HomeతెలంగాణHyderabad: నేడు 'మహిళా శక్తి మహా సభ'.. పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ ఏర్పాట్లు!

Hyderabad: నేడు ‘మహిళా శక్తి మహా సభ’.. పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ ఏర్పాట్లు!

Mahila shakti maha sabha: తెలంగాణ మహిళా సాధికారతో లక్ష్యంగా ముందుకెళ్తున్న రేవంత్‌ సర్కార్‌ మరో చారిత్రక ఘట్టానికి స్వీకారం చుట్టనుంది. సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్ వేదిక కానుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్వయం సహాయక సంఘాల (SHG) మహిళలను ఒకే వేదికపైకి తీసుకువస్తూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన “మహిళా శక్తి మహా సభ”ను సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్ వేదిక నేడు నిర్వహించనున్నారు. ఈ భారీ ప్రదర్శనకు రాష్ట్ర నలుమూలల నుంచి సుమారు 25 వేల మంది మహిళలు హాజరుకానున్నారు. ఈ సభ ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సచివాలయంలో అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించగా.. సోమవారం సాయంత్రం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క స్వయంగా పరేడ్ గ్రౌండ్స్‌కు వెళ్లి ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులు సమన్వయంతో పనిచేసి సభను విజయవంతం చేయాలని ఆమె ఆదేశించారు.

- Advertisement -

మహిళలు ప్రగతికి ప్రతీక: గత రెండేళ్లుగా మహిళల ఆర్థిక స్వావలంబన, ఉపాధి అవకాశాల విస్తరణ, వ్యాపారాభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు ఈ సభ ప్రతీకగా నిలవనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై.. మహిళల కోసం ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించనున్నారు. ముఖ్యంగా మహిళా సంఘాల రుణ పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ఈ వేదికపై నుంచే అధికారికంగా ప్రకటించనున్నారు.

రూ.500 కోట్ల వడ్డీ లేని రుణాలు: ఈ మహాసభ వేదికగా ప్రభుత్వం మహిళా సంఘాలకు భారీగా ఆర్థిక సాయాన్ని అందజేయనుంది. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల కింద రూ.500 కోట్ల చెక్కులను అందజేస్తారు. అంతేకాకుండా మహిళా సంఘాల ఆర్టీసీ అద్దె బస్సుల హైర్ ఛార్జీల కింద రూ.20.30 కోట్ల చెక్కులను పంపిణీ చేస్తారు. కొత్త బస్సుల కొనుగోలు కోసం టీజీఎస్‌ఆర్టీసీకి రూ.199 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందజేస్తారు.

ప్రత్యేక ఆకర్షణగా మహిళల అద్దె బస్సులు: ఈ సభలో ప్రధాన ఆకర్షణగా మహిళా సంఘాలు స్వయంగా కొనుగోలు చేసి.. ఆర్టీసీకి అద్దెకు ఇచ్చిన 553 బస్సులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించనున్నారు. మహిళల భాగస్వామ్యంతో నడుస్తున్న ఈ వినూత్న రవాణా నమూనా రాష్ట్రంలో మహిళా సాధికారతకు సరికొత్త గుర్తింపుగా నిలవనుంది. ఇప్పటికే జిల్లాల నుంచి వేలాది మంది మహిళలు తమ సంఘాలకు చెందిన సొంత బస్సుల్లో హైదరాబాద్‌కు తరలివచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.

మహాలక్ష్మితో రూ.10,700 కోట్ల ఆదా: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘మహాలక్ష్మి’ ఉచిత బస్సు ప్రయాణ పథకం ద్వారా ఇప్పటివరకు మహిళలకు లభించిన లబ్ధిని ఈ సభలో సీఎం రేవంత్‌ రెడ్డి వివరించనున్నారు. ఈ పథకం ద్వారా మహిళలకు దాదాపు రూ.10,700 కోట్ల మేర ప్రయాణ ఖర్చులు ఆదా అయ్యాయని.. ఈ నిధులు వారి కుటుంబ ఆర్థిక ప్రగతికి ఎలా తోడ్పడ్డాయో సభలో విశ్లేషించనున్నారు.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News