Serilingampally: తెలంగాణ పదో తరగతి (SSC) పరీక్షల నిర్వహణలో విద్యాశాఖ అధికారుల తీరు వివాదాస్పదంగా మారింది. విద్యార్థులు చదువుతున్న పాఠశాలనే పరీక్షా కేంద్రంగా కేటాయించకూడదనే ప్రాథమిక నిబంధనను విద్యాశాఖ తుంగలో తొక్కింది. కూకట్‌పల్లిలోని న్యూ ఏరా స్కూల్ వ్యవహారం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఏకంగా 80 మంది విద్యార్థులకు అదే పాఠశాలలో సెంటర్ కేటాయించడంపై అక్రమాల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
భారీ అక్రమాలకు తెరలేపారా?: ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలతో విద్యాశాఖ అధికారులు చేతులు కలిపరనే ఆరోపణలు వస్తున్నాయి. విద్యార్థులకు అత్యధిక మార్కులు వచ్చేలా చేసేందుకే ఈ విధమైన వెసులుబాటు కల్పించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా సెల్ఫ్ సెంటర్లకు విద్యాశాఖ అనుమతించదు. కానీ ఈ స్కూల్ విషయంలో మాత్రం నిబంధనలను పక్కన పెట్టడం వెనుక ఉన్న మర్మమేంటని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.
గోప్యంగా హాల్ టికెట్లు: అయితే ఈ వ్యవహారం బయటకు పొక్కకుండా ఉండేందుకు పాఠశాల యాజమాన్యం అనుసరిస్తున్న తీరు మరింత అనుమానాలకు తావిస్తోంది. తమ హాల్ టికెట్లను ఎవరికి చూపవద్దని పాఠశాల యాజమాన్యం విద్యార్థుల హుకుం జారీ చేసినట్లుగా తెలుస్తోంది. సెంటర్ వివరాలను బయటపెట్టవద్దని విద్యార్థులపై ఆంక్షలు విధించినట్లు సమాచారం.
Also read-Telangana: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఏప్రిల్ మొదటి వారంలోనే ఫలితాలు!
విచారణకు డిమాండ్: పరీక్షలకు పది రోజుల ముందే హాల్ టికెట్లు జారీ చేసినప్పటికీ ఈ కేంద్రాన్ని అత్యంత రహస్యంగా ఉంచడంలో జిల్లా విద్యాధికారి పాత్రపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. విద్యాశాఖ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతున్నారు.
తమ అధికారులతో పర్యవేక్షిస్తున్నాం: న్యూ ఏరా స్కూల్ వ్యవహారం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీంతో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా డిఈఓ విజయ కుమారితో పాటుగా ఎంఈఓ రవీందర్ రాజు స్పందించారు. ఈ సెంటర్‌లో తమ అధికారులతో పరీక్షలను పర్యవేక్షిస్తున్నామని ఎంఈఓ రవీందర్ రాజు అన్నారు. ఎవరు కూడా తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. జంబ్లింగ్ విధానంలో ప్రతి సంవత్సరం ఇలానే జరుగుతాయని డీఈవో విజయ కుమారి పేర్కొన్నారు. ఎలాంటి అవకతవకలు జరగలేదని అన్నారు. ప్రస్తుతం విద్యాశాఖకు చెందిన అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. కూకట్‌పల్లి వ్యాప్తంగా 8500 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారని పేర్కొన్నారు. ఎలాంటి ఆందోళన అవసరం లేదని విద్యార్థుల తల్లిదండ్రులకు సూచించారు.



