Medaram Jatara History : అది దట్టమైన కీకారణ్యం.. నాగరిక ప్రపంచానికి దూరంగా ఉన్న గిరిజన గూడెం.. కానీ మాఘ పౌర్ణమి వచ్చిందంటే చాలు ఆ అడవి జనసంద్రంగా మారుతుంది. ‘దక్షిణ కుంభమేళా’గా ఖ్యాతిగాంచిన మేడారం మహాజాతర కేవలం భక్తి ప్రపత్తుల వేడుక మాత్రమే కాదు.. అది రక్తంతో లిఖించిన ఒక వీర చరిత్ర. పసిబిడ్డగా పులులతో ఆడుకుని, పతిత పావనిగా మారి, నేడు కోట్లాది మందికి కొంగుబం గారమై నిలిచిన సమ్మక్క-సారలమ్మల వెనుక రోమాలు నిక్కబొడుచుకునే విషాద గాథ ఉంది.
వనదేవత ఆవిర్భావం: పులుల మధ్య పెరిగిన ఆడబిడ్డ : చరిత్ర పుటలను తిరగేస్తే.. సుమారు 12వ శతాబ్దంలో ప్రస్తుత మేడారం ప్రాంతాన్ని మేడరాజులు పాలించేవారు. వీరు కాకతీయ చక్రవర్తులకు సామంతులు. ఒకనాడు కోయదొరలు అడవిలో వేటకు వెళ్లగా, దట్టమైన పొదల్లో క్రూరమృగాలైన పులుల మధ్య నిర్భయంగా ఆడుకుంటున్న ఒక పసిపాప వారి కంటపడింది. ఆశ్చర్యచకితులైన గిరిజనులు ఆమెను దైవదత్తమైన వరంగా భావించి, గూడేనికి తీసుకువచ్చారు. మాఘ శుద్ధ పౌర్ణమి నాడు ఆమెకు ‘సమ్మక్క’ అని నామకరణం చేశారు. ఆమె పాదం మోపిన నాటి నుంచి ఆ గూడెంలో సిరుల పంట పండిందని, కష్టాలు తొలగిపోయాయని ప్రతీతి. యుక్తవయసు వచ్చాక సమ్మక్కను మేడరాజు మేనల్లుడైన పగిడిద్ద రాజుకిచ్చి వివాహం జరిపించారు. ఈ దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే ముగ్గురు సంతానం కలిగారు. వీరిలో సారలమ్మను గోవిందరాజుకు ఇచ్చి వివాహం చేశారు. అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో విధి విపత్కర రూపంలో వచ్చింది.
గోరు చుట్టుపై రోకటి పోటు: కాకతీయుల కఠిన ఆజ్ఞ : ఆ కాలంలో మేడారం ప్రాంతంలో తీవ్రమైన కరవు కాటకాలు సంభవించాయి. వానలు లేక, పంటలు పండక గిరిజనులు ఆకలితో అలమటించారు. సరిగ్గా అదే సమయంలో కాకతీయ సామ్రాజ్యాధినేత ప్రతాపరుద్రుడు కప్పం (పన్ను) కట్టాలని ఆదేశాలు జారీ చేశాడు. ఇప్పటికే తిండిలేక అల్లాడుతున్న తమపై పన్నుల భారం మోపడం ‘గోరు చుట్టుపై రోకటి పోటు’లా ఉందని పగిడిద్ద రాజు, సమ్మక్కలు ఆవేదన వ్యక్తం చేశారు. కప్పం కట్టేందుకు నిరాకరించారు. ఇది తన సార్వభౌమాధికారానికి సవాలుగా భావించిన ప్రతాపరుద్రుడు, గిరిజనులను అణచివేయడానికి భారీ సైన్యంతో మేడారంపై దండెత్తాడు.
లక్నవరం సరస్సు సాక్షిగా.. నెత్తుటి పోరాటం : గిరిజన సంప్రదాయ ఆయుధాలైన విల్లంబులు, గొడ్డళ్లతో కోయవీరులు కాకతీయ మహాసైన్యాన్ని ఎదుొన్నారు. ములుగు జిల్లాలోని లక్నవరం సరస్సు సమీపంలో భీకర యుద్ధం జరిగింది. ఒకవైపు శిక్షణ పొందిన కాకతీయ సైన్యం, మరోవైపు ఆత్మగౌరవం కోసం పోరాడుతున్న గిరిజన బిడ్డలు. ఈ పోరాటంలో పగిడిద్ద రాజు, కూతుళ్లు సారలమ్మ, నాగులమ్మ, అల్లుడు గోవిందరాజులు వీరోచితంగా పోరాడి నేలకొరిగారు.
ఈ వార్త విని తట్టుకోలేక, పరాభవం భరించలేక సమ్మక్క కుమారుడు జంపన్న, పక్కనే ఉన్న సంపెంగ వాగులోకి దూకి ఆత్మబలిదానం చేసుకున్నాడు. ఆ వీరుడి రక్తంతో ఆ వాగు నీరు ఎర్రగా మారిందని, అందుకే దానికి ‘జంపన్న వాగు’ అని పేరు వచ్చిందని స్థల పురాణం చెబుతోంది.
రణచండీగా మారిన సమ్మక్క.. చిలకల గుట్ట మిస్టరీ : భర్త, బిడ్డలు కళ్లెదుటే అసువులు బాయడంతో సమ్మక్క ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆమె సాక్షాత్తు కాళికాదేవిలా ఉగ్రరూపం దాల్చింది. రెండు చేతులతో కత్తులు ధరించి కాకతీయ సైన్యంపై విరుచుకుపడింది. ఆమె దాటికి శత్రు సైన్యం పిట్టల్లా రాలిపోయింది. సమ్మక్క వీరత్వాన్ని నేరుగా ఎదుర్కోలేని కాకతీయ సైనికులు, దొంగచాటుగా వెనుక నుంచి ఆమెను పొడిచారు. తీవ్ర గాయాలపాలైన సమ్మక్క, ఆ రక్తధారలతోనే ఈశాన్య దిశగా ఉన్న చిలకల గుట్ట వైపు వెళ్తూ.. అడవిలో మాయమైపోయింది. ఆమెను వెతుక్కుంటూ వెళ్లిన కోయదొరలకు, ఆమె అదృశ్యమైన చోట ఒక పుట్ట దగ్గర కేవలం ఒక ‘కుంకుమ భరిణె’ మాత్రమే కనిపించింది. ఆ భరిణెనే సమ్మక్క ప్రతిరూపంగా భావించి గిరిజనులు పూజించడం ప్రారంభించారు.
పశ్చాత్తాపం.. రెండేళ్లకోసారి మహాజాతర : ఒక వీరవనితను, ప్రజల కోసం పోరాడిన తల్లిని పొట్టనబెట్టుకున్నానని ప్రతాపరుద్రుడు తీవ్ర పశ్చాత్తాపానికి లోనయ్యాడు. తన తప్పును సరిదిద్దుకునేందుకు మేడారం ప్రాంతానికి కప్పం రద్దు చేసి, సమ్మక్క భక్తుడిగా మారి కానుకలు సమర్పించాడు. అంతేకాక, ఆ వీరవనితల త్యాగానికి గుర్తుగా రెండేళ్లకోసారి ఘనంగా జాతర జరపాలని రాజశాసనం చేశాడు.
నాటి నుంచి నేటి వరకు, మాఘ శుద్ధ పౌర్ణమికి ముందు వచ్చే బుధవారం ప్రారంభమై నాలుగు రోజుల పాటు ఈ జాతర వైభవంగా జరుగుతోంది. గుడి లేదు, గోపురం లేదు.. కేవలం గద్దెలపై కొలువై ఉన్న ఆ తల్లులను దర్శించుకునేందుకు భక్తజనం వెల్లువలా తరలివస్తుంది. గిరిజనుల ఆత్మగౌరవ ప్రతీకగా, భక్తికి నిదర్శనంగా మేడారం చరిత్రలో నిలిచిపోయింది.

