- ఎవరెంత ఒత్తిడి తెచ్చినా రైతులపై భారం మోపబోం
- రైతులకు ప్రజాప్రభుత్వం 100 శాతం హామీ
- కేంద్రంతో ‘ఉదయ్’ ఒప్పందం చేసిందే గత ప్రభుత్వం
- ఆర్డీఎస్ఎస్‌లో వ్యవసాయ మీటర్ల నిబంధనే లేదు
- సోలార్‌తో పగలు.. బ్యాటరీ, పంప్డ్ స్టోరేజ్‌తో రాత్రి విద్యుత్
- ఎల్‌నినో ప్రభావంతో పెరిగిన డిమాండ్
- శాసనమండలిలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
హైదరాబాద్, సెప్టెంబర్ 11 (తెలుగుప్రభ): వ్యవసాయ పంప్‌సెట్లకు స్మార్ట్ మీటర్లు పెట్టే ప్రసక్తే లేదని ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క తేల్చిచెప్పారు. భూమ్యాకాశాలు ఏకమైనా, ఎవరెంత ఒత్తిడి తెచ్చినా రైతుల వ్యవసాయ మోటార్లకు మీటర్లు అమర్చబోమని స్పష్టం చేశారు. రైతులకు ప్రభుత్వం తరఫున 100 శాతం హామీ ఇస్తున్నానని శుక్రవారం శాసనమండలిలో ప్రకటించారు. వ్యవసాయ పంప్‌సెట్లకు మీటర్లు ఏర్పాటు చేయాలన్న నిబంధన రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ (ఆర్డీఎస్ఎస్)లో లేదని భట్టి తెలిపారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థను ఆధునీకరించడం, నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడం, ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచడమే ఈ పథకం లక్ష్యమన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా కొనసాగుతుందని, రైతులపై ఎలాంటి అదనపు భారం పడకుండా విద్యుత్ వ్యవస్థను ఆధునీకరించడమే ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టం చేశారు.
ఉదయ్ ఒప్పందంలో వ్యవసాయానికి మినహాయింపు
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వమే కేంద్రంతో ఉదయ్ పథకం కింద త్రైపాక్షిక ఒప్పందం చేసిందని, ఆ ఒప్పందంలో అంగీకరించిన అంశాలకు మించి ప్రస్తుత ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముందుకు వేయదని భట్టి చెప్పారు. ఒప్పందంలో వ్యవసాయ వినియోగదారులకు మినహాయింపు ఇచ్చి, అధిక విద్యుత్ వినియోగించే ఇతర వినియోగదారులకు మాత్రమే స్మార్ట్ మీటర్ల ఏర్పాటు అంశాన్ని పొందుపరిచారని తెలిపారు. ఆర్డీఎస్ఎస్ కింద వ్యవసాయ పంప్‌సెట్లకు తప్పనిసరిగా మీటర్లు ఏర్పాటు చేయాలనే నిబంధన లేదని మరోసారి స్పష్టం చేశారు. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 60 శాతం గ్రాంట్ అందిస్తుండగా, మిగిలిన 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. గత ప్రభుత్వం కేంద్రం నుంచి అందుబాటులో ఉన్న గ్రాంట్లను పూర్తిస్థాయిలో వినియోగించుకోకపోవడం వల్ల రాష్ట్రానికి నష్టం జరిగిందని విమర్శించారు.
పెరుగుతున్న డిమాండ్‌కు ఆధునీకరణ
ఆర్డీఎస్ఎస్ కింద చేపడుతున్న పనులు వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టేందుకు కాదని, ఎస్సీఏడీఏ, ఫాల్ట్ ప్యాసేజ్ ఇండికేటర్లు, సెక్షనలైజర్లు, ఆటో రీ-క్లోజర్లు వంటి ఆధునిక సాంకేతిక వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దీంతో విద్యుత్ లైన్లలో లోపాలు ఏర్పడిన వెంటనే సబ్‌స్టేషన్, కంట్రోల్ రూమ్‌లకు సమాచారం చేరి సరఫరా పునరుద్ధరణ వేగవంతమవుతుందని చెప్పారు. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగిందని, సెప్టెంబర్ 9న తెలంగాణ విద్యుత్ చరిత్రలోనే అత్యధికంగా 19,543 మెగావాట్ల గరిష్ట డిమాండ్ నమోదైందని తెలిపారు. గతంలో 9 వేల నుంచి 10 వేల మెగావాట్ల మధ్య ఉన్న విద్యుత్ డిమాండ్ ప్రస్తుతం 19 వేల నుంచి 20 వేల మెగావాట్లకు చేరిందన్నారు. కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ అంచనాల ప్రకారం 2029-30 నాటికి రాష్ట్ర గరిష్ట విద్యుత్ డిమాండ్ 24,624 మెగావాట్లకు, 2034 – 35 నాటికి 34,137 మెగావాట్లకు చేరే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ట్రాన్స్‌మిషన్ లైన్లు, సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, పంపిణీ నెట్‌వర్క్‌ను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విస్తరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
సోలార్‌తో పగలు.. స్టోరేజ్‌తో రాత్రి
వ్యవసాయ పంప్‌సెట్ల సోలరైజేషన్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించి రైతులకు మెరుగైన సరఫరా అందించేందుకు చర్యలు చేపడుతున్నామని భట్టి తెలిపారు. బ్యాటరీ, పంప్డ్ స్టోరేజ్ వ్యవస్థల ద్వారా పగటిపూట ఉత్పత్తయ్యే అదనపు సోలార్ విద్యుత్‌ను నిల్వ చేసి రాత్రిపూట వినియోగించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో సుమారు 29 లక్షల వ్యవసాయ పంప్‌సెట్లకు ఉచిత విద్యుత్ అందించేందుకు ఏటా రూ.14 వేల కోట్లను ప్రభుత్వం వ్యయం చేస్తోందని వెల్లడించారు. రైతులు చెల్లించాల్సిన విద్యుత్ బిల్లును ప్రభుత్వమే భరిస్తోందన్నారు. సోలార్ పంప్‌సెట్ల విధానాన్ని ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నామని, దీనికి అయ్యే పూర్తి వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందని తెలిపారు. రైతులు సోలరైజేషన్‌కు అంగీకరించకపోతే ప్రస్తుతం అందుతున్న ఉచిత విద్యుత్ సదుపాయం యథాతథంగా కొనసాగుతుందని, రైతులపై ఎలాంటి ఒత్తిడి ఉండబోదని స్పష్టం చేశారు.
వర్షాభావంతో పెరిగిన డిమాండ్
రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ ఒక్కసారిగా పెరగడానికి వర్షాభావ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావం ప్రధాన కారణమని భట్టి తెలిపారు. వర్షాలు లేక భూగర్భ జలమట్టాలు పడిపోవడంతో రైతులు బోర్లపై ఎక్కువగా ఆధారపడాల్సి వచ్చిందని, దీంతో వ్యవసాయ పంప్‌సెట్ల వినియోగం పెరిగి విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగిందని వివరించారు. ఎంత వ్యయం అయినా అవసరమైన విద్యుత్‌ను కొనుగోలు చేసి ప్రజలకు, రైతులకు నిరంతరాయంగా సరఫరా చేస్తామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. అధిక విద్యుత్ డిమాండ్ ప్రభుత్వ వైఫల్యం వల్ల కాదని, వర్షాభావం, ఎల్‌నినో ప్రభావంతో వ్యవసాయ విద్యుత్ వినియోగం అనూహ్యంగా పెరగడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. వ్యవసాయ పంప్‌సెట్లకు మీటర్లు పెట్టే విషయంలో ప్రభుత్వ నిర్ణయం అంతిమమని, రైతులకు ఉచిత విద్యుత్ అందించే విధానం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

