CM OU Meeting: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు (డిసెంబర్ 10, 2025)ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని (Osmania University) సందర్శించనున్నారు. వర్సిటీ అభివృద్ధికి గతంలో ప్రకటించిన రూ. 1000 కోట్ల నిధుల అంశంపై తుది కార్యాచరణ రూపొందించేందుకు ముఖ్యమంత్రి పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
సభలో రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం: సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ఉదయం 11 గంటలకు ఓయూలోని ప్రతిష్ఠాత్మక ఆర్ట్స్ కాలేజీ భవనం వద్ద ఏర్పాటు చేసిన సర్వం సిద్ధం సభలో ప్రసంగించనున్నారు. వర్సిటీలో సౌకర్యాలు, మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రకటించిన నిధులకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR)ను అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు. విద్యార్థులు, అధ్యాపకుల నుంచి సేకరించిన సూచనలు, అభిప్రాయాల ఆధారంగా ఈ డీపీఆర్ రూపొందించబడింది. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వర్సిటీలోని అకడమిక్ బ్లాక్‌లు, హాస్టళ్లు, ఇతర విద్యార్థి సౌకర్యాలను క్షుణ్ణంగా పరిశీలించనున్నారు.
Also Read: https://teluguprabha.net/telangana-news/telangana-global-summit-2025-investments-jobs/
ఓయూ చరిత్రలో కీలక ఘట్టం: విద్యార్థులు, అధ్యాపకుల అభిప్రాయాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ, ఈ అభివృద్ధి పనులపై సీఎం నేడు తుది నిర్ణయం తీసుకోనున్నారు. గతంలోనే ముఖ్యమంత్రి, ఓయూ అభివృద్ధికి ఎంత ఖర్చు పెట్టడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో, విద్యారంగానికి పెద్దపీట వేస్తూ చేపట్టనున్న ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఓయూ చరిత్రలో మరో కీలక ఘట్టంగా నిలవనున్నాయి.

