Karimnagar: కరీంనగర్‌లో తుపాకుల మోత కలకలం సృష్టించింది. జ్యోతినగర్‌లోని ప్రముఖ పీఎంజే (PMJ) నగల దుకాణంలో దోపిడీకి దుండగులు యత్నించారు. అంతేకాకుండా అడ్డువచ్చిన సిబ్బందిపై కాల్పులకు తెగబడ్డారు.
దుకాణంలోకి చొరబడి బీభత్సం: పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఐదుగురు దుండగులు తుపాకులతో ఒక్కసారిగా షోరూమ్‌లోకి చొరబడ్డారు. బంగారు నగల దోపిడీకి యత్నిస్తుండగా అక్కడి సిబ్బంది మరియు సెక్యూరిటీ గార్డులు ప్రాణాలకు తెగించి వారిని అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన దుండగులు తమ వద్ద ఉన్న తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో షోరూమ్ సిబ్బంది గాయపడినట్లు సమాచారం. వెంటనే స్పందించిన తోటి ఉద్యోగులు, స్థానికులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు అందాల్సి ఉంది.
రంగంలోకి పోలీసులు.. అన్ని మార్గాలు బ్లాక్: ఘటన జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఉన్నతాధికారులతో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. దుకాణంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. దుండగులు ఎటువైపు పారిపోయారనే దానిపై ఆరా తీస్తున్నారు. నగరం నుంచి బయటకు వెళ్లే అన్ని మార్గాలను బ్లాక్ చేసి తనిఖీలు చేపట్టారు. రద్దీగా ఉండే జ్యోతినగర్ ప్రాంతంలో కాల్పులు జరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

