panchayat elections: రెండో దశ గ్రామపంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. 193 మండలాల్లోని 3,911 సర్పంచి.. 29,917 వార్డు సభ్యుల స్థానాలకు ఇవాళ ఎన్నికలు జరగనున్నాయి. రెండో విడతలో 12,782 మంది సర్పంచి పదవులకు, 71,071 మంది వార్డు సభ్య స్థానాలకు బరిలో నిలిచి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 38,337 పోలింగ్ కేంద్రాల్లో 57,22,465 మంది ఓటర్లు రెండో విడతలో భాగంగా ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. అనంతరం ఫలితాలను ప్రకటిస్తారు. ఆ తర్వాత వార్డు సభ్యులతో సమావేశాలు నిర్వహించి ఉపసర్పంచిని ఎన్నుకుంటారు.ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది.
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్: రెండో విడతలో 4333 గ్రామ పంచాయతీ సర్పంచి, 38,350 వార్డు సభ్యుల పదవుల ఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే వీటిలో 415 గ్రామ సర్పంచి, 8307 వార్డు పదవులు ఏకగ్రీవమయ్యాయి. మరో అయిదు గ్రామాల్లో, 108 వార్డుల్లోని స్థానికులు ఎలాంటి నామినేషన్లు దాఖలు చేయలేదు. పలుకారణాలతో మరో ఇంకో గ్రామాల్లో, 18 వార్డుల్లో ఎన్నికలను నిలిపివేశారు. ఇవి పోను మిగిలిన పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని తెలిపారు. ఈ దశ ఎన్నికల్లో 4593 మంది రిటర్నింగ్ అధికారులు, 30,661 మంది సిబ్బంది విధుల్లో పాల్గొనున్నారు. 2489 మందిని ఎన్నికల సూక్ష్మ పరిశీలకులుగా నియమించినట్లుగా ఈసీ పేర్కొన్నారు. అంతే కాకుండా సమస్యాత్మకంగా గుర్తించిన 3769 కేంద్రాల్లో పోలింగు ప్రక్రియను వెబ్‌కాస్టింగ్ చేయనున్నారు.
Also Read:Election: తొలివిడత పల్లెపోరులో కాంగ్రెస్ సత్తా.. 2,383 సర్పంచ్ స్థానాల్లో విజయం!
పకడ్బందీగా ఏర్పాట్లు.. భారీగా నగదు, మద్యం సీజ్: ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసులను మోహరించారు. వేల మంది పోలింగ్ సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టుగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని తెలిపారు. సమస్యాత్మకంగా గుర్తించిన 3769 పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ కెమెరాలు ఏర్పాటు చేసినట్లుగా పేర్కొన్నారు. 50 వేల మంది సివిల్ పోలీసులు, 60 ప్రత్యేక పోలీసు ప్లటూన్‌లు, రెండు వేల మంది అగ్నిమాపక, అటవీ సిబ్బంది బందోబస్తు విధులు నిర్వహిస్తారని అన్నారు. రెండో దశ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించి.. రూ. 2,02,84,590 నగదు, రూ. 3,46,95,639 విలువైన మద్యం, రూ. 2,28,27,539 విలువైన మత్తుపదార్థాలు, రూ.12,15,500 విలువైన బంగారం, మరో రూ. 69,16,560 విలువైన ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లుగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పేర్కొన్నారు.
టెలిపోల్ యాప్ ద్వారా ఓటరు స్లిప్‌లు: కమిషన్ రూపొందించిన టెలిపోల్ యాప్ నుంచి ఓటర్లు తమ ఓటరు స్లిప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని పేర్కొన్నారు. అంతే కాకుండా కమిషన్ 9240021456 టోల్‌ఫ్రీ నంబర్‌తో కాల్ సెంటర్ ఏర్పాటు చేసిందని తెలిపారు. ఓటర్లు నిర్భయంగా, స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకోవాలని కమిషనర్ కోరారు. పోలింగ్ జరిగే గ్రామాల్లో మద్యం దుకాణాలను మూసివేయించినట్లు తెలిపారు. స్థానికంగా సెలవు దినంగా సైతం ప్రకటించినట్లుగా పేర్కొన్నారు. ఇప్పటికే తొలివిడత పూర్తికాగా నేడు రెండో విడత ఎన్నికలు జరుగనున్నాయి. డిసెంబర్ 17న మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది.

