Thursday, March 12, 2026
HomeతెలంగాణMedaram: తెలంగాణ కుంభమేళాకి కేంద్ర మంత్రులు.. అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పణ

Medaram: తెలంగాణ కుంభమేళాకి కేంద్ర మంత్రులు.. అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పణ

Central Ministers Visit Medaram Maha Jatara: తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన ములుగు జిల్లా మేడారం మహా జాతర బుధవారం అట్టహాసంగా ప్రారంభమైంది. గద్దెపై కొలువుదీరిన వనదేవతలను దర్శించుకునేందుకు లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. భక్తుల రద్దీతో మేడారం ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా, అమ్మవార్లను నేడు కేంద్ర మంత్రులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 

- Advertisement -

Medaram Jatara ministers visit

కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జువల్ ఓరం, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి గురువారం మేడారం సమ్మక్క- సారలమ్మ అమ్మవార్ల దర్శనానికి విచ్చేశారు. రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్.. ప్రధాన ఆలయ ద్వారం వద్ద కేంద్ర మంత్రులకు ఘన స్వాగతం పలికారు. సాంప్రదాయ గిరిజన డప్పు చప్పుళ్ల మధ్య, మంత్రులను ఆలయంలోకి తీసుకెళ్లారు. అక్కడ ప్రత్యేక ఆచారాలు నిర్వహించారు. తరువాత వనదేవతలకు ‘నిలువెత్తు బంగారం’ (బెల్లం) సమర్పించి మొక్కులను నెరవేర్చుకున్నారు. అనంతరం మంత్రి ఓరం మీడియాతో మాట్లాడారు. 

Also Read: https://teluguprabha.net/telangana-news/bjp-state-president-ramchander-rao-reacted-to-kcr-receiving-sit-notices/

20 ఏళ్ల తర్వాత మళ్లీ మేడారం.. 

‘మేడారం మహా జాతర దేశంలోనే అతిపెద్ద గిరిజన పండుగ. దాదాపు 20 ఏళ్ల తర్వాత మళ్లీ మేడారం సందర్శించాను. ప్రధాని మోదీ ఆదేశాల మేరకు ఇక్కడికి రావడం సంతోషంగా ఉంది. ఈ ప్రాంత అభివృద్ధికి కేంద్రం పూర్తి మద్దతు ఇస్తుంది. జాతర సజావుగా సాగేందుకు నిధులతో పాటు, భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. గిరిజన సంక్షేమం కోసం కేంద్రం రూ. లక్ష కోట్లు కేటాయించింది. ప్రధానమంత్రి జన్‌మన్‌ పథకం కింద రూ. 24,000 కోట్లు ఖర్చు చేస్తున్నాం. తెలంగాణకు 23 ఏకలవ్య మోడల్‌ పాఠశాలలను మంజూరు చేశాం.’- కేంద్ర మంత్రి జువల్‌ ఓరం 

Medaram Jatara

ఈ సందర్భంగా పార్లమెంట్‌లో సీఎం ఎ. రేవంత్ రెడ్డితో ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. భగవాన్ బిర్సా ముండా వంటి గొప్ప గిరిజన నాయకుల వారసత్వం, త్యాగాలను కేంద్ర ప్రభుత్వం గౌరవిస్తుందని కేంద్ర మంత్రి జువల్‌ ఓరం అన్నారు. 

Medaram Jatara ministers

Also Read: https://teluguprabha.net/national-news/economic-survey-recommends-ban-on-junk-food-advertising-india-child-health/

సమ్మక్క–సారలమ్మ జాతర గిరిజన వర్గాలకు అతిపెద్ద పండుగ అని.. దాదాపు నెల రోజుల పాటు వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులతో మహా ప్రాంగణం కిటకిటలాడుతుందని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ ప్రాంతంలో అభివృద్ధి పనులను చేపడుతున్నాయన్నారు. ములుగు, లక్నవరం, మేడారం, తడ్వాయి, బొగత జలపాతాల వద్ద పర్యాటక అభివృద్ధికి రూ. 80 కోట్లు, రామప్ప ఆలయ అభివృద్ధికి రూ. 40 కోట్లు, సమ్మక్క–సారలమ్మ జాతర ఏర్పాట్ల కోసం రూ. 3.70 కోట్లు ఈ సంవత్సరం కేటాయించినట్లు తెలిపారు. సమ్మక్క–సారలమ్మ పేరుతో కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు అవుతోందని.. ఇందుకోసం రూ. 890 కోట్ల వ్యయంతో పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని చెప్పారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News