HomeతెలంగాణKTR : బీజేపీతో పొత్తు ప్రసక్తే లేదు.. 2028 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఒంటరిగానే పోటీ

KTR : బీజేపీతో పొత్తు ప్రసక్తే లేదు.. 2028 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఒంటరిగానే పోటీ

  • దామాషా ప్రాతిపదికన లోక్‌సభ స్థానాలు పెంచితే డీలిమిటేషన్‌కు మద్దతిస్తాం
  •  ఏఐ, సాంకేతిక మార్పులను స్వీకరించాల్సిందే
  •  నగర సమస్యలకు దీర్ఘకాలిక విధానాలు అవసరం
  •  పాలమూరు ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తి చేయాలి
  •  బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 16 (తెలుగు ప్రభ): 2028 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో బీఆర్‌ఎస్‌ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని, బీఆర్‌ఎస్‌ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. హర్యానాలోని ఓపీ జిందాల్‌ గ్లోబల్‌ యూనివర్సిటీలో బుధవారం ‘ఇన్నోవేషన్‌ ఇన్‌ గవర్నెన్స్‌: ది స్టోరీ ఆఫ్‌ ఎ స్టార్టప్‌ స్టేట్‌’ అంశంపై ప్రత్యేక ఉపన్యాసం ఇచ్చిన ఆయన విద్యార్థులతో ముఖాముఖిలో మాట్లాడారు. డీలిమిటేషన్‌పై మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా లోక్‌సభ స్థానాలను దామాషా ప్రాతిపదికన పెంచితే బీఆర్‌ఎస్‌కు అభ్యంతరం లేదన్నారు. ప్రస్తుతం లోక్‌సభలో దక్షిణాది రాష్ట్రాలకు 24 శాతం ప్రాతినిధ్యం ఉందని, స్థానాల సంఖ్యను దామాషా ప్రకారం పెంచితే డీలిమిటేషన్‌ బిల్లుకు మద్దతు ఇస్తామని చెప్పారు.

- Advertisement -

ఏఐని స్వీకరించాలి
కృత్రిమ మేధస్సు, సాంకేతిక మార్పులపై కేటీఆర్‌ మాట్లాడుతూ.. ప్రతి పెద్ద సాంకేతిక పరివర్తన సమయంలోనూ ఆందోళనలు వ్యక్తమయ్యాయని, ఏఐ విషయంలోనూ అదే పరిస్థితి కనిపిస్తోందన్నారు. సాంకేతిక మార్పులను స్వీకరించి ముందుకు సాగాల్సిన అవసరం ఉందని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి నమూనాను ‘నిర్దిష్టత, అవకాశాలు’ అనే రెండు భావనల ఆధారంగా వివరించారు. మౌలిక వసతులు, విశ్వసనీయమైన ప్రజా సేవలతో ప్రజలకు స్థిరమైన వాతావరణం కల్పించడంతో పాటు ఇన్నోవేషన్‌, వ్యవస్థాపకతకు ప్రోత్సాహం అందించే ఎకోసిస్టమ్‌ను ప్రభుత్వం నిర్మించాలని అన్నారు. పరిమితులను సమస్యలుగా కాకుండా అవకాశాలుగా చూడాలని, నిరంతరం నేర్చుకోవడం, మెరుగుపడటం, వాటిని ఆచరణలో పెట్టడంపై దృష్టి పెట్టాలని విద్యార్థులకు సూచించారు.

తాత్కాలిక పరిష్కారాలొద్దు
నగరాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు తాత్కాలిక పరిష్కారాలతో సరిపెట్టకుండా సమగ్ర, దీర్ఘకాలిక పరిష్కారాలపై దృష్టి పెట్టాలని కేటీఆర్‌ అన్నారు. న్యూఢిల్లీలోని ఇండియా హ్యాబిటాట్‌ సెంటర్‌లో జనాగ్రహ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘షెహెరోన్‌ పే చర్చా’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. భారత నగరాలను ప్రజలకు మరింత అనుకూలంగా తీర్చిదిద్దే అంశంపై జరిగిన ప్యానెల్‌ చర్చలో మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో తెలంగాణలో చేపట్టిన పట్టణాభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. హైదరాబాద్‌పై పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించేందుకు జిల్లా కేంద్రాల్లో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులు, వైద్య కళాశాలలు, ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ టవర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలను హైదరాబాద్‌ వెలుపల కూడా అభివృద్ధి చేయడం ద్వారా నగరంపై ఒత్తిడిని తగ్గించే ప్రయత్నం చేసినట్లు చెప్పారు. పట్టణ రవాణా సమస్యలకు హైస్పీడ్‌ రైలు నెట్‌వర్క్‌ అభివృద్ధి దోహదపడుతుందని పేర్కొన్నారు. నగర ప్రభుత్వాలకు అవసరమైన మూలధనం సమకూర్చడం సవాలుగా ఉందని, పట్టణ సమస్యల పరిష్కారానికి వినూత్న, భాగస్వామ్య విధానాలు అవసరమని అన్నారు. అనంతరం ‘భారత్‌ ఏఐ ఎక్స్‌పీరియెన్షియల్‌ సెంటర్‌’ను సందర్శించారు.

కేసీఆర్‌పై కక్షతో పాలమూరును పడావు పెట్టొద్దు
పాలమూరు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు మాజీ సీఎం కేసీఆర్‌ కీలక చర్యలు చేపట్టారని కేటీఆర్‌ అన్నారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నార్లాపూర్‌ పంపుల వెట్‌రన్‌ ప్రారంభించి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన స్పందించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేసి లక్షల ఎకరాలకు నీరందించామని పేర్కొన్నారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా సుమారు 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు, 1,226 గ్రామాలకు తాగునీరు అందించాలన్న లక్ష్యం ఉందన్నారు. ప్రాజెక్టులో మిగిలిన పనులను త్వరగా పూర్తిచేసి రైతుల పొలాలకు నీరు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ‘కేసీఆర్‌పై కక్షతో పాలమూరు ప్రాజెక్టును పడావు పెట్టొద్దు. మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలి’ అని కేటీఆర్‌ అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News