Tummala Nageswara Rao Delhi visit : తెలంగాణ అన్నదాతల సంక్షేమమే పరమావధిగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హస్తిన వేదికగా ముమ్మర కసరత్తు నిర్వహించారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో పాటు పలువురు కేంద్ర ప్రముఖులతో వరుస భేటీలు జరిపి రాష్ట్ర వ్యవసాయ డిమాండ్లను వారి ముందుంచారు.
ఆయిల్‌పామ్‌కు రూ.25 వేల మద్దతు ధర: కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో భేటీ అయిన మంత్రి తుమ్మల, ఆయిల్‌పామ్ సాగుదారులకు వెన్నుదన్నుగా నిలవాలని కోరారు. మార్కెట్ ఒడుదొడుకుల నుంచి రైతును కాపాడేందుకు టన్ను ఆయిల్‌పామ్‌కు కనీస హామీ ధరగా రూ.25,000 నిర్ణయించాలని విజ్ఞప్తి చేశారు. పీఎం-ఆర్‌కేవీవై (PM-RKVY) పథకం కింద రాష్ట్రానికి నిధుల కేటాయింపులను భారీగా పెంచాలని నివేదించారు.
కొత్తగూడెంలో పరిశోధనా కేంద్రాలు: కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్‌తోనూ తుమ్మల సమావేశమయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం కేంద్రంగా ప్రాంతీయ కొబ్బరి అభివృద్ధి బోర్డు (CDB) కార్యాలయంతో పాటు, ప్రాంతీయ ఆయిల్‌పామ్ పరిశోధనా కేంద్రాన్ని మంజూరు చేయాలని కోరారు. తద్వారా ఈ ప్రాంతంలో ఉద్యాన పంటల సాగు నూతన పుంతలు తొక్కుతుందని వివరించారు.

