TPCC Cheif Mahesh Goud sensational comments: తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు గురికావడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ వ్యవహారం పార్టీలో తీవ్ర చర్చకు దారితీసింది. మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసి మీనాక్షిపై కేసు ఉన్నట్లు తెలంగాణ కాంగ్రెస్ నేతే లీక్ ఇచ్చాడని బీజేపీ నేత ఒకరు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఈ వ్యవహారంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం, రాష్ట్ర నాయకత్వం అత్యంత సీరియస్‌గా తీసుకున్నట్లు వెల్లడించారు. నామినేషన్ తిరస్కరణకు దారితీసిన పరిస్థితులు ఏమిటి? ఎక్కడ పొరపాటు జరిగింది? దీనికి బాధ్యులెవరు? మధ్యప్రదేశ్ బీజేపీ నేతలకు లీకులిచ్చింది ఎవరు? అనే విషయాలపై ఇప్పటికే అంతర్గత విచారణ ప్రారంభమైనట్లు తెలిపారు. ఈ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్నారని, ఎక్కడ లోపం జరిగిందో, ఎవరి పాత్ర ఉందో సమగ్రంగా సమీక్షిస్తున్నారని చెప్పారు.
Also read: KTR Comments: ధాన్యం కొనేందుకు గన్నీ బ్యాగులు లేవు.. ఉన్నవన్నీ ఢిల్లీకి పంపారు..! కేటీఆర్ సెటైర్లు
లీక్ వీరులు ఎవరో, గ్రీక్ వీరులు ఎవరో తేలుస్తాం..
కాంగ్రెస్‌లో ఉండి ప్రత్యర్థి పార్టీలకు లాభం చేకూర్చే కోవర్ట్‌లను త్వరలోనే గుర్తిస్తామని మహేశ్ గౌడ్ హెచ్చరించారు. “లీక్ వీరులు ఎవరో, గ్రీక్ వీరులు ఎవరో త్వరలోనే అందరికీ తెలుస్తుంది.” అని వెల్లడించారు. మీనాక్షి నామినేషన్ తిరస్కరణ వ్యవహారంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పార్టీ నాయకత్వం ఇప్పటికే సంకేతాలు ఇచ్చింది. అంతర్గత విచారణ వేగం పుంజుకోవడంతో లీకుల వెనుక ఉన్న అసలు వ్యక్తులు త్వరలోనే బయటపడే అవకాశముందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న ఈ పరిణామం ఎన్ని మలుపురు తిరుగుతుందో చూడాలి మరి.
షబ్బీర్ అలీకి షోకాస్ నోటీసులిచ్చాం..
ఇక, ప్రభుత్వ సలహాదారు, సీనియర్ నేత షబ్బీర్ అలీ వివాదాస్పద వ్యాఖ్యలపైనా ఆయన స్పందించారు. మహిళలను చులకన చేస్తూ సీనియర్ నేత షబ్బీర్ అలీ మాట్లాడటం విచారకరమన్నారు. ఈ వ్యవహారంలో ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. ఏడాది క్రితం మాట్లాడిన ఆడియో బయటకు వచ్చిందన్నారు. తన ఆస్తులు, వ్యక్తిత్వం ఏంటో నిజామాబాద్ ప్రజలకు తెలుసంటూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

