HomeతెలంగాణHyderabad: 'బతుకు జట్కా బండి' కోసం వచ్చిన మహిళపై సామూహిక అత్యాచారం

Hyderabad: ‘బతుకు జట్కా బండి’ కోసం వచ్చిన మహిళపై సామూహిక అత్యాచారం

  • సహాయం చేస్తామంటూ మహిళపై సామూహిక అత్యాచారం
  • ‘బతుకు జట్కా బండి’ కార్యక్రమానికి వచ్చి మోసపోయిన బాధితురాలు..
  • ఒకరు అరెస్ట్, మరొకరి కోసం గాలింపు

సికింద్రాబాద్ (తెలుగుప్రభ): సికింద్రాబాద్‌లో ఓ మహిళపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. కుటుంబ సమస్యల పరిష్కారం కోసం నగరానికి వచ్చిన మహిళను సహాయం చేస్తామని నమ్మించి ఓ భవనానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన మహంకాళి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. వరకట్న వేధింపుల కారణంగా భర్తకు దూరంగా ఉంటున్న మహిళ తన కుమారుడితో కలిసి జీవిస్తోంది.

- Advertisement -

కుటుంబ సమస్యల పరిష్కారం కోసం ప్రముఖ టెలివిజన్ కార్యక్రమం ‘బతుకు జట్కా బండి’లో పాల్గొనాలనే ఉద్దేశంతో ఆమె హైదరాబాద్‌కు వచ్చింది. అయితే సంబంధిత కార్యాలయాన్ని గుర్తించలేకపోవడంతో నిరాశతో తిరిగి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. ఈ సమయంలో స్టేషన్ పరిసరాల్లో ఆమెకు ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. కార్యక్రమ నిర్వాహకుల వద్దకు తీసుకెళ్తానని నమ్మించి రాణిగంజ్‌లోని హైదరీ కాంప్లెక్స్‌కు తీసుకెళ్లాడు. అక్కడ మరో వ్యక్తితో కలిసి మహిళపై ఇద్దరూ సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొంది. అనంతరం బాధితురాలు మహంకాళి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Also Read: Talasani Srinivas Yadav: క్యాన్సర్‌పై ముందస్తు పరీక్షలే ప్రాణరక్షణ…

నిందితుల్లో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకోగా మరోకరు పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్న అతడి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టినట్లు సమాచారం. అలాగే అదుపులోకి తీసుకున్న నిందితుడిని ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. అపరిచితుల మాటలు నమ్మి మోసపోవద్దని, ఇలాంటి పరిస్థితుల్లో వెంటనే సమీప పోలీస్‌స్టేషన్‌ను లేదా అత్యవసర పోలీసు సేవలను ఆశ్రయించాలని పోలీసులు ప్రజలకు సూచించారు. ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News