HomeతెలంగాణTG Assembly Sessions: అసెంబ్లీ తొలి రోజే రచ్చ‌రచ్చ

TG Assembly Sessions: అసెంబ్లీ తొలి రోజే రచ్చ‌రచ్చ

  • బీఆర్ఎస్, బీజేపీ నిరసనలతో అట్టుడికిన శాసనసభ ప్రాంగణం
  • శాసనసభ గేటు బయట టీషర్టులు విప్పి బనియన్లతో ఎమ్మెల్యేల ఆందోళన.. పోలీసుల తోపులాట
  • పలువురు ఎమ్మెల్యేలకు గాయాలు.. సునీతా లక్ష్మారెడ్డి కంటతడి
  • జగదీశ్‌రెడ్డికి అస్వస్థత.. నిమ్స్‌లో చేరిక
  • తాతా మధు వ్యాఖ్యలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. కేసీఆర్ క్షమాపణకు డిమాండ్
  • రాజీనామా చేయించండి.. లేకుంటే బర్తరఫ్ చేస్తామన్న ముఖ్యమంత్రి
  • నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నా.. స్పీకర్‌ను ఉద్దేశించి అనలేదన్న ఎమ్మెల్సీ తాతా మధు
  • 22‌ఏ భూములపై చర్చకు బీజేపీ పట్టు.. సభ నుంచి వాకౌట్
  • అసెంబ్లీ బయట నిరుద్యోగ జేఏసీ, బీజేవైఎం, ఆప్ నిరసనలు

హైదరాబాద్, సెప్టెంబర్ 7 (తెలుగుప్రభ): అసెంబ్లీ సమావేశాల తొలి రోజే తీవ్ర ఉద్రిక్తతలు, నిరసనలు, వాగ్వాదాలతో రణరంగాన్ని తలపించింది. ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ సోమవారం టీషర్టులతో సభకు వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ గేటు వద్ద పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. పలువురు ఎమ్మెల్యేలు గాయపడగా, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి అస్వస్థతకు గురై నిమ్స్‌లో చేరారు. మరోవైపు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు వ్యాఖ్యలపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. కేసీఆర్ క్షమాపణ చెప్పాలని, తాతా మధుతో రాజీనామా చేయించాలని, లేకుంటే బర్తరఫ్ చేస్తామని హెచ్చరించారు. ‘22-ఏ’ భూములపై చర్చకు అనుమతించలేదంటూ బీజేపీ వాకౌట్ చేయగా.. సభ వెలుపల నిరుద్యోగ జేఏసీ, బీజేవైఎం, ఆప్ ఆందోళనలతో తొలిరోజే అసెంబ్లీ పరిసరాలు ఉద్రిక్తంగా మారాయి. అసెంబ్లీ ప్రాంగణంలో ‘దుద్దిళ్ల శ్రీపాదరావు సెంట్రల్ హాల్’ను సీఎం రేవంత్‌రెడ్డి ఉదయమే ప్రారంభించారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌తో కలిసి ముఖ్యమంత్రి సెంట్రల్ హాల్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

- Advertisement -

గేటు వద్దే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అడ్డగింత
ప్రభుత్వ వైఫల్యాలను ప్రతిబింబించేలా నినాదాలు ముద్రించిన టీషర్టులు ధరించి అసెంబ్లీకి హాజరయ్యేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రయత్నించారు. అయితే అభ్యంతరకర నినాదాలు ఉన్న టీషర్టులతో సభలోకి అనుమతించబోమని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పోలీసుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. మాజీ మంత్రి హరీశ్‌రావు టీషర్ట్ విప్పి బనియన్తో నిరసన తెలిపారు. పలువురు ఎమ్మెల్యేలు కూడా టీషర్టులు విప్పి ఆందోళనకు దిగారు. తోపులాటలో పలువురు ఎమ్మెల్యేలకు గాయాలయ్యాయి. ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి కంటతడి పెట్టారు. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డికి బీపీ పెరగడంతో అస్వస్థతకు గురై నిమ్స్‌లో చేరారు. తమను అసెంబ్లీలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులపై చర్యలు తీసుకోవాలని, తమను సభలోకి వెళ్లకుండా అడ్డుకోరాదని కోరారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. ఎమ్మెల్యేలను సభలోకి వెళ్లకుండా అడ్డుకోరాదని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

తాతా మధు వ్యాఖ్యలపై సీఎం ఫైర్
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలు అసెంబ్లీలో ప్రధాన రాజకీయ వివాదంగా మారాయి. ఈ వ్యవహారంపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. స్పీకర్ పదవిని అవమానించేలా వ్యాఖ్యలు చేయడం సహించబోమని స్పష్టం చేశారు. తాతా మధుతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయించాలని కేసీఆర్‌ను డిమాండ్ చేశారు. రాజీనామా చేయించకపోతే ప్రభుత్వమే చర్యలు తీసుకుని బర్తరఫ్ చేస్తుందని హెచ్చరించారు. కేసీఆర్ స్వయంగా స్పీకర్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. స్పీకర్‌కు మద్దతుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సంఘీభావం తెలిపారు. తాతా మధు వ్యాఖ్యలను ఖండిస్తూ మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని కాంగ్రెస్ పిలుపునిచ్చింది. తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన ఎమ్మెల్సీ తాతా మధు.. తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. తాను స్పీకర్‌ను ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదని, స్పీకర్ పదవిపై తనకు గౌరవం ఉందని పేర్కొన్నారు.

బీజేపీ వాకౌట్
అసెంబ్లీలో 22‌ఏ భూముల అంశం వేడిని పెంచింది. ఈ అంశంపై బీజేపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించడంతో బీజేపీ ఎమ్మెల్యేలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి నేతృత్వంలో సభ్యులు తక్షణమే చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. 22ఏ భూముల వ్యవహారంలో అక్రమాలపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది. గతంలో ప్రభుత్వం ప్రకటించిన ఫోరెన్సిక్ ఆడిట్ పరిస్థితి ఏమిటని ప్రశ్నించింది. స్పీకర్ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడంతో బీజేపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.

సభ వెలుపలా నిరసనల హోరు
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సభ వెలుపల కూడా పలు సంఘాలు, రాజకీయ పార్టీలు నిరసనలకు దిగాయి. ఉద్యోగాల కల్పనలో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపిస్తూ తెలంగాణ నిరుద్యోగ జేఏసీ అసెంబ్లీ ముట్టడికి యత్నించింది. ఈ సందర్భంగా పోలీసులు, జేఏసీ సభ్యుల మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ఒక జేఏసీ సభ్యురాలు, ఓ కానిస్టేబుల్ గాయపడ్డారు. ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు సైతం అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. ఓ కార్యకర్త పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించగా పోలీసులు అప్రమత్తమై అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం కార్యకర్తలు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. బీజేపీ శ్రేణులు కూడా అసెంబ్లీ ప్రధాన గేటు వద్ద రోడ్డుపై పడుకొని నిరసన తెలిపారు. బీఆర్ఎస్ ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేల పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించారన్న ఆరోపణలపై ఎస్సీ, ఎస్టీ కమిషన్ స్పందించింది. ఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య డీజీపీని ఆదేశించారు. అసెంబ్లీ గేటు వద్ద జరిగిన పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ వ్యూహంపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టత ఇచ్చారు. రేపటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ సభ్యులు తప్పనిసరిగా హాజరవుతారని తెలిపారు. సభలో ప్రజా సమస్యలను లేవనెత్తుతామని చెప్పారు.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News