- మేళాను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్ సిటీబ్యూరో (తెలుగుప్రభ): ఆషాఢ మాస బోనాల సందర్భంగా హెచ్ఎండీఏ గ్రౌండ్స్‌లో బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కులవృత్తుల మేళాను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ మేళాలో వివిధ కులాలకు సంబంధించిన ఉత్పత్తులు అమ్మకాలు చేసుకోవడానికి ఏర్పాటు చేసిన 60 స్టాళ్లు 15 రోజుల పాటు నడపనున్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నేతృత్వంలో కుల వృత్తులకు ప్రోత్సాహం ఇవ్వడానికి కుల వృత్తుల మేళా కార్యక్రమం ప్రారంభించామన్నారు. ఆషాఢ మాస బోనాల ఉత్సవాలకు అవసరమైన కుండలు తదితర వస్తువులు కుల వృత్తుల ఉత్పత్తులు ఈ మేళాలో విక్రయించుకోవచ్చని ఆయన తెలిపారు. బడుగు బలహీన వర్గాల అంతరించిపోతున్న కుల వృత్తులను ప్రోత్సహించడానికి మన ఆచార వ్యవహారాలు సంప్రదాయాలకు ప్రతీక అయిన కుల వృత్తులను ప్రోత్సహించడానికి బీసీ సంక్షేమ శాఖ ఈ మేళా ఏర్పాటు చేసిందని ఆయన పేర్కొన్నారు. కుల వృత్తుల ఉత్పత్తులు కొనుగోలు చేయడం వల్ల కులాలను ప్రోత్సహించడమే కాకుండా వారిని ఆదరించడం, వారికి ఆర్థిక తోడ్పాటు ఉంటుందన్నారు.
Also Read: Sridhar Babu: జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తాం.. మంత్రి శ్రీధర్ బాబు హామీ


