TPCC Chief Mahesh Kumar Goud: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త కార్మిక చట్టాల వల్ల కార్మికుల హక్కులకు భంగం కలుగుతుందని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ ఆరోపించారు. వెంటనే వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రం ఇటీవల తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో వీఎస్టీ నుంచి ఇందిరా పార్కు వరకు తీసిన ర్యాలీలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
తెలంగాణలో పుర ఎన్నికలు ముగిసిన మరుసటి రోజే.. కేంద్రంపై నిరసనలు వెల్లువెత్తాయి. నూతన లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం ఆటో, ఆర్టీసీ యూనియన్లు, వివిధ వర్గాల కార్మికులు, రైతు సంఘాలు, ప్రజా సంఘాలు, సీపీఐ, సీపీఎం, సీపీఐఎంఎల్ న్యూ డెమోక్రసీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల అనుబంధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన ఒక్క రోజు బంద్‌లో టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. వీఎస్టీ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ మీదుగా ఇందిరా పార్కు వరకు భారీ ర్యాలీ కొనసాగింది. అనంతరం ఇందిరా పార్కు వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మహేశ్ కుమార్ మాట్లాడారు.
కార్మికుల హక్కులను ప్రధాని మోదీ ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నారని మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ఈ హక్కు మోదీకి ఎవరిచ్చారని ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని బలహీనపరిచేలా బీజేపీ చర్యలు ఉంటాయని విమర్శించారు. కార్మికుల కష్టంతోనే దేశం నడుస్తోందని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా సెంట్రల్ ట్రేడ్ యూనియన్ పిలుపు మేరకు కార్మికులు ధర్నా చేస్తున్నారన్నారు. మోదీ, అమిత్ షాలను కేంద్రంలో రాహుల్ గాంధీ ధైర్యంగా ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. పెట్టుబడి వ్యవస్థకు ప్రధానీ మోదీ ప్రభుత్వం దారులు తెరిచిందని మండిపడ్డారు.
పేదల హక్కులను కాలరాయడమే కాకుండా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ఆ పేరును తొలగించి కొత్త చట్టాన్ని తీసుకువచ్చారని మహేశ్ కుమార్ ఎద్దేవా చేశారు. కేంద్రం తీసుకువచ్చిన నూతన చట్టాలపై అసెంబ్లీలో చర్చిస్తామని వెల్లడించారు. లేబర్ కోడ్‌ల రద్దు విషయంలో కార్మికులకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని.. తాము కార్మికుల పక్షపాతి అని స్పష్టం చేశారు. కార్మిక వ్యతిరేక చట్టాలను తొలగించేవరకు ఈ ఉద్యమం కొనసాగాలని మహేశ్ కుమార్ గౌడ్ ఉద్ఘాటించారు. కాగా, మన్‌రేగా పథకాన్ని రద్దు చేసేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా ‘గ్రామ సభలు’ నిర్వహించి పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని ఆయన ఇదివరకే ప్రకటించారు. ఇక మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 90 శాతం స్థానాలను కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

