HomeTop StoriesElections: పగలు ప్రచారం.. రాత్రి ప్రసాదం.. గ్రామాల్లో ప్రస్తుత పరిస్థితి!

Elections: పగలు ప్రచారం.. రాత్రి ప్రసాదం.. గ్రామాల్లో ప్రస్తుత పరిస్థితి!

Panchayat elections: గ్రామ పంచాయతీ ఎన్నికల పోరుతో రాష్ట్ర వ్యాప్తంగా సందడి వాతావరణం నెలకొంది. రేపు (డిసెంబర్ 11) జరగనున్న 4,236 గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడత పోరు.. అసెంబ్లీ ఎన్నికల వాతావరణాన్ని తలపిస్తోంది. సర్పంచ్, వార్డు మెంబర్ల పదవులను దక్కించుకునేందుకు అభ్యర్థులు హోరాహోరీగా తలపడుతున్నారు. అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. ఖర్చుకు వెనుకాడకుండా ప్రత్యర్థి వ్యూహాలకు దీటుగా ప్రతివ్యూహాలు అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు గ్రామాల్లో తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి.

- Advertisement -

పగలు ప్రచారం.. రాత్రి ప్రసాదం: రేపే తొలివిడత పోలింగ్‌ ఉండటంతో చాలా గ్రామాల్లో ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు స్పెషల్ గిఫ్టులు పంపుతున్నారు. గ్రామాల్లో ప్రస్తుత పరిస్థితి ‘పగలు ప్రచారం.. రాత్రి ప్రసాదం’ అన్నట్లుగా ఉంది. తొలిదశ ఎన్నికల్లో భాగంగా అభ్యర్థులు గత వారం రోజులు హోరాహోరీగా ప్రచారం చేశారు. అయితే మంగళవారం అర్ధరాత్రి నుంచి ప్రసాదంతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ప్రతి ఇంటికి కిలో చికెన్‌ను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది. కొందరు అభ్యర్థులు చికెన్ తినని వారి కోసం మటన్‌ను సైతం సరఫరా చేస్తున్నట్లు సమాచారం. మగవారిని లక్ష్యంగా చేసుకొని క్వార్టర్ బాటిల్ లిక్కర్ పంపిణీకి కూడా ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

నోట్ల మాయలో ఓటర్లు: పోటీ తీవ్రంగా ఉన్న గ్రామాల్లో ఒక ఓటుకు రూ. వెయ్యి నుంచి రూ. 2 వేల వరకు నగదు పంచేందుకు అభ్యర్థులు సిద్ధమవుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రత్యర్థి ప్రలోభాలకు దీటుగా మరింత ఎక్కువ ఖర్చు చేయడానికి అభ్యర్థులు వెనుకాడటం లేదు. కొందరు ఓటర్లు సైతం నోట్ల మాయలో పడుతున్నారు. అర్ధరాత్రి వరకు ఇంటిగేట్లు మూయకుండా.. అభ్యర్థులు పంపే డబ్బుకోసం వేచి చూస్తున్నారు.

Also Read:  ‘ఓటు’ పల్లెలో.. ‘దావత్’ పట్నంలో! హైదరాబాద్‌కు పాకిన పంచాయతీ పోరు!

వలస ఓటర్ల రవాణాకు ప్రత్యేక ఏర్పాట్లు: ఎన్నికల నేపథ్యంలో వలస వెళ్లిన ఓటర్లను సైతం పోలింగ్ కోసం ఊర్లకు రప్పించేందుకు అభ్యర్థులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం బస్సులు, కార్లు, ఇతర వాహనాలను అద్దెకు తీసుకుని వారిని తరలిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో ప్రయాణ ఖర్చులను ఓటింగ్ ముగిసిన తర్వాత ఇచ్చేలా ముందస్తు ఒప్పందాలు చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ ప్రలోభాలు, పోటాపోటీ వ్యూహాలతో గ్రామాల్లో ఎన్నికల వాతావరణం పతాక స్థాయికి చేరింది. అయితే రేపు జరగబోయే ఈ స్థానిక పోరులో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News