- తమకు అన్యాయం జరిగిందని 200 మంది ఆవేదన
- సెప్టెంబరు 15న ఎన్నికలు.. మెడికల్ వ్యాపారికి లీగల్ నోటీసులు
- మగ్గం, నేత పనికి సంబంధించిన ఆధారాలు చూపాలని అల్టిమేటం
హైదరాబాద్, సెప్టెంబర్ 13 (తెలుగుప్రభ): నల్గొండ జిల్లా నకిరేకల్ చేనేత సహకార సంఘం (నెం.390/టీహెచ్)లో సభ్యత్వాలు, ఎన్నికల ప్రక్రియపై వివాదం ముదురుతోంది. చేనేత వృత్తినే నమ్ముకున్న సుమారు 200 మంది నేత కార్మికులను పక్కనబెట్టి.. వృత్తితో సంబంధం లేని వారికి సభ్యత్వాలు కల్పించారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో వారు న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. సొసైటీ పరిధిలోని పొషం నిర్మలతో పాటు మరో ఎనిమిది మంది బాధితులు న్యాయవాది ఏ.చంద్రవతి ద్వారా స్థానిక మెడికల్ వ్యాపారి చిలుకూరి లక్ష్మీనర్సయ్యకు లీగల్ నోటీసు ఇచ్చారు. నర్సయ్య చేనేత వృత్తిలో ఉన్నారా? మగ్గంపై పనిచేస్తున్నారా? సొసైటీ నుంచి నూలు, ముడిసరుకు పొందిన రికార్డులు ఉన్నాయా? తదితర వివరాలను వెల్లడించాలని నోటీసులో కోరినట్లు బాధితులు తెలిపారు.
మెడికల్ వ్యాపారికి సభ్యత్వమా?
చేనేత సహకార చట్టం–1964 ప్రకారం చేనేత వృత్తితో ప్రత్యక్ష సంబంధం ఉన్నవారికే సభ్యత్వం ఉండాలని బాధితులు పేర్కొన్నారు. నిత్యం మెడికల్ వ్యాపారం నిర్వహించే వ్యక్తికి చేనేత సంఘంలో సభ్యత్వం ఎలా లభించిందని ప్రశ్నించారు. మగ్గంపై పనిచేసిన ఆధారాలు, నూలు తీసుకున్న వివరాలు, ఉత్పత్తి చేసిన వస్త్రాల రికార్డులు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. బంధువులు, బినామీలకు సభ్యత్వాలు కల్పించి సంఘంపై ఆధిపత్యం కొనసాగిస్తున్నారనేది వారి ఆరోపణ.
నూలు.. రిబేట్లు ఎవరికి?
సొసైటీలకు ప్రభుత్వం, చేనేత శాఖ ద్వారా అందే నూలు, ముడిసరుకు, రిబేట్లు, సబ్సిడీ ప్రయోజనాలు అర్హులైన నేత కార్మికులకు దక్కడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. సభ్యుల అర్హతలు, నూలు పంపిణీ, ఉత్పత్తి వివరాలను అధికారులు సమగ్రంగా పరిశీలించాలని కోరుతున్నారు.
హైకోర్టును ఆశ్రయించిన బాధితులు
ఈ వ్యవహారంపై 2019లో హైకోర్టును ఆశ్రయించినట్లు బాధితులు తెలిపారు. అనంతరం ఆర్.సీ.నెం.55/2019–సీ కింద శాఖాపరంగా విచారణ జరిగినా సమస్య పరిష్కారం కాలేదని పేర్కొన్నారు.
సెప్టెంబర్ 15న ఎన్నికలు
సెప్టెంబరు 5 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై.. సెప్టెంబరు 15న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సభ్యత్వాల అర్హతలపై అధికారులు స్పష్టత ఇవ్వాలని బాధితులు కోరుతున్నారు. అక్రమ సభ్యత్వాలతో ఎన్నికల ప్రక్రియను కొనసాగిస్తే రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ, సహకార ట్రిబ్యునల్, హైకోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. నిజమైన నేత కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

