క్రిశాంక్ అరెస్టు, అనంతరం బెయిల్ పరిణామాలతో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ మధ్య రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు మరింత ముదిరాయి.
రాజ్యాంగ అపహాస్యం ఇకనైనా ఆపు: కేటీఆర్
బీఆర్‌ఎస్ నేత మన్నె క్రిశాంక్ అరెస్టును బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. అనుముల కుటుంబ అవినీతిపై ఆధారాలతో ప్రశ్నించినందుకే క్రిశాంక్‌ను అక్రమంగా అరెస్టు చేయించారని మంగళవారం ఎక్స్ వేదికగా ఆరోపించారు. ఢిల్లీలో రాజ్యాంగం గురించి మాట్లాడుతున్న రాహుల్.. తెలంగాణలో సీఎం రేవంత్‌రెడ్డి అనే తొత్తు ద్వారా అప్రజాస్వామిక పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. దేశానికి ప్రధానమంత్రి కావాలనుకుంటున్న రాహుల్ గాంధీ పిరికివాడిలా, నిరంకుశంగా, అప్రజాస్వామికంగా ప్రవర్తిస్తున్నారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బరితెగించి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని, గల్లీల్లో తిరుగుతూ ‘ఓటు చోరీ’ అని అరిచే రాహుల్.. తెలంగాణలోనే అతిపెద్ద ఓట్ల దొంగ, ఓటుకు నోటు సూత్రధారికే ముఖ్యమంత్రి కుర్చీ కట్టబెట్టారని ఆరోపించారు. రాహుల్ గాంధీ ఎవరిపై పడితే వారిపై ఆరోపణలు చేయొచ్చా? ఆధారాలతో ప్రశ్నిస్తే క్రిశాంక్‌ను జైలుకు పంపుతారా? అని ప్రశ్నించారు. కీలుబొమ్మ రేవంత్‌రెడ్డిని అదుపులో పెట్టుకుని రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడం ఇకనైనా ఆపాలని రాహుల్‌కు కేటీఆర్ సూచించారు.

