Heat waves: తెలంగాణ నిప్పుల గుండంగా మారింది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా వీస్తున్న వేడిగాలులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. శనివారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా వడదెబ్బకు గురై 51 మంది మరణించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మృతులలో అత్యధికంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో 23 మంది ప్రాణాలు కోల్పోగా.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 11 మంది, ఖమ్మంలో ఏడుగురు, ఆదిలాబాద్‌లో ఐదుగురు, నల్గొండలో ఐదుగురు మృతి చెందారు. వీరిలో ఒకరు సరస్వతి అంత్య పుష్కరాలకు వచ్చి వడదెబ్బకు గురైనట్లు సమాచారం.
46.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత: రాష్ట్రంలోని 32 జిల్లాల్లో శనివారం 40.3 డిగ్రీల నుండి 46.3 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొత్తగూడెం జిల్లాలో అత్యధికంగా 46.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అత్యల్పంగా నారాయణపేట జిల్లాలో 39.8 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. ఏడు జిల్లాల్లో 46 డిగ్రీలు దాటగా.. మరో తొమ్మిది జిల్లాల్లో 45 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలు ఎండల తీవ్రతతో అతలాకుతలమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వడగాలుల ఉధృతి కొద్దిగా తగ్గినప్పటికీ.. వేడి వాతావరణం మాత్రం ఇలాగే కొనసాగుతోంది.
Also Read-Breaking: వైట్‌హౌస్ సమీపంలో కాల్పుల కలకలం.. తుపాకీ స్వాధీనం
ఈ నెల 27 వరకు హెచ్చరికలు: రాష్ట్రంలో ఈ నెల 27 వరకు వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది . ఈ మేరకు వివిధ జిల్లాలకు అలర్ట్‌లు జారీ చేసింది. ఉత్తర తెలంగాణ జిల్లాలైన కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలకు ఆదివారం ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

